Telangana BJP | బీజేపీకి అధికారం సరే, అభ్యర్థులున్నారా?
బీఆర్‌ఎస్‌కు తామే అసలు సిసలైన ప్రత్యామ్నాయమంటున్న బీజేపీ నేతలు చాలా జిల్లాల్లో పోటీకి అభ్యర్థులేరి? ఉమ్మడి జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లలో కొన్ని చోట్లే టికెట్ కోసం పోటీ ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో అభ్యర్థుల కోసం అన్వేషణ ఆర్థికంగా, నియోజకవర్గంలో కొంత బలం ఉన్న నేతలను పార్టీలోకి తెచ్చే ప్రయత్నం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని బీజేపీ నేతలు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నారు. అయితే […]

- బీఆర్‌ఎస్‌కు తామే అసలు సిసలైన ప్రత్యామ్నాయమంటున్న బీజేపీ నేతలు
- చాలా జిల్లాల్లో పోటీకి అభ్యర్థులేరి?
- ఉమ్మడి జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లలో కొన్ని చోట్లే టికెట్ కోసం పోటీ
- ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో అభ్యర్థుల కోసం అన్వేషణ
- ఆర్థికంగా, నియోజకవర్గంలో కొంత బలం ఉన్న నేతలను పార్టీలోకి తెచ్చే ప్రయత్నం
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని బీజేపీ నేతలు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నారు. అయితే నిజంగానే ఆ పార్టీకి అంత బలం ఉన్నదా? ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టగలిగే స్థితిలో ఉన్నదా?
విధాత : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ (Telangana BJP) నేతలు కుండబద్దలుకొట్టకుండానే చెబుతున్నారు. అధికారం సంగతి పక్కనపెడితే.. అసలు ఆ పార్టీకి మొత్తం 119 నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి అభ్యర్థులు (Candidates)ఉన్నారా? అంటే ప్రశ్నార్థకాలే ఎదురవుతున్నాయి.
మొన్న మూడు సిటింగ్‌లూ పోయాయి
గత ఎన్నికల్లో వందకుపైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ.. 2014లో సిట్టింగ్ స్థానాలైన ముషీరాబాద్ (Musheerabad), అంబర్‌పేట (Amberpet), ఉప్పల్ (Uppal), ఖైరాతాబాద్ (Khairtabad) కోల్పోయి గోషామహల్(Goshamahal) ను మాత్రమే నిలబెట్టుకున్నది. దుబ్బాక (Dubbaka) ఉప ఎన్నికలో రఘునందన్ రావు విజయం సాధించడం, అధికారపార్టీతో తలెత్తిన విభేదాలతో పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ (Eetala Rajender) హుజురాబాద్‌లో తిరిగి గెలవడం మినహా బీజేపీ పెద్దగా సాధిందేమీ లేదు. నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ బలం ఎంతో తెలిసిందే.
బీజేపీలో చేరింది అసంతృప్త నేతలే
అధికారపార్టీపై అసంతృప్తితోనో, లేదా ఇతర పార్టీల్లో తమకు టికెట్ దక్కే అవకాశం లేదనో అలాంటి నేతలు బీజేపీ గూటికి చేరారు. అట్లా చేరిన వారిని కొంతమంది నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులు దక్కించుకున్నారు. వాళ్లు ఇక వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఖాయమనుకుంటున్న సమయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ (Sunil Bansal) వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో ఎన్నికల నాటికి ఆ పార్టీలో ఎంతమంది ఉంటారో ఎంత మంది వీడుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ వేట
ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం బలమైన అభ్యర్థుల వేటలో పడింది. ఆర్థికంగా, నియోజకవర్గంలో కొంత బలం ఉన్న నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతానికి ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనే బీజేపీ టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ లెక్కన 45-50 స్థానాల్లో మాత్రమే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీ ఇవ్వగలిగే నేతలు ఉన్నారు.
మిగిలిన 60 స్థానాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నా వాళ్లు నామమాత్రపు పోటీ మాత్రమే ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు. ఈ లెక్కన అధికారంలోకి వస్తామంటున్న నేతలు, ఎలాగైనా అధికారంలోకి రావాలి అంటున్న జాతీయ నేతలకు వాస్తవ పరిస్థితులు అర్థమైనట్టు ఉన్నాయి. అందుకే వీలైనంత త్వరగా బలమైన అభ్యర్థులను పార్టీలోకి తీసుకుని రావాలని, వాళ్లందరితో రానున్న ఏడెనిమిది నెలలు నియోజకవర్గాల్లోనే విస్తృతంగా పర్యటించేలా, ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం.
ఖమ్మంలో సందేహమే
తాజా పరిస్థితులను గమనిస్తే ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో కమలం పార్టీ ఖాతా తెరుస్తుందా? అనే సందేహం ఆ పార్టీ నేతల్లోనే నెలకొన్నది. అలాగే ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల వేటలో పడిందని తెలుస్తోంది. అందుకే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home Minister Amisth Sha) పార్టీ ముఖ్యనేతల భేటీలో కొత్త, పాత నేతలు కలిసి పనిచేయాలని, అభిప్రాయ విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని, పార్టీల్లో చేరికలు పెరగాలని నేతలకు సూచించింది దీని కోసమేనట. అధికారపార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్న నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం చేసిన సూచనలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు విస్తుపోయేలా చేశాయని సమాచారం.