బీజేపీ టార్గెట్‌ 144 కాదు..160!

విధాత‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తాము గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచింది. ఆ సంఖ్య గతంలో 144గా ఉండేది, ప్రస్తుతం వాటిని 160కి పెంచింది. ఈ పెంచిన స్థానాలు ఎక్కువగా బీహార్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవే. ఈ నియోజకవర్గ బాధ్యులైన బీజేపీ వ్యవస్థాగత నేతలు (విస్తారక్‌)లకు బీహార్‌ రాజధాని పాట్న, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేతలతో ఆ పార్టీ జాతీయ […]

బీజేపీ టార్గెట్‌ 144 కాదు..160!

విధాత‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తాము గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచింది. ఆ సంఖ్య గతంలో 144గా ఉండేది, ప్రస్తుతం వాటిని 160కి పెంచింది. ఈ పెంచిన స్థానాలు ఎక్కువగా బీహార్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవే. ఈ నియోజకవర్గ బాధ్యులైన బీజేపీ వ్యవస్థాగత నేతలు (విస్తారక్‌)లకు బీహార్‌ రాజధాని పాట్న, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.

ఈ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సోమవారమే సమావేశమై చర్చించారు. 2023లో వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి బీజేపీ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించిన సమావేశం వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్నది.

అలాగే నడ్డా పదవీ కాలం కూడా వచ్చే నెలలో ముగియనున్నది. రానున్న రెండేళ్లు ఎన్నికల కాలం కాబట్టి అప్పటిదాకా పార్టీ సంస్థాగత ఎన్నికలు వాయిదా వేయాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. నడ్డా పదవీ కాలం కూడా అప్పటివరకు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక బీజేపీ ఇప్పటివరకు గెలుచుకోని 144 స్థానాల టార్గెట్‌ 160 పెంచుకోవడంపై ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేంద్రంలో రెండు సార్లు సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ అనేక రాష్ట్రాల్లో విజయాలు సాధించింది. అయితే మోడీ హవా కొనసాగుతున్న సమయంలోనే 2015లో బీహార్‌, 2018లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 2019లో ఒడిషా, 2021లో పశ్చిమబెంగాల్‌, 2022లో హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఓడిపోయింది.

ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కూటమిలో విభేదాల ఆసరగా చేసుకుని బీహార్‌లో, కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తెచ్చి మధ్యప్రదేశ్‌ లలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మోడీ చ‌రిష్మా పనిచేస్తున్నా.. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ముందు బీజేపీ తేలిపోతున్నట్టు ఈ రాష్ట్రాల ఫలితాలే సూచిస్తున్నాయి.

బీహార్‌లో జేడీయూ బీజేపీకి బైబై చెప్పి తిరిగి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జత కట్టింది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న అకాలీదళ్‌, శివసేనలు మోడీ, షాల వైఖరిని నిరసిస్తూ బైటికి వచ్చాయి. సుదీర్ఘ కాలంలో బీజేపీ మద్దతుగా ఉన్న పార్టీల్లోనే చీలక తెచ్చింది. 2014 లో 282, 2019లో 303 సీట్లను బీజేపీ సొంతంగానే గెలుచుకున్నది.

రాజ్యసభలో తగిన సంఖ్య బలం లేకపోవడం, బిల్లులు పాస్‌ కావాలంటే ఎన్డీఏ కూటమిలోని మిగిలిన పార్టీల మద్దతు తప్పనిసరి కావడంతోనే అనివార్యంగా వాటితో సత్సంబంధాలు కొనసాగించింది. అన్నిరాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో కూటమిలోని భాగస్వామ్యపార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే సంక్షోభాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.

ఫలితంగా జేడీయూ, శివసేన లాంటి పార్టీలు ఎన్డీఏ నుంచి బైటికి వచ్చాయి. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గత రెండుసార్ల వలె ఏకపక్షంగా ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీ సీట్లు దక్కించుకునే పరిస్థితి లేదు. అంతేకాదు గతంలో గెలుచుకున్న సీట్లను గణనీయంగా కోల్పోయే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ అధిష్ఠానానికి అర్థమైంది.

దీంతో ఇప్పటివరకు గెలవని కష్టమైన స్థానాలను గెలుచుకుని ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు. దీనికి అనుగుణంగా 160 సీట్లపై దృష్టి సారించిన్నట్టు తెలుస్తోంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ను బీజేపీ భవిష్యత్తు నేతగా ప్రచారం చేసినా మొన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గాని, ఆయన 2014లో గెలిచిన ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోయింది.

దీంతో రోజురోజుకూ తగ్గిపోతున్న మోడీ ప్రభ పూర్తిగా మసకబారక ముందే మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అతి కష్టమైన ఆ లోక్‌సభ స్థానాలను కాషాయ ఖాతాలో వేసుకోవాలన్నది ఆ పార్టీ ప్రణాళికగా కనిపిస్తున్నది. దానికోసం ఏడాది కిందటి నుంచే కార్యాచరణ రూపొందించుకుని పని చేస్తున్నది. బీజేపీ ప్లాన్‌ ఫలిస్తే సరే, లేకపోతే మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.