ప్ర‌భుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ క‌స‌ర‌త్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది

ప్ర‌భుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ క‌స‌ర‌త్తు
  • ప్ర‌భుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ క‌స‌ర‌త్తు
  • హైద‌రాబాద్‌లోని హోట‌ల్‌లో సీఎల్పీ స‌మావేశం
  • హాజ‌రైన 64 మంది గెలిచిన ఎమ్మెల్యేలు
  • ఏక‌వాక్య తీర్మానం చేయ‌నున్న సీఎల్పీ
  • ముందే ఉత్త‌మ్‌, భ‌ట్టితో డీకే స‌మావేశం
  • నేడు రాజ్‌భ‌వ‌న్‌లో సీఎం, డిప్యూటీ సీఎం
  • కొంద‌రు మంత్రుల ప్ర‌మాణం!
  • 24 పోస్టుల‌కు 32 మంది పోటీ
  • ముఖ్య‌మంత్రితోపాటు 19 మందితో మంత్రి వ‌ర్గం


విధాత‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది. సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని హోట‌ల్ ఎల్లాలో సీఎల్పీ స‌మావేశం జ‌రిగింది. దీనికి గెలుపొందిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో సీఎల్పీ నేత‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. త‌దుప‌రి ఏక‌వాక్య తీర్మానం చేస్తార‌ని తెలిసింది.

సీఎస్పీ స‌మావేశానికి ముందు సీనియ‌ర్ నేత‌లు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డితో డీకే శివ‌కుమార్ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ముఖ్య‌మంత్రి ఎంపిక‌, మంత్రి వ‌ర్గ కూర్పుల‌పై వారితో చ‌ర్చించారు. అధిస్ఠానం నిర్ణ‌యమే ఫైన‌ల్ అన‌ట్టుగా శివ‌కుమార్ వారికి చెప్పిన‌ట్టు తెలిసింది. అధిష్ఠానం నిర్ణ‌యానికి అంద‌రూ క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టంచేసిన‌ట్టు స‌మాచారం.


అంతా అనుకున్న‌ట్టు జరిగితే సోమ‌వారమే రాజ్‌భ‌వ‌న్‌లో సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు లేదా ఒక‌రు ఇద్ద‌రు మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ మేర‌కు రాజ్‌భ‌వ‌న్‌లో ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. 24 పోస్టుల‌కు 32 మంది పోటీ ప‌డుతున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ముఖ్య‌మంత్రితోపాటు 19 మందిని మంత్రివ‌ర్గంలోకి తీసుకొనే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. సీనియ‌ర్‌, సామాజికవ‌ర్గాల వారీగా మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది.

తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 30వ తేదీన 119 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నాయ‌కత్వ‌లోని బీఆర్ఎస్ అనూహ్యంగా 39 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. ఇక బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో గెలుపొందాయి.