మిజ్‌గాం తుపాను.. చెన్నై భారీ వర్షాలకు 8 మంది మృతి
మిజ్‌గాం తుపాను కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై రహదారులు నదుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి

చెన్నై : మిజ్‌గాం తుపాను కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై రహదారులు నదుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో కార్లు, ఇతర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇక భారీ వర్షాలకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు నిరాశ్రయులయ్యారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక ప్రయివేటు కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. భారీ ఈదురు గాలుల నేపథ్యంలో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇక ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది. రైళ్లు, విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపై వరద నీరు నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గత 24 గంటల్లో చెన్నైలోని పెరుంగుడిలో అత్యధికంగా 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరువల్లూరు జిల్లాలోని అవడిలో 28 సెం.మీ., చెంగల్‌పేట్‌లోని మమల్లపురంలో 22 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే కొద్ది గంటల్లో చెన్నై, తిరువల్లూరు, చెంగల్‌పేట్, కంచీపురం, రాణిపేట్, వేలూరు, తిరుపట్టూరు, తిరువన్నమలై, విల్లుపురం, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు