కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వెళ్లిన తండ్రి.. ఎద్దు దాడిలో మృతి

ప‌శువుల మ‌న‌షుల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్నాయి. వీధుల్లో తిరిగే ఎద్దులు మ‌న‌షుల‌పై ఆక‌స్మాత్తుగా దాడుల‌కు పాల్ప‌డి, తీవ్రంగా గాయ‌ప‌రుస్తున్నాయి

  • By: Somu    latest    Feb 26, 2024 11:16 AM IST
కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వెళ్లిన తండ్రి.. ఎద్దు దాడిలో మృతి

న్యూఢిల్లీ : ప‌శువుల మ‌న‌షుల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్నాయి. వీధుల్లో తిరిగే ఎద్దులు మ‌న‌షుల‌పై ఆక‌స్మాత్తుగా దాడుల‌కు పాల్ప‌డి, తీవ్రంగా గాయ‌ప‌రుస్తున్నాయి. తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓ వ్య‌క్తిపై ఎద్దు దాడి చేయ‌గా, అత‌ను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని క‌ల్కాజీ ఏరియాలో నివాస‌ముంటున్న సుభాష్ కుమార్ ఝా(42) లోన్ ఏజెంట్‌గా ప‌ని చేస్తున్నాడు. సుభాష్ కుమార్ పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న సెయింట్ జార్జ్ స్కూల్‌లో చ‌దువుకుంటున్నాడు. అయితే అత‌న్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువ‌ద్దామ‌ని గ‌త గురువారం మ‌ధ్యాహ్నం తండ్రి అక్క‌డికి వెళ్లాడు. స్కూల్ నుంచి కుమారుడితో క‌లిసి వ‌స్తున్న తండ్రిపై ఓ ఎద్దు ఆక‌స్మాత్తుగా దాడి చేసింది.

సుభాష్‌పై ఎద్దు త‌న కొమ్ముల‌తో విచక్ష‌ణార‌హితంగా పొడిచింది. త‌ల‌, ఛాతీ, ప‌క్క‌టెముల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు క‌ట్టెతో ఎద్దుపై దాడి చేయ‌గా, అది అక్క‌డ్నుంచి వెళ్లిపోయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని బ‌ట్రా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ సుభాష్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. సుభాష్ కుమార్ స్వ‌స్థ‌లం బీహార్ కాగా, బ‌తుకుదెరువు నిమిత్తం ఢిల్లీకి వ‌చ్చాడు.