బీజేపీలో ‘బండి’.. గుదిబండ అయ్యాడా?

పాత, కొత్త తరం మధ్య అంతర్గత పోరులో బీజేపీ సంజయ్‌ దూకుడు శృతిమించి నష్టం చేస్తున్నదన్న బీజేపీ పాత కాపులు చేరిక‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు.. విధాత: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీలో సమిష్టితత్వం, సమైక్యత కనిపించటం లేదు. రాష్ట్ర అవతరణ తర్వాత మొదటి ఐదేండ్లు వేచి చూసే ధోరణితో ఆచి తూచి వ్యవహరించిన బీజేపీ, రెండో దఫా కేసీఆర్‌ అధికారం చేపట్టిన తర్వాత దూకుడు పెంచింది. పాదయాత్ర, బస్సు […]

బీజేపీలో ‘బండి’.. గుదిబండ అయ్యాడా?
  • పాత, కొత్త తరం మధ్య అంతర్గత పోరులో బీజేపీ
  • సంజయ్‌ దూకుడు శృతిమించి నష్టం చేస్తున్నదన్న బీజేపీ పాత కాపులు
  • చేరిక‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు..

విధాత: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీలో సమిష్టితత్వం, సమైక్యత కనిపించటం లేదు. రాష్ట్ర అవతరణ తర్వాత మొదటి ఐదేండ్లు వేచి చూసే ధోరణితో ఆచి తూచి వ్యవహరించిన బీజేపీ, రెండో దఫా కేసీఆర్‌ అధికారం చేపట్టిన తర్వాత దూకుడు పెంచింది. పాదయాత్ర, బస్సు యాత్రల పేరిట విమర్శ నాస్త్రాలు, వ్యక్తిగత దూషణలు మొదలు ఆకాశమే హద్దుగా బండి సంజయ్‌ సవాళ్లు విసురుతున్నారు. వచ్చే ప్రభుత్వం తమదేనని ప్రకటిస్తున్నారు.

ప్రజాసంగ్రామ యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బండి సంజయ్‌ చేస్తున్నది పాదయాత్ర కాదు, ఓ రకంగా రాజకీయంగా ఓ దండయాత్రే అని చెప్ప‌వ‌చ్చు. ఈ క్రమంలో విమర్శలు శృతిమించి దూషణల దాకపోతున్న తీరును కొందరు బీజేపీ పాత కాపులే తప్పు పడుతున్నారు. మరో వైపు బండి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్లు, సంఘ్‌ పరివార్‌కు ప్రాధాన్యం ఇవ్వటం లేదని బండిపై గుర్రుగా ఉన్నారు.

ప్రస్తుత కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే.. పాత, కొత్త నాయకత్వం సమిష్టిగా, సమైక్యంగా ముందుకు పోవాలని అంటున్నారు. కానీ అంతటా తానే అన్నట్లుగా సంజయ్‌ వ్యవహరిస్తూ ఎవరినీ దగ్గరకు రానివడం లేదని కినుక వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బీజేపీ సీనియర్లు స్వేచ్ఛగా పని చేయకుండా ముకు తాడు వేస్తున్నాడు. ఎవరైనా ప్రెస్‌మీట్లకే పరిమితం కావాలని కట్టడి చేస్తున్నాడని అంటున్నారు. ఈ విషయంలో విజయశాంతి పలుమార్లు మీడియా ముందకు వచ్చి తన ఆవేదనను మీడియా ముందు కూడా పెట్టింది. తనను ఉపయోగించుకోవడం లేదని మూలకు పడేశారని బండి సంజయ్‌పై బాహాటంగానే ఆరోపణలు చేసింది.

పైగా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవటానికి చేరికలకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి.. అడ్డుకొంటున్నాడనే ఆరోపణలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని మోదీ-షా ద్వయం పట్టుదలతో ఉన్నది. ఆ క్రమంలోనే చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఈటలను బాధ్యునిగా ఓ కమిటీనే వేశారు. ఈ పరిస్థితుల్లో చేరికలు ముమ్మరంగా కొనసాగాల్సింది పోయి నిలిచి పోవటానికి బండి వ్యవహారమే కారణమనే ఆరోపణలున్నాయి.

మరో వైపు వచ్చే ఎన్నికల నాటికి పాత, కొత్తలను కలుపుకుపోయే విధంగా అందరి ఆమోదయోగ్యుడైన రాష్ట్ర అధ్యక్షుడు ఉంటేనే మేలనే వాదన ముందుకు వస్తున్నది. ఈ పరిస్థితి బండికి మింగుడు పడటం లేదంటున్నారు. ఇటీవలే విజయశాంతి తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తన సేవలను పార్టీ సరిగ్గా వినియోగించుకోవడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అలాగే మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ఓటమికి కారణం బీజేపీ రాష్ట్ర పెద్దల మధ్య అనైక్యైతే అనే విమర్శలూ వచ్చాయి.

టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఈటల, వివేక్‌, జితేందర్‌రెడ్డి, కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమ లాంటి నేతలు అడపాదడపా మీడియాలో కనిపిస్తున్నారు. అంతేగానీ పార్టీలో వారికి పెద్దగా బాధ్యతలు ఇస్తున్నట్టు లేదు. టీవీ చర్చల్లోనూ, మీడియా సమావేశంలోనూ బండి సంజయ్‌ అనుచరులకే పెద్దపీట వేస్తున్నారు.

ఈటల రాజేందర్‌ను రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్‌గా నియమించినప్పటికీ ఆయన ద్వారా పార్టీలో వచ్చే వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే వాదనలు ఉన్నాయి. అందుకే పార్టీని వీడిన బూడిద భిక్షమయ్య, దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్‌లో ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాల పట్ల విముఖత వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర బీజేపీలో కంటికి కనిపించని అంతర్గత ఆధిపత్య పోరేదో నడుస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

సైద్ధాంతిక పునాదిగా నిర్మితమైన బీజేపీలో చేరికలతో ఒనగూడిన బలంతో పాటు, బలహీనతలు వచ్చి చేరాయి. ఫక్తు రాజకీయ పార్టీలకుండే బలహీనతలన్నీ ఆవరించాయి. ఆ క్రమంలోంచే ఎన్నడూ లేని విధంగా బీజేపీలో లుకలుకలు కనిపిస్తున్నాయి. ఎంతైనా సైద్ధాంతిక పునాది గల వాజపేయి తరం నాటి బీజేపీ కాదు, నేటి బీజేపీ. అధికారమే పరమావధిగా చేరి కూరిన బీజేపీ అతుకుల బొంతలా కళా విహీనంగా, శక్తి హీనంగా ఉండటం, తయారవటం సహజమే.