బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వినాశనమే: రాజా
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర, ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా ఓడించాలి తెలంగాణలో కూడా ఇదే వైఖరి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విధాత: మరోసారి బీజేపీ, మోడీ అధికారంలోకి వస్తే దేశ వినాశనం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా హెచ్చరించారు. కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, అందుకు భిన్నంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ […]

- ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
- వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర, ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా ఓడించాలి
- తెలంగాణలో కూడా ఇదే వైఖరి
- తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
విధాత: మరోసారి బీజేపీ, మోడీ అధికారంలోకి వస్తే దేశ వినాశనం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా హెచ్చరించారు. కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, అందుకు భిన్నంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ నిరంకుశ విధానాలను అమలు పరుస్తున్నారని విమర్శించారు.
దేశాన్ని వినాశనం దిశగా తీసుకుపోతున్నారని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థలను పరిరక్షించుకోవాలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలయికను 2024 ఎన్నికల్లో తప్పక ఓడించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మగ్దుమ్‌భవన్‌లో బుధవారం జరిగిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్తో సహా సహా దేశ వ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ, అమిత్ షా ప్రసంగాలను పరిశీలిస్తే, ఆ నేతల్లో నిరాశ, భయాందోళనలు స్పష్టమవుతున్నదన్నారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు, త్వరలో జరిగే త్రిపుర, నాగాల్యాండ్ ఎన్నికల ఫలితాలపై దేశ మంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫాసిస్టు శక్తులను ఏకాకిని చేసి 2024 ఎన్నికల్లో ఓడించాలని, ఇందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీల ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని రాజా చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే రాజకీయ అవగాహనతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. జీవనోపాధి సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించడం ద్వారా కమ్యూనిస్టు పార్టీని శక్తివంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జర్నలిస్టులకు శుభాకాంక్షలు
తన ప్రసంగం ప్రారంభంలో బుధవారం జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్టులకు సీపీఐ తరుపున డి.రాజా శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు.