ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితదే కీలక పాత్ర
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులను అందించడంలో

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులను అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నది. ఆప్ నేతలతో కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని లీక్ చేసి, ముందుగా వారికి రూ.100 కోట్లు చెల్లించారని వెల్లడించింది. ఇప్పటివరకు 250 చోట్ల సోదాలు చేసి ఐదు అనుబంధ చార్జి షీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. 128 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించి సీజ్ చేశామని పేర్కొంది. నిందితులైన ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌లతో కవితకు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపించింది. కవితను అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడిలోకి తీసుకొని విచారిస్తున్నామని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన కవిత ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో కవిత కుటుంబ సభ్యులు ఆటంకం కలిగించారని తెలిపింది.
మరోవైపు లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని పేర్కొంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుండగానే ఆకస్మికంగా అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి, ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తన అరెస్టు ద్వారా ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని, అందుకు దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కవిత తరపున వారి న్యాయవాది ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
అటు సోమవారం ఈడీ విచారణకు హాజరు కావలసిన కవిత భర్త అనిల్, సిబ్బంది తాము విచారణకు హాజరు కాలేమంటూ ఈడికి సమాధానం పంపారు. అనిల్‌తోపాటు కవిత పీఏ, ముగ్గురు వ్యక్తిగత సిబ్బందికి ఈడీ సమన్లు జారీ చేయగా వారు విచారణకు హాజరు కాలేమని ఈడీకి లేఖ రాశారు. దీనిపై ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.