ఒకప్పుడు చంద్రబాబూ కాంగ్రెస్ మనిషే: రేవంత్ రెడ్డి
విధాత: నేను మీలో ఒకన్ని.. నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసిన ఘనత కాగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం మునుగోడులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.. ఒకాయన నన్ను చంద్రబాబు మనిషిని అంటున్నాడని.. చంద్రబాబు మనిషిని అయితే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉంటాడు? అని అన్నారు. ఒకప్పుడు చంద్రబాబూ కాంగ్రెస్ మనిషేనని, ఆయన ఆ పార్టీలో […]

విధాత: నేను మీలో ఒకన్ని.. నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసిన ఘనత కాగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం మునుగోడులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు..
ఒకాయన నన్ను చంద్రబాబు మనిషిని అంటున్నాడని.. చంద్రబాబు మనిషిని అయితే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉంటాడు? అని అన్నారు. ఒకప్పుడు చంద్రబాబూ కాంగ్రెస్ మనిషేనని, ఆయన ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడని ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాడని అందులో తప్పేమున్నదని రేవంత్ తనపై విమర్శలు చేస్తున్నవారిని ప్రశ్నించారు.
ఒకప్పుడు నేను టీడీపీ అయి ఉండొచ్చు.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని అని అన్నారు. కాంగ్రెస్ గౌరవాన్ని నిలబెడతా.. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను కోడలు లాంటి వాడినని.. మునుగోడు పుట్టిల్లైన టీడీపీ నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీకి కోడలులాగా వచ్చానంటే ఆ ఇంటి గౌరవం, ఆ ఇంటి విలువను కాపాడటం, నిలబెట్టడం నా బాధ్యత అని తెలిపారు. నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి వచ్చానని అన్నారు.
నన్ను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ నాపై 120 కేసులు పెట్టాడని, నేను దొంగతనం చేసి జైలుకు పోలే.. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లానని తెలిపారు. నేను జైలుకెళ్లానని గర్వంగా చెబుతున్నా.. ఒక్కసారి కాదు.. పేదల కోసం 100 సార్లైనా జైలుకెళ్తానని చెప్పారు. నేను తిన్న చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని శపథం చేశారు.
మునుగోడుతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, దివంగత నేత జైపాల్ రెడ్డి గారి అమ్మమ్మ ఊరు ఇదని అన్నారు. కాంగ్రెస్ ఆశావహులు పార్టీ మారతారని గోతికాడి నక్కల్లా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎదురు చూస్తున్నాయన్నారు. దేశంలో కాంగ్రెస్ పై బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. దేశంలోనే మొట్ట మొదటి గురుకుల పాఠశాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక్కడి గ్రామాలకు కనీసం సరైన రోడ్లు వేయని వారు.. అభివృద్ధి చేస్తారా అని సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్.. ఎన్నికల కోసం వాళ్ల కాళ్లు కూడా పట్టుకున్నాడని విమర్శలు చేశారు. ఈ ప్రాంతానికి ఏం చేయని వారికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు రేవంత్.
పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచినందుకు బీజేపీకి ఓటేయలా? అని ప్రశ్నించారు రేవంత్. చంటిపిల్లల పాలపై కూడా జీఎస్టీ వేసిన ఘనులు బీజేపీ వాళ్లని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు, గిరిజనులకు భూములు పంచినందుకు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన మాకే.. మునుగోడు ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందంటూ తేల్చి చెప్పారు. రేవంత్ మాట్లాడుతున్నంత సేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది.