సీఎం తొలిసభను విజయవంతం చేయాలి: మంత్రి సీతక్క
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి బహిరంగ సభకు వస్తున్న

– గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని స్థానాలూ దక్కించుకోవాలి
– జోకేటోళ్లకు కాదు… పనిమంతులకే కాంగ్రెస్ లో గుర్తింపు
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు సభను విజయవంతం చేయాలని మంత్రి దనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఇంద్రవెల్లి సన్నాహక సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆనాడు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ హోదాలో ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితో మొదలుపెట్టిన సభలు రాష్ట్రం మొత్తం విజయవంతం కావడంతోనే ఇవాళ అధికారంలో ఉన్నామన్నారు. అదే తరహాలో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఈ ప్రాంతం నుండే సమరశంఖం పూరించనున్నట్టు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యానికి, సంకల్పానికి ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం, బాధ్యత మనపై ఉందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీదాకా అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని హితోపదేశం చేశారు.
సాధారణ ఎన్నికలు ముగిశాయని, ఇక గల్లీతోపాటు ఢిల్లీ ఎన్నికలు రానున్నాయని తెలిపారు. వాటి గెలుపుకోసం అందరమూ కష్టపడదామన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని, జిల్లా ఇంచార్జి మంత్రిగా తనకు బాధ్యతలివ్వటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తక్కువ వ్యవధిలోనే ఆదిలాబాద్ జిల్లాతో ఎంతో అనుబంధమేర్పడిందన్నారు. సీఎం రాక సందర్భంగా గ్రామాలు, మండలాల వారీగా ఇచ్చిన బాధ్యతలను నాయకులు సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎల్లవేళలా ప్రజల మధ్యనే ఉండాలని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. అప్పుడే మనపై అభిమానం ఏర్పడుతుందన్నారు. రాజకీయమంటేనే సేవ అని, కేవలం నాయకుల వెంట తిరిగి మురిసిపోకుండా ప్రతి కార్యకర్త జనంలో ఉండి నాయకులుగా ఎదగాలన్నారు. అప్పగించిన బాధ్యతలను మాటలతో కాదు.. చేతల్లో చూపించాలన్నారు. జోకేటోళ్లకు కాదు.. పనిమంతులకే పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటు పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా వారు కనబరుస్తున్న ఉత్సాహం చాలా గొప్పగా ఉందని చెప్పారు. తమ అగ్రనేత రాహుల్ భారత్ న్యాయ్ యాత్రను అడ్డుకునేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నారన్నారు. రాహుల్ కాన్వాయ్‌పై దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావ్ పాటిల్, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ షెడ్మకి ఆనంద్ రావు, పట్టణ అధ్యక్షుడు నగేష్, కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు సంతోష్‌రావు, మైనార్టీ నాయకులు షకిల్, తదితరులు పాల్గొన్నారు.
– కంది శ్రీనివాసరెడ్డిపై సీతక్క ప్రశంసలు
ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసలు కురిపించారు. ఇంద్రవెల్లి సన్నాహక సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె కేఎస్ఆర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ ఏమాత్రమూ వెనుకడుగేయని యువనేత శ్రీనివాసరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఆయనను చూస్తే తనను తాను చూసుకున్నట్టు ఉందని, 20 ఏళ్ల క్రితం తాను కూడా ఇలాగే ఓటమి చెందానని గుర్తుచేసుకున్నారు. ఓడితే అమెరికా వెళ్లిపోతాడని ఎన్నికల సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. కానీ అవన్నీ అబద్దాలని కంది నిరూపిస్తున్నారన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆయన పనితనం తమను ఎంతో ఆకట్టుకుంటోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని ప్రతిసభలో కంది శ్రీనివాసరెడ్డి మార్క్ కనిపించిందన్నారు. ఆదిలాబాద్ నుంచి 25 వేల మందిని తరలిస్తారన్న నమ్మకం, విశ్వాసం ఉందన్నారు.