CPI, CPM | వాళ్లిద్దరు కలిశారు.. మరి మా మాటెమిటో..? వామపక్షాల్లో అంతర్మథనం!
CPI, CPM విధాత: తెలంగాణ రాజకీయాల్లో బల పడుతున్న కాంగ్రెస్‌ను నిలువరించేందుకని.. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ నుంచి సేవ్ చేసేందుకని.. రకరకాల కారణాల నేపధ్యంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ , బీజేపీ నాయకత్వం ఇద్దరు కూడా యూటర్న్ తీసుకుని లోపాయికారిగా ఒక్కటయ్యారన్న ప్రచారం జోరందుకున్న క్రమంలో రాజకీయంగా తమ పరిస్థితి ఏమిటన్న దానిపై వామపక్షాలు అయోమయంతో అంతర్మథనంతో రగులుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో బిజేపికి వ్యతిరేకంగా చిగురించిన మైత్రి బంధం బీఆర్‌ఎస్, వామపక్షాల మధ్య రానున్న […]

CPI, CPM
విధాత: తెలంగాణ రాజకీయాల్లో బల పడుతున్న కాంగ్రెస్‌ను నిలువరించేందుకని.. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ నుంచి సేవ్ చేసేందుకని.. రకరకాల కారణాల నేపధ్యంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ , బీజేపీ నాయకత్వం ఇద్దరు కూడా యూటర్న్ తీసుకుని లోపాయికారిగా ఒక్కటయ్యారన్న ప్రచారం జోరందుకున్న క్రమంలో రాజకీయంగా తమ పరిస్థితి ఏమిటన్న దానిపై వామపక్షాలు అయోమయంతో అంతర్మథనంతో రగులుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలో బిజేపికి వ్యతిరేకంగా చిగురించిన మైత్రి బంధం బీఆర్‌ఎస్, వామపక్షాల మధ్య రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు బాటలు వేస్తుందని సీపీఐ, సీపీఎం నేతలు గంపేడాశలు పెట్టుకున్నారు. గతంలో తోక పార్టీలని హేళన చేసిన సీఎం కేసీఆర్ నోటితోనే వామపక్ష ప్రగతీశీల శక్తులతో కలిసి బిజేపీని ఓడిస్తామని చెప్పేలా చేసిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్‌తో తమ పొత్తు ఖాయమని భావించాయి.
అందుకు విరుద్ధంగా, అనూహ్యంగా సీఎం కేసీఆర్ బీజేపీకి దగ్గరయ్యారన్న సంకేతాలు.. బిజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ అన్న వార్తలు జోరందుకున్న నేపధ్యంలో బీఆర్‌ఎస్‌తో వామపక్షాల పొత్తు ఆశలు ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో భవిష్యత్ రాజకీయ వ్యూహాలు ఏమిటన్నదానిపై కింకర్తవ్యం అనుకుంటు వామపక్ష నేతలు రాజకీయ చౌరస్తాలో నిలబడాల్సి వచ్చింది.
అసలు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఖమ్మం బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ పిదప సీఎం కేసీఆర్ సీపీఐ, సీపీఎం నాయకులను ఏనాడు తలవని పరిస్థితి సాగింది. ఐనప్పటికి బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యూహంతో అసెంబ్లీలో ఫ్రాతినిధ్యం సాధించాలని, రాష్ట్ర రాజకీయాలలో ఉనికిని చాటి బలపడాలని ఉభయ కమ్యూనిస్టులు కలలు కన్నారు.
బీఆర్‌ఎస్‌కు సైతం వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగిన నేపధ్యంలో సహజంగానే ప్రజల్లో నెలకొన్న కొంత వ్యతిరేకత నేపధ్యంలో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కూడా మునుగోడు మోడల్‌కు మొగ్గు చూపారు. దీంతో సీపీఐ, సీపీఎం నాయకత్వం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తో పొత్తు ఖాయమన్న ధీమాతో ఉన్నాయి. అదే ధీమాతో రెండుపార్టీలు కూడా తాము పోటీ చేయదలచిన స్థానాల్లో యాత్రలు నిర్వహించి.. అక్కడి స్థానిక బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించి పొత్తు సంకేతాలను… ఆ నియోజకవర్గాల్లో పోటీ ఉద్దేశాలను చాటారు.
సీట్ల పంచాయితీ తెగకపోయినా… ఉభయ కమ్యూనిస్టులకు కలిపి సింగిల్ డిజిట్ సీట్లు ఇచ్చినా సర్ధుకుపోవాలని భావించారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే అనూహ్యంగా సీఎం కేసీఆర్ బిజేపీకి లోపాయికారిగా దగ్గరయ్యారని బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా మారిందన్న ప్రచారంతో కమ్యూనిస్టుల పొత్తుల ఆశలన్ని ఒక్కసారిగా గల్లంతయ్యాయి.
ఇప్పుడు బీఆర్‌ఎస్‌తో పొత్తుపైన, ఆ పార్టీ మారిన రాజకీయ వైఖరులపైన ఏ విధంగా స్పందించాలో అర్థం కాక కామ్రేడ్లు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరిణామాలను మొదటి నుండి ఊహిస్తూ
పొత్తు ను వ్యతిరేకిస్తు వచ్చిన వామపక్ష శ్రేణులు ఇకమీదట తమ పార్టీ భవితవ్యం ఏమిటన్నదానిపై మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌తో పొత్తు.. రాజకీయ వ్యూహాలపై తమ నాయకత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుందోనంటు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. బిజేపికి బీఆర్‌ఎస్ బీటీమ్ అన్న ప్రచారంపై వామపక్షాలు మౌనం వీడి రాజకీయంగా ఏ విధంగా స్పందిస్తాయన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.