అక్కడ కృష్ణమ్మ పరుగులు.. ఎస్ఎల్బీసీ సొరంగాల్లో సాగని పనులు
పొరుగు రాష్ట్రం ఏపీలో రెండు దశాబ్దాల స్వప్నం సాకారమై వెలిగొండ (పూల సుబ్బయ్య) ప్రాజెక్టుకు బుధవారం ప్రారంభోత్సవ వేడుక జరిగిన వేళ తెలంగాణలో ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ) సొరంగం ప్రాజెక్టు పనులు మరోసారి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా వాసులలో చర్చనీయాంశమయ్యాయి.

- ఇక్కడ కొనసొ..గుతున్న పనులు
- వెలిగొండ సొరంగాల్లో దుంకిన కృష్ణమ్మ
- ఎస్ఎల్బీసీ సొరంగాల్లో అదే జాప్యం
- పనులు పూర్తయితే శ్రీశైలం నుంచి
- 30 టీఎంసీల జలాలు గ్రావిటీతో
- నల్లగొండ, పాలమూరుకు పరుగులు
- మరో 2వేల కోట్లతో పూర్తయ్యే అవకాశం
- కాంగ్రెస్ ప్రభుత్వంపైనే రైతుల ఆశలు
(విధాత ప్రత్యేకం)
పొరుగు రాష్ట్రం ఏపీలో రెండు దశాబ్దాల స్వప్నం సాకారమై వెలిగొండ (పూల సుబ్బయ్య) ప్రాజెక్టుకు బుధవారం ప్రారంభోత్సవ వేడుక జరిగిన వేళ తెలంగాణలో ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ) సొరంగం ప్రాజెక్టు పనులు మరోసారి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా వాసులలో చర్చనీయాంశమయ్యాయి. 10,010 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 43.5 టీఎంసీల కృష్ణా జలాలను ప్రకాశం, వైఎస్సార్, ఎస్పీఎస్ పొట్టి శ్రీరాములు జిల్లాల్లోని 3.28 లక్షల ఎకరాలకు అందించేందుకు, 11.25 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెళ్లు పూర్తవ్వడంతో ఏపీ సీఎం జగన్ వాటిని ప్రారంభించారు. టన్నెల్ 1, 2 కలిపి 37.587 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తి చేసి, శ్రీశైలం బ్యాక్ వాటర్ సద్వినియోగంలో ఏపీ కీలక విజయం సాధించింది. తెలంగాణలో ఇదే శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ తరలింపుతో కరువు, ఫ్లోరైడ్ పీడిత ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు తాగు, సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా అసంపూర్తిగానే మిగిలివుండటం ఇక్కడి పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నది.
రెండింటి పనులు ఒకేసారి తలపెట్టినవి
అటు వెలిగొండ, ఇటు ఎస్ఎల్బీసీ రెండు కూడా అభయారణ్యల పరిధిలోనే, సొరంగాల నిర్మాణాలతోనే శ్రీశైలం బ్యాక్ వాటర్ పైనే ఆధారపడినవి. దాదాపుగా ఒకే సమయంలో తలపెట్టిన ప్రాజెక్టులు. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలోనే 2004లో వెలిగొండ, 2005లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల నిర్మాణాలకు నెలల వ్యవధిలో పరిపాలన అనుమతులిచ్చారు. ఎస్ఎల్బీసీ ద్వారా 30టీఎంసీల కృష్ణా జలాలను శ్రీశైలం జలాశయం నుంచి తీసుకుని నల్లగొండ జిల్లాలో 3లక్షల ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 50వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 600కుపైగా గ్రామాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. వెలిగొండ కాంట్రాక్టు సంస్థ మెగా కన్స్ట్రక్షన్స్కు ఏపీలో అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా సహకారం అందించాయి. దీంతో వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను ఆ సంస్థ పూర్తి చేసింది. ఇక్కడ జయప్రకాశ్ అసోసియేట్స్ 1,925 కోట్లతో కాంట్రాక్టు చేపట్టినప్పటికీ ప్రభుత్వాల నుంచి సక్రమంగా అందని నిధులు.. టన్నెల్ బోరింగ్ మిషన్లు, వరదలు, సీపేజీ వాటర్ సమస్యలతో నేటికీ సొరంగాలు తవ్వలేకపోయింది.
మధ్యలో సొరంగం పనులు ఆలస్యమవుతాయన్న ఉద్దేశంతో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి నాగార్జున సాగర్ పుట్టంగండి నుంచి ఎత్తిపోతలతో ఎగువ కాలువ ద్వారా 2.20లక్షల ఎకరాలకు, దిగువ కాలువ ద్వారా 80వేల ఎకరాలకు నీరందించడంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాని 600 గ్రామాలు, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా చేపట్టారు. స్వరాష్ట్రం తెలంగాణలో ఎస్ఎల్బీసీ కట్టపై కుర్చీ వేసుకుని మరి సొరంగం పూర్తిచేయిస్తానని చెప్పిన కేసీఆర్.. పదేళ్లలో ఈ ప్రాజెక్టును పడకేయించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులను మళ్లించారన్న విమర్శలు ఉన్నాయి. ఎస్సెల్బీసీ సొరంగం ప్రాజెక్టుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు, ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి, జల సాధన సమితులతో పాటు జిల్లా రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు సాగాయి. 1996 పార్లమెంటు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 537 నామినేషన్లతో 480 మంది (ఆరుగురు రాజకీయ పార్టీల వారు) అభ్యర్థుల బ్యాలెట్ పోరాటంతో ఈ ప్రాజెక్టును సాధించుకున్నారు. కానీ.. రెండు దశాబ్దాలు గడిచినా జిల్లా వాసులకు అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమే.
