కండోమ్ రాజ‌కీయాలు.. భ‌విష్యత్‌కు గ్యారెంటీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. మ‌రో నెల రోజుల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది

  • By: Somu    latest    Feb 22, 2024 11:38 AM IST
కండోమ్ రాజ‌కీయాలు.. భ‌విష్యత్‌కు గ్యారెంటీ..

విధాత‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. మ‌రో నెల రోజుల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. దీంతో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ, ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న టీడీపీ మ‌ధ్య భీక‌ర యుద్ధం న‌డుస్తోంది. అంతేకాదు ఇరు పార్టీల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. నువ్వా.. నేనా అనేంత‌గా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో దాడుల‌కు దిగుతున్నారు. ఇదంతా ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం ఏపీలో కండోమ్ రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. గురువారం ఉద‌యం నుంచి ఈ కండోమ్ రాజ‌కీయాలు ఏపీలో ఊపందుకున్నాయి.


వైఎస్సార్ సీపీ గుర్తుతో ఉన్న కండోమ్ ప్యాకెట్ గురించి టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. టీడీపీ సింబల్ ఉన్న కండోమ్ ప్యాకెట్‌ గురించి వైఎస్సార్ సీపీ ఓ వీడియోను బయటపెట్టింది. కండోమ్ ప్యాకెట్లను తమ ప్రత్యర్థి పార్టీల కేడర్ ఓటర్లకు పంచిపెడుతున్నారని ఒక పార్టీపై మరో పార్టీ విమ‌ర్శలు గుప్పించుకుంటున్నాయి. టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో , వైసీపీ ‘సిద్ధం’ సభల పేరుతో ప్రచారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవే నినాదాల‌ను ఇరు పార్టీలు కండోమ్ ప్యాకెట్ల‌పై ముద్రించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


కండోమ్ రాజ‌కీయాలు ఈ ప‌థ‌కం వ‌ల్లే..


అమ్మఒడి పథకం కింద ఏపీ ప్రభుత్వం బడికెళ్తున్న పిల్లల తల్లులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని టీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం కోసం టీడీపీ కండోమ్ ప్యాకెట్లను పంచిపెడుతోందని ఇద్దరు మాట్లాడుకోవడాన్ని వైఎస్సార్సీపీ షేర్ చేసిన వీడియోలో గమనించొచ్చు. ‘త‌మ పార్టీ ప్రచారం కోసం టీడీపీ చివ‌రికి ప్రజ‌ల‌కు కండోమ్‌లు కూడా పంపిణీ చేస్తోంది. ఇదెక్కడి ప్రచార పిచ్చి? నెక్ట్స్ వ‌యాగ్రాలు కూడా పంచుతారేమో? క‌నీసం అక్కడితోనైనా ఆగుతారా? లేక‌పోతే మున్ముందు ఇంకా దిగ‌జారుతారా?’’ అని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లను వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.


‘పబ్లిసిటీ కోసం ఎక్కడపడితే అక్కడ ఫొటోలు కనిపిస్తున్నాయి. అయ్యా.. ఈమాదిరిగా పబ్లిసిటీ చేసుకోవడం చూస్తుంటే శవాల మీద చిల్లర ఏరుకుంటున్నట్టుగా లేదా.. నీకన్నా దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటాడా?’ అంటూ జగన్ గతంలో చంద్రబాబు నాయుడిని విమర్శించిన ఆడియోతో.. వైఎస్సార్సీపీ గుర్తు ఉన్న కండోమ్ ప్యాకెట్ల వీడియో టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సిద్ధం..సిద్ధం అంటూ కేకలు పెట్టేది ఇందుకా? ఇలాంటి నీచపు ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా వైఎస్సార్సీపీ? అంటూ జగన్ పార్టీపై టీడీపీ సెటైర్లు వేసింది.


ఇలా ఇరు పార్టీల మ‌ధ్య కండోమ్ రాజ‌కీయాలు జోరందుకున్నాయి. అయితే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కోస‌మే ఆ కండోమ్ ప్యాకెట్ల‌ను మార్ఫింగ్ చేశారా..? లేదంటే నిజంగానే కండోమ్ ప్యాకెట్ల‌ను పంచ‌బోతున్నారా..? అనే విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త లేదు.