కేసీఆర్ ఓ బేషరం మనిషి.. కాలం చెల్లిన మెడిసిన్‌: రేవంత్‌రెడ్డి

బీఆరెస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు

కేసీఆర్ ఓ బేషరం మనిషి.. కాలం చెల్లిన మెడిసిన్‌: రేవంత్‌రెడ్డి

గవర్నర్‌ ప్రసంగానికి, బీఏసీకి కేసీఆర్‌ ఎందుకు రాలేదు?

ఇదీ.. తెలంగాణపై ఆయన కమిట్‌మెంట్

బీఆరెస్‌ ఇచ్చిన జాబితాలో హరీశ్‌ పేరు లేదు

అందుకే బీఏసీ భేటీకి అనుమతించలేదు

రేపు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా?

కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి.. ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వర్తించాలి

కృష్ణా జలాలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు

అందుకే తిరస్కరించిన కృష్ణాబేసిన్ ప్రజలు

కాళేశ్వరం అవినీతిపై చర్చను పక్కదారి పట్టించేందుకే కృష్ణా ప్రాజెక్టులపై రచ్చ

కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులప్పగించిందే కేసీఆర్

రిటైర్డ్ జడ్జితో మేడిగడ్డ అవినీతిపై విచారణ

రాష్ట్రంలో కులగణనపై అసెంబ్లీలో తీర్మానం

నా దగ్గరికి కేసీఆర్ వచ్చినా కలుస్తా

బీఆరెస్‌ ఎమ్మెల్యేలు కలిస్తే చర్చ ఎందుకు?

బీఆరెస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ బేషరం మనిషిని, కాలం చెల్లిన మెడిసిన్‌ అని అభివర్ణించారు. గురువారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారో రారో తెలియదన్నారు. తొలిరోజు బడ్జెట్ సమావేశాలకైతే రాలేదన్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, వాళ్ల పార్టీ మనుగడ కోసం తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉండి, గవర్నర్ ప్రసంగానికే రాలేదంటే ఆయనకు ఎంత కమిట్‌మెంట్ ఉందనేది అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఆయన వైఖరి చూస్తే తెలంగాణ మీద ఎంత సీరియస్‌గా ఉన్నాడనేది కూడా అర్థం అవుతోందన్నారు. బీఏసీ సమావేశానికి కూడా రాలేదన్నారు. ఏం చర్చ చేయాలనేది బీఏసీలోనే నిర్ణయిస్తామని, అంతటి కీలక సమావేశానికి కూడా కేసీఆర్‌ హాజరుకాలేదని చెప్పారు. కేసీఆర్‌ తన వద్దకు వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా ఆయనను కలుస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. నేను కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు లేని చర్చ.. బీఆరెస్‌ ఎమ్మెల్యేలు తనను కలిసినప్పుడు ఎందుకని ప్రశ్నించారు.

రేపు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా?

బీఏసీ సమావేశానికి రాకుండా హరీశ్‌రావును తాము అడ్డుకున్నామన్న విమర్శలను సీఎం రేవంత్‌రెడ్డి తోసిపుచ్చారు. ఆయనను తామెలా అడ్డుకుంటామని ఎదురు ప్రశ్నించారు. బీఏసీ సమావేశానికి కేసీఆర్‌, కడియం శ్రీహరి హాజరవుతారని ఆ పార్టీవారే పేర్లు ఇచ్చారని, ఇచ్చిన పేర్లలో హరీశ్‌ పేరు లేకపోవడంతోనే మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలిపారని స్పష్టం చేశారు. బీఏసీకి ఆయనను అనుమతించాలో లేదో స్పీకర్ నిర్ణయమని స్పష్టం చేశారు. రేపు కేసీఆర్ స్థానంలో హిమాన్షు కూడా వస్తానంటే ఎలాగని ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుది అవగాహన రాహిత్యమని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వర్తించాలని తాను కోరుకుంటున్నానని సీఎం తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయమని చెప్పారు. దానికి కూడా తమదే బాధ్యత అంటే ఎలాగని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను తిరస్కరించిన కృష్ణాబేసిన్‌ ప్రజలు

కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధి ఏపాటిదో గుర్తించే కృష్ణా పరివాహక ప్రజలు బీఆరెస్‌కు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ సాగించిన అవినీతికి పరాకాష్టగా నిలిచిన మేడిగడ్డ కుంగుబాటుపై చర్చ పక్కదారి పట్టించడానికే కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ రచ్చ చేస్తున్నారని విమర్శించారు. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్ట్‌లను అప్పగించిందే కేసీఆర్ అని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నాగార్జున సాగర్ మీదకి జగన్ తుపాకులతో పోలీసులను పంపిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘సాగర్‌ను ఆక్రమించి, మూడు రోజులు డ్యాంపైనే ఉంటే అప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు?’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి నిలదీశారు. ప్రతి రోజూ 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి జగన్‌కు సహకరించింది కేసీఆర్‌ కాదా? అని మండిపడ్డారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవని చెప్పిన కేసీఆర్ కమిట్‌మెంట్‌ అదేనన్నారు. రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తానన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కమిట్‌మెంట్‌ ఏమిటో ప్రజలకు కూడా అర్థమైందని, కృష్ణా బేసిన్‌లో అందుకే బీఆరెస్‌ను తిరస్కరించారన్నారు. కేసీఆర్ కమిట్‌మెంట్‌ మీద ఎవరికైనా డౌట్ ఉందంటే.. అది హరీశ్‌రావుకేనని వ్యాఖ్యానించారు.

రిటైర్డ్ జడ్జీ విచారణపై అసెంబ్లీలో చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ కుంగుబాటు, ప్రాజెక్ట్ నిర్మాణంలో అవతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసిందని, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించిందని వెల్లడించారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలా? వద్దా? అనేది క్యాబినెట్‌ భేటీలో లేదా అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. ప్రాజెక్టులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటిస్తారని రేవంత్‌ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో కులగణనపై తీర్మానం ఉంటుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏవైనా అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందని స్పీకర్‌ భావిస్తే.. అసెంబ్లీ సమావేశాలను పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపారు.

విజయసాయిరెడ్డి నాన్‌ సీరియస్‌ పొలిటీషియన్‌

మరో మూడు నెలలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ రాజ్యసభలో ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డి కొట్టిపారేశారు. విజయసాయిరెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్‌ అని, అలాంటి వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరామని తెలిపారు.