94 ఓట్ల తేడాతో ఓట‌మి పాలైన డిప్యూటీ సీఎం

ఛత్తీస్‌గ‌ఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ మ‌ట్టి క‌రిపించింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ 54 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వ‌చ్చింది.

94 ఓట్ల తేడాతో ఓట‌మి పాలైన డిప్యూటీ సీఎం

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గ‌ఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ మ‌ట్టి క‌రిపించింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ 54 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వ‌చ్చింది. అయితే కాంగ్రెస్ స‌ర్కార్‌లో మంత్రులుగా కొన‌సాగిన 9 మంది మంత్రులు ఓడిపోయారు. ఆ జాబితాలో డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ డియో కూడా ఉన్నారు. కేవ‌లం 94 ఓట్ల తేడాతోనే టీఎస్ సింగ్ ఓట‌మి ప‌రాజ‌యం చ‌విచూశారు.


అంబికాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన సింగ్ డియోకు 90,686 ఓట్లు పోల‌య్యాయి. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన‌ రాజేశ్ అగ‌ర్వాల్‌కు 90780 ఓట్లు పోల‌య్యాయి. వాస్త‌వానికి సింగ్ డియో.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో సంప‌న్న ఎమ్మెల్యే. ఆయ‌న రాజ‌కుటుంబానికి చెందిన వ్య‌క్తి. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉండే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు.


దుర్గ్ రూర‌ల్ స్థానంలో నుంచి పోటీ చేసిన హోంమంత్రి సాహూ 16వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థి ల‌లిత్ చంద్రాక‌ర్ చేతిలో ఓడిపోయారు. స‌జా స్థానం నుంచి రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి ర‌వీంద్ర చౌబే 5 వేల ఓట్ల తేడాతో దిన‌స‌రి కూలీ ఈశ్వ‌ర్ సాహుపై ఓడిపోయారు. శివ‌కుమార్ ద‌హ‌రియా, గురు రుద్ర కుమార్‌, అమ‌ర్‌జీత్ భ‌గ‌త్‌, మోహ‌న్ మార్క‌మ్‌, జై సింగ్ అగ‌ర్వాల్ లాంటి మంత్రులు కూడా ఓడిపోయారు. సీఎం భూపేశ్ భ‌గేల్ విజ‌యం సాధించారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ కాంగ్రెస్ చీఫ్ దీప్ బ‌యిజ్‌.. చిత్ర‌కూట్ స్థానం నుంచి ఓట‌మి చెందారు.