BJP | ఓరుగల్లుపై పట్టు కోసం బీజేపీ గట్టి ప్రయత్నం.. నాయకులకు నిరంతర కార్యక్రమాలు

ముఖ్యనేతల హాజరు ముగిసిన ప్రజా సమస్యలపై కార్నర్ మీటింగ్‌లు బూత్ స్థాయి పార్టీ బలోపేతం పై కేంద్రీకరణ ఈనెల 12 నుంచి 20 వరకు మీటింగ్‌లు వచ్చే ఎన్నికలలో గట్టి పోటీ లక్ష్యం  ఓరుగల్లు (Warangal) జిల్లాలో పట్టు బిగించి పార్టీని బూతు స్థాయిలో బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు పార్టీ జాతీయ నాయకత్వం అందిస్తున్న కర్తవ్యాలను భుజాన వేసుకొని, అటు ప్రజల్లోకి ఇటు పార్టీ […]

BJP | ఓరుగల్లుపై పట్టు కోసం బీజేపీ గట్టి ప్రయత్నం.. నాయకులకు నిరంతర కార్యక్రమాలు
  • ముఖ్యనేతల హాజరు
  • ముగిసిన ప్రజా సమస్యలపై కార్నర్ మీటింగ్‌లు
  • బూత్ స్థాయి పార్టీ బలోపేతం పై కేంద్రీకరణ
  • ఈనెల 12 నుంచి 20 వరకు మీటింగ్‌లు
  • వచ్చే ఎన్నికలలో గట్టి పోటీ లక్ష్యం

ఓరుగల్లు (Warangal) జిల్లాలో పట్టు బిగించి పార్టీని బూతు స్థాయిలో బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు పార్టీ జాతీయ నాయకత్వం అందిస్తున్న కర్తవ్యాలను భుజాన వేసుకొని, అటు ప్రజల్లోకి ఇటు పార్టీ శ్రేణుల్లోకి జిల్లా బీజేపీ ప్రధాన నాయకులు వెళ్తున్నారు. నిరంతర కార్యక్రమాలతో పార్టీని చర్చనీయాంశంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి (state level) ముఖ్యనేతలు బండి సంజయ్ (Bandi Sanjay), ఈటల రాజేందర్ (Etela Rajender) తదితరులు క్రమం తప్పకుండా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆశాభావ దృక్పథం తప్ప అనుకున్నంత సానుకూల పరిస్థితులు నియోజకవర్గాలలో లేవనేది పరిశీలకుల భావన.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించేందుకు (BJP) బీజేపీ అగ్ర నాయకత్వం పథక రచన చేస్తోంది. పట్టున్న నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తుంది. స్థానిక నాయకులతోపాటు రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాంతాలపై కేంద్రీకరించి పనిచేస్తోంది.

కేసీఆర్ కుటుంబంపై విమర్శలు

అధికార బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ (kcr) కుటుంబంపై విమర్శల దాడిని చేపట్టి, రాజకీయ విమర్శలు చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముందుంటున్నారు.

ఎమ్మెల్యేలు (mla’s) లక్ష్యంగా విమర్శలు

నియోజకవర్గాల వారిగా స్థానిక ఎమ్మెల్యేలపై జిల్లా నాయకత్వం విమర్శలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలే లక్ష్యంగా ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను 11 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 12 స్థానాల్లో బీజేపీ బలమైన పార్టీగా లేకున్నప్పటికీ, ఆయా నియోజకవర్గాలలో ఆశావాహ అభ్యర్థులు బీఆర్ఎస్‌తో పోటీకి సిద్ధమవుతున్నారు.

భూపాల్ పల్లిలో చందుపట్ల కీర్తి రెడ్డి, పరకాలలో విజయ చందర్ రెడ్డి, జనగామలో దశమంత రెడ్డి, హనుమకొండలో రావు పద్మ, మార్తినేని ధర్మారావు, వరంగల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు, సతీష్ బాబు, వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్, నర్సంపేటలో రేవూరి ప్రకాశ్ రెడ్డి, మానుకోటలో హుస్సేన్ నాయక్ తదితరులు క్రియాశీలకంగా భాగస్వామ్యమైతున్నారు. తమ తమ బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాలలో పార్టీ శ్రేణులను తమ స్థాయి మేరకు కదిలించే ప్రయత్నం చేస్తున్నారు.

కార్నర్ మీటింగులు సక్సెస్ (success)

బీజేపీ నాయకుల ప్రయత్నం ఒక మేరకు సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ ఉత్సాహంతో ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా గల్లి స్థాయిలో చర్చ ప్రారంభించే ఉద్దేశంతో ప్రజా గోస – బీజేపీ భరోసా’లో కార్నర్ మీటింగులు నిర్వహించారు.

ఈ కార్నర్ మీటింగ్లలో నియోజకవర్గాలలో బలమైన నాయకులు ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఆశావాహ నాయకులు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర అధ్యక్షుడు అన్ని జిల్లాలలో పర్యటించి నియోజకవర్గ స్థాయి కార్నర్ మీటింగ్లలో పాల్గొంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు.

నియోజకవర్గంలో పది నుంచి 20 వరకు కార్నర్ మీటింగులు పోటీ పడి మరి పెట్టారు. కార్నర్ మీటింగులకు వచ్చిన స్పందన ప్రజా సమస్యలపై చర్చతో ఇక పార్టీని బలోపేతం చేసే దానిపై నాయకత్వం కేంద్రీకరించింది. ఈ మేరకు బూతు స్థాయి పార్టీ నిర్మాణం పై చర్చించేందుకు పది రోజులపాటు జాతీయ నాయకత్వం కార్యక్రమాన్ని అందించింది.

స్వశక్తికరన్ కార్యక్రమం

పోలింగ్ బూత్‌ల ( polling booth) వారీగా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా బూత్ సశక్తీకరణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేపట్టారు. వీటిని విజయవంతం చేసేందుకు గాను నియోజకవర్గస్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నం అయ్యారు.

వరంగల్ నగరంలో ప్రారంభం

వరంగల్ నగరంలోని (warangal city) పశ్చిమ తూర్పు నియోజకవర్గం వర్క్ షాపులు ప్రారంభమయ్యాయి. బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ అధ్యక్షతన హనుమకొండలో వరంగల్ పశ్చిమ నియోజకర్గ బూత్ సశక్తీకరణ్ అభియాన్ మరియు పై వర్క్ షాప్ నిర్వహించారు.

వరంగల్లో జరిగిన వర్క్ షాప్‌లో బీజేపీ నాయకుడు ఉదయ్ ప్రతాప్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు. పశ్చిమ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి, నియోజకవర్గ ప్రభరి డాక్టర్ వి. మురళీధర్ గౌడ్ చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా వెల్లడైందన్నారు.

బూత్ లలో పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న వారిని, దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారిని అక్కున చేర్చుకోవాలని కోరారు. పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని అభివృద్ధి చేసే అంశంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు.

రానున్న ఎన్నికలలో బీజేపీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డా. టీ.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినెనీ ధర్మారావు, రాష్ట్ర నాయకులు పులి సర్రోతం రెడ్డి, దొంతి దేవేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.