సాగుతూ ఆగుతూ నత్తనడకన ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు
1983లోనే 480 కోట్ల వ్యయంతో బీజం పడింది. దివంగత సీఎం వైఎస్సార్ 2,813 కోట్ల అంచనా వ్యయంతో 147జీవో ద్వారా 2005 ఆగస్టు 11న పరిపాలన ఆమోదంతో ప్రాణం పోశారు. మెస్సర్ జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ 1925 కోట్లతో టెండర్ దక్కించుకున్నది. వరదల కారణంగా ఆగిన పనులు 2007లో తిరిగి మొదలయ్యాయి. నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన పనులు అప్పటి నుంచి ఆగుతూ సాగుతున్నాయి. శ్రీశైలం నుంచి తీసుకునే 13.9 కిలోమీటర్ల ఇన్లెట్ సొరంగం తవ్వకం పనులు పూర్తికాగా, నీళ్లు బయటకు వచ్చే అవుట్ లెట్ నుంచి 20.4 కిలోమీటర్లు తవ్వారు. మధ్యలో 9.6 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సివుంది. నిర్మాణ వ్యయం 4,600 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 2,700 కోట్ల ఖర్చు చేయగా, చేసిన పనుల్లో కాంట్రాక్టర్‌కు 50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 59 కోట్ల రూపాయల మేర విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సివుంది. మిగిలిన సొరంగం పనులతో పాటు ఇతర పనుల పూర్తి కోసం మరో 2,200 కోట్లు అవసరమని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్లెట్ వైపు టీబీఎం మిషన్ శ్రీశైలం జలాశయం వైపు నుంచి వస్తున్న సీపేజీ నీటిలో మునిగి మూడేళ్లయ్యింది. నీటిని తొలగించి టీబీఎం మిషన్ పరికరాలను వేరు చేసి, రిపేర్లు చేయించేందుకు ఆరునెలలుగా ప్రయత్నిస్తున్నారు. అవుట్లెట్ వైపు టీబీఎం చెడిపోయిన మిషన్ స్థానంలో కొత్తది అమర్చడంలో మూడేళ్ల కాలం వృథా అయిపోయింది. తీరా కొత్త టీబీఎంతో ఒకటిన్నర కిలోమీటర్ తవ్వగానే అదికూడా చెడిపోయింది. దాని కోసం మళ్లీ ఆర్డర్ చేసినా ఇప్పటిదాకా అతీగతీ లేదు.
ప్రాజెక్టుల ఆలస్యంతో కృష్ణా జలాలకు గండి
కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎల్బీసీ, అందులో అంతర్భాగమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల, పాలమూరు, రంగారెడ్డి, అందులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో జాప్యంతో శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాల తరలింపులో తెలంగాణ విఫలమైంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని ద్వారా రోజుకు మూడు టీఎంసీల తరలింపు సామర్థ్యాన్ని ఏడు టీఎంసీలకు పెంచే పనులు చేపట్టింది. రాయలసీమలోని కర్నూలు మాత్రమే కృష్ణా బేసిన్‌లోకి వస్తుండగా, శ్రీశైలం నీళ్లను రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలిస్తారు. అదీగాక శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలను లిఫ్ట్ చేసే సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పనులు కొనసాగిస్తున్నది. ఇప్పటికే హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా ఏపీ అదనంగా రోజుకు రెండు టీఎంసీలను తరలించుకుపోతున్నది. కృష్ణా ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వాలు వేగంగా పూర్తి చేసుకుని నీళ్లు తరలించుకువెళుతుంటే తెలంగాణ ప్రభుత్వాలు నత్తనడకన ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజల, రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆశలు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణలో గత బీఆరెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, మళ్లీ కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తవుతాయన్న ఆశలు ప్రజల్లో చిగురించాయి. సదరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలివ్వడంతో ఈ దిశగా ముందడుగు పడుతుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టుపై ఫిబ్రవరి 22న సమీక్ష చేసిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సహా ఉమ్మడి నల్లగొండలోని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు. 44 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిన 9 కిలోమీటర్ల పనులు రెండువైపుల చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులకు సంబంధించి వారానికికొకసారి సమీక్ష చేయాలని, సాంకేతిక సమస్యలపై ఓ కమిటీ వేయాలని ఆదేశించడంతో ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రజల్లో విశ్వాసం కలుగుతున్నది.