పక్కలో బల్లెం.. హంబన్‌తోట పోర్టులో రిఫైనరీ నిర్మాణానికి చైనాకు శ్రీలంక అనుమతి
భారత్‌ను చిక్కుల్లో పడేసేలా శ్రీలంక (Sri Lanka) కేబినెట్ ఒక నిర్ణయం తీసకుంది. అక్కడి ప్రసిద్ధ హంబన్‌తోట పోర్టులో భారీ పెట్రోలియం రిఫైనరీని నిర్మించడానికి చైనా (China) కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది

విధాత: భారత్‌ను చిక్కుల్లో పడేసేలా శ్రీలంక (Sri Lanka) కేబినెట్ ఒక నిర్ణయం తీసకుంది. అక్కడి ప్రసిద్ధ హంబన్‌తోట పోర్టులో భారీ పెట్రోలియం రిఫైనరీని నిర్మించడానికి చైనా (China) కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన సైనోపెక్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతుందని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేకర ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హంబన్‌తోటలో సైనోపెక్ 4.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది.
అయితే చైనా ఈ రిఫైనరీతోనే సరిపెట్టకుండా పెట్రోల్ ఉత్పత్తుల తయారీ శిక్షణ కేంద్రం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్మించనుంది. ఈ చర్యల ద్వారా శ్రీలంక చమురు మార్కెట్‌ను చైనా పరోక్షంగా నియంత్రించే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. కొలంబో పోర్టు తర్వాత హంబన్‌తోట పోర్టు రక్షణపరంగా, వాణిజ్య పరంగా కీలకమైంది. ఈ పోర్టును చైనానే నిర్మించింది.
2010లో ప్రారంభమైన ఈ పోర్టును శ్రీలంక పోర్టు అథారిటీ, చైనా మర్చంట్ పోర్ట్స్ సంయుక్తంగా నిర్వహించేవి. ఈ అప్పులతోనే శ్రీలంక చైనా అప్పుల ఊబిలో పడిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో చైనాకు ఈ పోర్టును 99 ఏళ్ల లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. కొలంబో పోర్టులోనూ చైనా వివిధ నిర్మాణాలు చేపడుతోంది. సమీపంలో ఉంటూ రక్షణ పరంగా ఎంతో కీలకమైన శ్రీలంక పోర్టుల్లో చైనా పెట్టుబడులు పెరగడం భారత్‌కు ఇబ్బందికరంగా పరిణమించింది.