కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జీ మార్పు?

రేవంత్‌కు అనుకూలంగా ఉన్నార‌నే ఆరోప‌ణలు..! కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ పంచాయితీ అసంతృప్త నేతలతో మాట్లాడిన దిగ్విజయ్‌ సింగ్‌ వలస వాదులన్న పదం బాధించిందన్న సీతక్క విధాత: తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్నవిభేదాలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిని మార్చే పరిస్థితికి దారి తీసేలా ఉన్నట్లు కనిపిస్తున్నది. తిరుగుబాటు నేతలు ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తున్నది. రాగూర్‌ మొదటి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని వెనుకేసుకొస్తున్నాడని ఆరోపించినట్లు […]

కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జీ మార్పు?
  • రేవంత్‌కు అనుకూలంగా ఉన్నార‌నే ఆరోప‌ణలు..!
  • కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ పంచాయితీ
  • అసంతృప్త నేతలతో మాట్లాడిన దిగ్విజయ్‌ సింగ్‌
  • వలస వాదులన్న పదం బాధించిందన్న సీతక్క

విధాత: తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్నవిభేదాలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిని మార్చే పరిస్థితికి దారి తీసేలా ఉన్నట్లు కనిపిస్తున్నది. తిరుగుబాటు నేతలు ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తున్నది.

రాగూర్‌ మొదటి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని వెనుకేసుకొస్తున్నాడని ఆరోపించినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు ఢిల్లీ దూతగా ఏఐసీసీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ రాష్ట్రానికి వచ్చారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఆయన గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో విడివిడిగా చర్చిస్తున్నారు.

సీనియర్‌ నేతలు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, మల్లు రవితో పాటు దాదాపు ౨౫మంది నేతలతో విడివిడిగా చర్చించారు. అందరు చెప్పిన విషయాలను విన్నారు. పార్టీలో ఎన్ని విభేదాలున్నా అవన్నీఅంతర్గత విషయాలని, వాటిని మీడియా ముందుకు తీసుకువెళ్లడం మంచిది కాదని హితవు పలికినట్లు తెలిసింది.

రేవంత్‌ రెడ్డి వర్గానికి టీ పీసీసీ పదవులు ఇచ్చారంటూ పంచాయతీ లేపిన సీనియర్లు తెగేదాకా లాగే ప్రయత్నం చేశారు. అసంతృప్త సమావేశాలు వరుసగా ఏర్పాటు చేయడంతో రంగంలోకి దిగిన అధిష్టానం వరుసగా అందరితో సమావేశం అవుతున్నది. ఈ సమావేశంలో తమను వలస వాదులని వ్యాఖ్యానించడం చాలా భాదనిపించిందని ఎమ్మెల్ల్యే సీతక్క చెప్పారు.

అయితే మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన తమను కోవర్టులని ప్రచారం చేస్తున్నారని సీనియర్లు దిగ్విజయ్‌ ముందు వాపోయినట్లు తెలిసింది. అయితే టీ పీసీసీ నూతన కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క దిగ్విజయ్‌కు తెలిపారు.

సమన్వయం లోపమే..!

విడివిడిగా పార్టీ నేతలతో మాట్లాడిన దిగ్విజయ్‌ సింగ్‌ రాష్ట్ర పార్టీలో సమన్వయ లోపం బాగా ఉందన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే పార్టీ నేతలను సమన్వయం చేయడంలో, ఏకతాటిపై నడిపించడంలో మాణిక్యం ఠాగూర్‌ విఫలమైనట్లుగా భావిస్తున్నట్లు తెలిసింది.

వరంగల్‌ డిక్లరేషన్‌ తర్వాత పార్టీలో కార్యక్రమాల అమలు వేగం కాలేదు. వరంగల్‌ సభ ఉత్సాహం అంతా నీరు కారింది. వరంగల్‌ డిక్లరేషన్‌ ఆధారంగా పార్టీని ఉద్యమాల బాట పట్టించడంలో ఇన్‌చార్జి పూర్తిగా విఫలమైనట్లుగా భావించినట్లు తెలుస్తోంది. పైగా ఆయన కేవలం ఒక్క రేవంత్‌ వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారన్నవిమర్శలు వెలువడుతున్నాయి.

జోడో యాత్ర జోష్‌ ఏది?

వరంగల్‌ డిక్లరేషన్‌, రాహుల్‌ జోడో యాత్రల జోష్‌ కేడర్‌లో మిగల్లేదు. పైగా రాష్ట్రంలో వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పార్టీ నేతలను కుంగదీసింది. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి కృషి చేయడానికి బదులుగా నేతలు తమలో తామే కొట్లాడుకుటుంటున్నారు.

పార్టీని గట్టెక్కించలేక, నేతలు రెండు శిబిరాలుగా ఏర్పడ్డారు. ఈ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో రాష్ట్రానికి వచ్చిన డిగ్గి రాజ వరుసగా నేతలతో మాట్లాడుతున్నారు. శుక్రవారం కూడా రాష్ట్ర నేతలతో దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడనున్నారు.

పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుకున్నాం: జానా

మా పార్టీ అంతర్గత విషయాలన్నీ మాట్లాడుకున్నామని సీనియర్‌ నేత జానారెడ్డి మీడియాకు తెలిపారు. తాము రిజిస్టర్ చేసుకున్న విషయాలు బహిరంగంగా మాట్లాడడం సరికాదన్నారు. తామంతా ఐక్యంగా ఉండి పార్టీ పటిష్టత కోసం పని చేస్తామని తెలిపారు.

పార్టీ అభివృద్ధికి తాను కొన్ని సలహాలు ఇచ్చానని, దిగ్విజయ్‌ సింగ్‌ కొన్ని సలహాలు, సూచనలు చేశారని జానా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌లో కోవర్టులెవరూ లేరని, అదంతా అపోహ మాత్రమేనన్నారు. సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లామని, ఎవరు ఏమిటో అధిష్టానానికి మొత్తం తెలుసునని జానా అన్నారు.

వలస వాదులనడం బాధించింది. సీతక్క

వలసవాదులనే పదం తమకు చాలా బాధనిపించిందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడాక కాంగ్రెస్‌లో మార్పు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు చాలా స్పేస్‌ ఇచ్చిందన్నారు. మా సమస్యలన్నీ వివరించామని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎల్‌పీ నేత భట్టి అన్నారు.