బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న డెంగూ.. 1000 మంది మృతి! ఆస్పత్రుల్లో 20 వేల మంది

- పర్యావరణ మార్పుల వల్లే విపరీతంగా వ్యాప్తి
విధాత: భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh) లో డెంగూ (Dengue) విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల్లోనే సుమారు 1000 మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడి మరణించారు. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికం కావడం గమనార్హం. ఇప్పటికీ దీని బారిన పడుతుండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. డెంగూ ఇలా ముసురుకోవడానికి దేశంలో వచ్చిన వాతావరణ మార్పులే కారణమని అక్కడి వైద్యులు భావిస్తున్నారు.
ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువ కనిపించే ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తీవ్రమైన జ్వరం, తలపోటు, నీరసం, వాంతులు, కండరాల నొప్పి తదితర లక్షణాలు రోగిని ఊపిరిసలపకుండా చేస్తాయి. కొన్ని తీవ్రమైన కేసులలో రక్తస్రావం కూడా జరిగి ప్రాణాలు కోల్పోతారు. మానవ చర్యల కారణంగా ప్రకృతిలో వస్తున్న విపరీత మార్పుల వల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందే చికెన్‌గున్యా, డెంగూ, ఎల్లో ఫీవర్, జికా తదితర వ్యాధుల బారిన ఎక్కువ మంది పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో 1,006 మంది చనిపోయారని, మరో 20 వేల మంది చికిత్స పొందుతున్నారని ఆ దేశ ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. 2000 సంవత్సరం తర్వాత డెంగూతో చనిపోయిన వారి సంఖ్యను తీసుకున్నా 2023లోనే ఆ వ్యాధితో మరణించిన వారి సంఖ్య కంటే తక్కువే అంటే తాజా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ మాజీ డైరెక్టర్ బి నజీర్ పేర్కొన్నారు. రుతుపవనాల్లో వర్షాభావ స్థితి ఏర్పడటం, ఎండలు మండిపోయి ఉష్ణోగ్రతలు కిందకి దిగి రాకపోవడం డెంగూ వ్యాప్తికి దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ వ్యాధిని వ్యాప్తి చేసే ఆడిస్ దోమ.. వైరస్ వృద్ధి చెందడానికి కావాల్సిన ఉష్ణోగ్రతను ఇస్తోందని పేర్కొంటున్నారు. దీనికి కారణం బయటి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడమేనని వారి అభిప్రాయం. మరోవైపు డెంగూ రెండు, మూడు సార్లు సోకుతూ ఉంటే ఆ రోగి మరణానికి చేరువైనట్లే నని వైద్యులు చెబుతున్నారు. నీరు నిల్వ ఉంటే అక్కడ ఆడిస్ దోమ సంతానం వృద్ధి చెందుతుంది కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అంతే కాకుండా డెంగూ రాకుండా లేదా తగ్గిపోవడానికి ప్రత్యేకంగా మందులేమీ లేవని గుర్తించాలని పేర్కొన్నారు.