నల్లగొండ: BCల రణం..! ఎన్నికల ముందు కుల సంఘాల గళం!!
ధాత: ఎన్నికల సమీపిస్తున్న కొద్ది నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల్లో టికెట్ల కోసం ఆశావహుల మధ్య సాగుతున్న పోటీని బీసీ నినాదం మరింత రసవత్తరంగా మారుస్తుంది. గతంలో కాంగ్రెస్, టీడీపీలలో ఇదే నియోజకవర్గం నుంచి సుంకరి మల్లేశం గౌడ్, వంగాల స్వామి గౌడ్‌లు ప్రతి ఎన్నికలవేళ బీసీ నినాదాన్ని బలంగా తెర పైకి తేవడం అప్పట్లో ఆ పార్టీల అధిష్టానాలకు, సీనియర్లకు, ఆనాటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గుబులు పుట్టించేది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమగాలిలో బీసీల నినాదం […]

ధాత: ఎన్నికల సమీపిస్తున్న కొద్ది నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల్లో టికెట్ల కోసం ఆశావహుల మధ్య సాగుతున్న పోటీని బీసీ నినాదం మరింత రసవత్తరంగా మారుస్తుంది. గతంలో కాంగ్రెస్, టీడీపీలలో ఇదే నియోజకవర్గం నుంచి సుంకరి మల్లేశం గౌడ్, వంగాల స్వామి గౌడ్‌లు ప్రతి ఎన్నికలవేళ బీసీ నినాదాన్ని బలంగా తెర పైకి తేవడం అప్పట్లో ఆ పార్టీల అధిష్టానాలకు, సీనియర్లకు, ఆనాటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గుబులు పుట్టించేది.
తెలంగాణ ఏర్పాటు ఉద్యమగాలిలో బీసీల నినాదం కాస్తా జిల్లాలో బలహీనమైపోయింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న సుంకరి మల్లేశం గౌడ్, కాంగ్రెస్ నేత తండు సైదులు గౌడ్ లు మరోసారి నల్గొండ వేదికగా బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా గౌడ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించు కోవడంతో పాటు మరోసారి బీసీ నినాదాన్ని రాజేయడం ప్రధాన పార్టీల నాయకత్వానికి మునుముందు కొత్త తలనొప్పులు సృష్టించేదిగా కనిపిస్తుంది.
జిల్లా గౌడ సంఘ సమావేశంలో అన్ని పార్టీల గౌడ నాయకులు హాజరవ్వడం గమనార్హం. ఈ సమావేశ నిర్వాహణలో బిఆర్ఎస్ నాయకులు సుంకరి మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు తండు సైదులు గౌడ్, కనగల్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, సాగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాకునూరి నారాయణ గౌడ్ కీలక భూమిక పోషించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు థామాషా మేరకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించేలా ప్రధాన పార్టీలపై ఒత్తిడి పెంచే వ్యూహాలు ఉదృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడం విశేషం.
బీసీలు, గౌడ్‌ల కోసం వెయ్యి మందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, ప్రతి వారం ఒక గౌడు ఇంటికి వెళ్లి 100 మందితో సమావేశాలు నిర్వహించాలని, వచ్చే ఆదివారం రెండో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. గౌడ సంఘం సమావేశం జరుగుతున్న క్రమంలోని ఇదే రోజు ఇంకోవైపు స్ధానిక రజక సంఘం సమావేశం జరిగిన తీరు ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కుల సంఘాల రాజకీయాలు జోరందుకుంటున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది.
బీసీ అస్త్రం ఫలించేనా..?!
సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో గతంలో బీసీల నినాదం ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో ప్రధాన పార్టీలకు సవాల్ గా నిలిచేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పిదప బిఆర్ఎస్ పార్టీ సాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దివంగత నోముల నరసింహయ్యకు, తదుపరి ఆయన కుమారుడు నోముల భగత్ కు టికెట్లు కేటాయించింది. పెద్దగా ఉద్యమ నేపథ్యము, పార్టీ సీనియారిటీ లేకపోయినా బడుగుల లింగయ్య యాదవ్ కు రాజ్యసభ పదవిని, కోదాడలో బొల్లం మల్లయ్యకు టికెట్ ఇచ్చారు.
భువనగిరి నుండి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు సైతం రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు. హుజూర్‌నగర్ లో 2014లో దివంగత కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కు బిఆర్ఎస్ అవకాశమిచ్చినా ఓడిపోయే సీటు ఇచ్చారంటూ బీఆర్ఎస్ విమర్శలు ఎదుర్కొంది. కాంగ్రెస్ నుండి గత ఎన్నికల్లో మిర్యాలగూడలో బీసీ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యకు, ఆలేరులో బూడిద భిక్షమయ్యగౌడ్ కు అవకాశం ఇచ్చారు. అనంతరం కృష్ణయ్య ఏపీ నుండి వైకాపా తరపున రాజ్యసభకు ఎంపికవగా, బూడిద బిఆర్ఎస్ నుండి బిజెపికి, అటు నుండి తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరారు.
వచ్చే ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నుండి పిల్లి రామరాజు యాదవ్, కొత్తగా సుంకరి మల్లేశం, కాంగ్రెస్ నుండి తండు సైదులు గౌడ్, బిజెపి నుండి మాదగోని శ్రీనివాస్ గౌడ్ లు టికెట్ ఆశిస్తున్నారు. ఆలేరులో కాంగ్రెస్ నుండి బీర్ల ఐలయ్య యాదవ్, బీజేపీ నుండి కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, భువనగిరి బిజెపి నుండి అసెంబ్లీ, లోక్ సభకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టికెట్ రేసులో ఉన్నారు.
మునుగోడులో కాంగ్రెస్ నుండి చెరుకు సుధాకర్ గౌడ్ , పున్న కైలాష్, బిఅర్ఎస్ నుండి పల్లె రవి గౌడ్, కర్నె ప్రభాకర్ లు టికెట్లు ఆశిస్తున్నారు. అయితే బీసీల నినాదం ఎన్నికల నాటికి ఎంత బలంగా తెరపైకి వస్తే ఆ మేరకు ప్రధాన పార్టీల నుండి బీసీలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లలో, రెండు పార్లమెంట్ సీట్లలో ఒకటి, రెండైనా టికెట్లు దక్కే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో టికెట్ల సాధన దిశగా బీసీ సంఘాలు తమ పోరాటాలను ఉదృతం చేయాలని భావిస్తుండటం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది.