Congress | పొంగులేటికి బ్యాక్‌బోన్ ఆ కింగ్‌మేకర్.. RS… అసమానుడు
Congress కాకలుతీరిన నేత మూడుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ వరంగల్, ఖమ్మం జిల్లాలపై ప్రభావం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర రాజకీయ చిత్రపటంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చకు దారి తీసిన ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతాడనే చర్చకు దాదాపు తెరపడినట్లే. అనుమానాల మబ్బులు విడిపోయి దాదాపు ఆయన కాంగ్రెస్‌లో చేరడం లాంఛన ప్రాయంగా మాత్రమే మిగిలిపోయింది. ఆయన బిజెపిలో చేరుతాడని కొద్దికాలం, సొంత పార్టీ పెడతారని మరికొంత కాలం […]

Congress
- కాకలుతీరిన నేత
- మూడుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ
- వరంగల్, ఖమ్మం జిల్లాలపై ప్రభావం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర రాజకీయ చిత్రపటంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చకు దారి తీసిన ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతాడనే చర్చకు దాదాపు తెరపడినట్లే. అనుమానాల మబ్బులు విడిపోయి దాదాపు ఆయన కాంగ్రెస్‌లో చేరడం లాంఛన ప్రాయంగా మాత్రమే మిగిలిపోయింది.
ఆయన బిజెపిలో చేరుతాడని కొద్దికాలం, సొంత పార్టీ పెడతారని మరికొంత కాలం రాజకీయ ఊహగానాలు వెలువత్తాయి. అయితే ఆఖరిగా ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. పొంగులేటి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి తెర వెనక సూత్రధారి కింగ్ మేకర్ ఓ రాజకీయ కురువృద్ధుడు కారణం. ఆయనే రామ సహాయం సురేందర్ రెడ్డి (ఆర్ ఎస్).
డెబ్భై సంవత్సరాలకుపైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్ని పరిణామాలు., పరిస్థితులు వచ్చిన పార్టీ వీడలేదు. ఆయన మహబూబాబాద్ జిల్లాకు చెందిన రామసహాయం.
మూడు సార్లు ఎమ్మెల్యే, ఎంపీ
మూడుసార్లు 1978-83, 1983-85, 1985-89 డోర్నకల్ ఎమ్మెల్యే, అందులో ఒకసారి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967-71, 1989-91,1991-96లలో మూడుసార్లు వరంగల్ ఎంపిగా రామసహాయం గెలుపొందారు. ఒక సారి ఎంపీగా ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు. రెండు దశాబ్ధాలకు పైగా రాజకీయాలకు దూరంగా ఆర్ఎస్ ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెగిపోలేదు.
పొంగులేటి వెనుక అదృశ్య హస్తం
పొంగులేటి బీఆర్ఎస్ ను వీడడానికి, ఆ తర్వాత తన రాజకీయ నూతన పయనం కాంగ్రెస్ వైపు నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణం ఈ కింగ్ మేకరే అంటే కొంతమంది నమ్మకం పోవచ్చు. కానీ, ఆయన రాజకీయ చరిత్ర ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఆయన పట్టు,రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో ఆయనకున్న స్థానం. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఇప్పటికీ చెక్కుచెదరని పరపతి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటిని కలిసిన సందర్భంగా ఒక ఫోటోలో ఓ వృద్ద నాయకుడు ఓ మూలగా కనిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఆయనతో చర్చిస్తున్నారు. మనం అంతగా పట్టించుకోకపోవచ్చు కానీ అది ఆయనకున్న ప్రాధాన్యతకు నిదర్శనమైన ఫోటో.
పోటోచూడగానే రేవంత్ రెడ్డిని, పొంగులేటి ని టక్కున గుర్తుపడతారు.. కానీ ఆ..మూడోవ్యక్తి వీరిద్దరికన్నా రాజకీయ ఉద్దండుడు.
వేలకోట్ల వ్యాపారసామ్రాజ్యానికి అధిపతి.. అనేక నాలుగైదు దశాబ్దాల ప్రత్యక్ష, మరో నాలుగు దశాబ్దాల పరోక్ష రాజకీయ చరిత్రకు ప్రత్యక్షసాక్షి.
అధిష్ఠానానికి ఆప్తుడు
కాంగ్రెస్ లో అత్యంతసీనియర్ నేత, మాజీ యంపి, మాజీ ఎమ్మెల్యే, ఇందిరాగాంధీ నుంచి సంజయ్ గాందీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, ప్రియాంకగాంధీ దాకా అందరికీ ఆత్మీయుడు.
ఎందరో నాయకులను సృష్టించిన, మరెందరినో పదవులలో కూర్చోబెట్టిన ఘన రాజకీయచరిత్ర ఆయన స్వంతం.
ఎందరికో రాజకీయ గురువు
ఎమ్మెల్యే రెడ్యానాయక్, బీఆర్‌ఎస్ నేత నూకల నరేష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే పొదెంవీరయ్య, కాంగ్రెస్ నాయకుడు వరదరాజేశ్వర్ రావు వంటి నాయకులెందరికో రాజకీయ గురువు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనుకున్న అదృశ్యహస్తం ఆయనే ఆర్ఎస్.
పొంగులేటి కూతురును ఆర్ఎస్ చిన్నమనవడు ఇటీవల వివాహం చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఏర్పడింది. అందుకే ఆర్ ఎస్ ఈ వ్యవహారంలో తనదైన శైలితో చక్రం తిప్పినట్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో సురేందర్ రెడ్డి ప్రభావం ఖమ్మం, వరంగల్ జిల్లాల మీద ప్రత్యక్షంగా పడే అవకాశం లేకపోలేదు.