ఎల్‌ఆరెస్‌పై భగ్గుమన్న బీఆరెస్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

ఎల్ఆరెస్ రద్దు చేసి, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పి నేడు మాట తప్పిందని ఆరోపిస్తు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు

ఎల్‌ఆరెస్‌పై భగ్గుమన్న బీఆరెస్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

విధాత : ఎల్ఆరెస్ రద్దు చేసి, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పి నేడు మాట తప్పిందని ఆరోపిస్తు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల ముందు బీఆరెస్‌ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆరెస్‌ను రద్దు చేసి ఉచితంగా భూముల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని నినదించారు.


 

హైదరాబాద్‌లో అమీర్‌పేటలోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆరెస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, కేపీ. వివేకానంద్‌తో పాటు కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్‌లు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఆర్డీవోలకు రేపు వినతిపత్రాలు సమర్పించనున్నారు