జ‌మున మృతికి.. సినీ ప్ర‌ముఖుల నివాళులు!

విధాత‌: సీనియ‌ర్ న‌టి జ‌మున మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆమె మృతికి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. అయితే మధ్యాహ్నం 2గంటలకు ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు జ‌మున పార్థివదేహం త‌ర‌లించ‌నున్నార‌ని స‌మాచారం. సాయంత్రం 4.30 గంటల వరకూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర జ‌మున భౌతిక కాయాన్ని అభిమానుల చివ‌రిచూపు కోసం ఉంచ‌నున్నారు. సాయంత్రం 5గంటలకు ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు. పౌరాణిక పాత్ర‌ల‌కు జీవం: సినీ హీరో […]

  • By: krs    latest    Jan 27, 2023 8:53 AM IST
జ‌మున మృతికి.. సినీ ప్ర‌ముఖుల నివాళులు!

విధాత‌: సీనియ‌ర్ న‌టి జ‌మున మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆమె మృతికి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. అయితే మధ్యాహ్నం 2గంటలకు ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు జ‌మున పార్థివదేహం త‌ర‌లించ‌నున్నార‌ని స‌మాచారం. సాయంత్రం 4.30 గంటల వరకూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర జ‌మున భౌతిక కాయాన్ని అభిమానుల చివ‌రిచూపు కోసం ఉంచ‌నున్నారు. సాయంత్రం 5గంటలకు ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

పౌరాణిక పాత్ర‌ల‌కు జీవం: సినీ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు.

ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

న‌ట‌న‌కు ఆభ‌ర‌ణం: సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌

అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు.

195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు.

నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి.. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

ఆత్మ‌కు శాంతి చేకూరాలి: అనిల్ కుర్మాచ‌లం

తెలుగు సినిమా సీనియర్‌ నటి జమున మృతిపై తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం సంతాపం తెలిపారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నటిగానే కాకుండా 1989లో రాజమండ్రి ఎంపీగా ప్రజల మన్ననలు అందుకున్నారని గుర్తుకు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జమున మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు: సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్

ప్రముఖ సీనియర్ నటి జమున మృతికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటీమణి జమున మృతి చెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి తెలుగు వారి స్థాయిని పెంచేందుకు కృషి చేశారన్నారు. జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు

స‌త్య‌భామ అంటే జ‌మున గారే… : మాజీ రాజ్యసభ సభ్యుడు, సుబ్బరామిరెడ్డి

సుప్రసిద్ధ బహుభాషా నటీమణి లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో చింతించాను. వెండి తెరపై సత్యభామ అంటే జమున గారు అనేలా గుర్తుండిపోయారు. ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు.

ప్రేక్షకలోకంలో స్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. లోక్ సభ సభ్యురాలిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కళాపీఠం తరఫున ఆమెను సమున్నతంగా సత్కరించు కోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమతి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.