Boarder Love Story | మరో సరిహద్దు ప్రేమ కథ

Boarder Love Story విధాత‌: అంతర్జాతీయ ప్రేమలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారినట్టున్నాయి. ఇప్పటికే మన దేశంలో సీమా హైదర్‌ ఉదంతం సంచలనం సృష్టిస్తుండగా.. ఆ వెంటనే అంజూ అనే యువతి పాకిస్థాన్‌లోని తన ప్రియుడిని కలుసుకునేందుకు వెళ్లి.. పెళ్లి కూడా చేసుకున్నది. ఇదే కోవలో తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నది. కాకపోతే.. ఇది చైనా యువతికి, పాకిస్థాన్‌ యువకుడికి మధ్య ప్రేమ కథ. చైనాకు చెందిన యువతి.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంఖ్తుంఖ్వా ప్రాంతంలోని ఒక యువకుడిని […]

  • By: krs    latest    Jul 27, 2023 6:00 AM IST
Boarder Love Story | మరో సరిహద్దు ప్రేమ కథ

Boarder Love Story

విధాత‌: అంతర్జాతీయ ప్రేమలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారినట్టున్నాయి. ఇప్పటికే మన దేశంలో సీమా హైదర్‌ ఉదంతం సంచలనం సృష్టిస్తుండగా.. ఆ వెంటనే అంజూ అనే యువతి పాకిస్థాన్‌లోని తన ప్రియుడిని కలుసుకునేందుకు వెళ్లి.. పెళ్లి కూడా చేసుకున్నది. ఇదే కోవలో తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నది. కాకపోతే.. ఇది చైనా యువతికి, పాకిస్థాన్‌ యువకుడికి మధ్య ప్రేమ కథ. చైనాకు చెందిన యువతి.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంఖ్తుంఖ్వా ప్రాంతంలోని ఒక యువకుడిని ప్రేమించింది. సోషల్‌ మీడియాలో పరిచయం వారిద్దరి మధ్య ప్రేమను చిగురింప జేసింది. అయితే.. గురువారం ఆమె తన ప్రియుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్‌కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.

గావో ఫెంగ్‌ అనే 21 ఏళ్ల యువతి బుధవారం ఇస్లామాబాద్‌కు చేరుకున్నది. మూడు నెలల విజిటింగ్‌ వీసాతో ఆమె రోడ్డు మార్గంలో గిల్గిత్‌ మీదుగా ఇస్లామాబాద్‌కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ ఆమె స్నేహితుడు జావేద్‌ (18) రిసీవ్‌ చేసుకున్నాడు. ఇతడు ఆఫ్ఘనిస్థాన్‌కు సరిహద్దుల్లోని బజౌర్‌ గిరిజన జిల్లాకు చెందినవాడు. ఇస్లామాబాద్‌ నుంచి ఫెంగ్‌ను తీసుకొని తన ఇంటికి బదులు.. దిగు డిర్‌ జిల్లాలోని సామర్‌బాగ్‌లోని తన మేనమామ ఉండే ఇంటికి తీసుకెళ్లాడు. వీరిద్దరికీ స్నాప్‌ చాట్‌ యాప్‌ ద్వారా పరిచయమని పోలీసులు తెలిపారు. గత మూడేళ్లుగా వీరిద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అది క్రమంగా ప్రేమగా మారిందని తెలిపారు. చైనా నుంచి వచ్చిన యువతికి పూర్తి భద్రత కల్పించినట్టు జిల్లా పోలీస్‌ అధికారులు చెప్పారు. అయితే.. ఈ ప్రాంతంలో భద్రతాపరమైన అంశాలు, ముహర్రం కారణంగా ఆమె కదలికలను నియంత్రించినట్టు పేర్కొన్నారు. ఆమె వద్ద ప్రయాణ పత్రాలు అన్నీ పకడ్బందీగా ఉన్నాయని తెలిపారు. ఇంకా ఆమె జావేద్‌ను పెళ్లి చేసుకోలేదని పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో మూడో కేసు
పాకిస్థాన్‌ లింకుతో ఇది మూడో అంతర్జాతీయ ప్రేమ కథ అవడం విశేషం. భారత్‌లోని రాజస్థాన్‌ నుంచి అంజూ అనే 34 ఏళ్ల వివాహిత తన ప్రియుడిని కలుసుకునేందుకు ఇదే ఖైబర్‌ పంఖ్తుఖ్వా ప్రాంతంలోని ఎగువ డిర్‌ జిల్లాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడు కూడా ఆమెకంటే చిన్నవాడే. నస్రుల్లా అనే ఆ యువకుడికి 29 ఏళ్లు. వారిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. ఆమె ఇస్లాంలోకి మారడమే కాకుండా ఫాతిమా అని కొత్త పేరు పెట్టుకున్నది. ఇక ఈ ఘటనకు ముందే సీమా గులాం హైదర్‌ అనే 30 ఏళ్ల పాకిస్థానీ మహిళ.. తన ప్రియుడిని వెతుక్కుంటూ భారత్‌కు వచ్చింది. ఆమెకు అప్పటికే పెళ్లియి, నలుగురు పిల్లల తల్లి కూడా. సచిన్‌ మీనా అనే యువకుడితో కలిసి.. గ్రేటర్‌ నోయిడాలో సహజీవనం చేస్తున్నది. అయితే.. ఈమె గూఢచారి అయి ఉండవచ్చన్న అనుమానాలు తలెత్తాయి.