Mallikarjun Kharge | ప్రధాని పోస్టుపై ఆసక్తి లేదు: ఖర్గే

Mallikarjun Kharge అధికారం మీద కూడా అదే వైఖరి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన కూటమికి ‘ఐఎన్‌డీఐఏ’గా పేరు పెట్టే అవకాశం సారథ్య బాధ్యతలు సోనియాగాంధీకి? బెంగళూరు: అధికారం విషయంలోగానీ, ప్రధాని అభ్యర్థి విషయంలోగానీ తమ పార్టీకి ఆసక్తి లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిపోరుకు కార్యాచరణ కోసం బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల సమావేశం నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థి […]

  • By: Somu    latest    Jul 18, 2023 10:28 AM IST
Mallikarjun Kharge | ప్రధాని పోస్టుపై ఆసక్తి లేదు: ఖర్గే

Mallikarjun Kharge

  • అధికారం మీద కూడా అదే వైఖరి
    ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన
    కూటమికి ‘ఐఎన్‌డీఐఏ’గా పేరు పెట్టే అవకాశం
    సారథ్య బాధ్యతలు సోనియాగాంధీకి?

బెంగళూరు: అధికారం విషయంలోగానీ, ప్రధాని అభ్యర్థి విషయంలోగానీ తమ పార్టీకి ఆసక్తి లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిపోరుకు కార్యాచరణ కోసం బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల సమావేశం నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థి కావడం కోసమే ప్రతిపక్షాలను దగ్గరకు తీసుకుంటున్నారన్న బీజేపీ విమర్శలకు ఈ ప్రకటన చెక్ పెట్టినట్టయింది.

‘అధికారం మీదకానీ, ప్రధాని పోస్టు మీదకానీ కాంగ్రెస్‌కు ఆసక్తిలేదు. ఈ సమావేశం ద్వారా మా సొంత శక్తులను పెంపొందించుకోవడం మా ఉద్దేశం కాదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించుకోవడమే ఈ సమావేశం ఉద్దేశం’ అని ఖర్గే చెప్పారు. తామవి 26 రాజకీయ పార్టీలని, 11 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయని అన్న్రు. ‘బీజేపీకి సొంతంగా 303 సీట్లు రాలేదు. తన భాగస్వామ్య పక్షాల ఓట్లను వాడుకుని, తర్వాత వాటిని వదిలేసింది’ అని ఆయన విమర్శించారు.

‘మాలో కొంత మంది మధ్య రాష్ట్రాల స్థాయిలో కొన్ని విభేదాలు ఉన్నాయన్న విషయంలో మాకు అవగాహన ఉన్నది. ఈ విభేదాలు సైద్ధాంతికపరమైనవి కావు. ఇవేమీ పెద్దవి కావు. దేశంలో సగటు ప్రజలు, మధ్యతరగతి, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల హక్కులు నిశ్శబ్దంగా అణచివేతకు గురవుతున్నాయి. ఈ వర్గాల ప్రయోజనాల కోసం మా విభేదాలను పక్కనపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు’ అని ఆయన స్పష్టం చేశారు.

రెండు రోజుల ఈ సమావేశంలో ఖర్గేతోపాటు.. సోనియాగాధీ, రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్‌, ఎంకే స్టాలిన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సొరేన్‌, మమతాబెనర్జీ, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌యాదవ్‌ తదితరులు పాల్గొంటున్నారు. మొదటిరోజు డిన్నర్‌ సమావేశానికి హాజరుకాలేక పోయిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ రెండో రోజు సమావేశానికి హాజరయ్యారు.

కూటమికి పేరు ఐఎన్‌డీఐఏ అని నామకరణం చేయనున్నట్టు తెలుస్తున్నది. ఐదు పేర్లు చర్చలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకూ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీకే దీని బాధ్యతలూ అప్పగిస్తారని సమాచారం. ఇండియా అనే పదం లేకుండా చూడాలని సోనియా ప్రతిపాదించగా.. ఫ్రంట్‌ అనే పదం ఉండకూడదని మమతాబెనర్జీ చెప్పినట్టు తెలుస్తున్నది. ‘మేం ఐక్యంగా ఉన్నాం’ అనేది కూటమికి ట్యాగ్‌లైన్‌గా ఉండబోతున్నదని సమాచారం.