డిసెంబర్ 31న డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ
DGP Mahender Reddy | తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం మరో నెలన్నర రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ పొందనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి.. తెలంగాణ రెండో డీజీపీగా 2017లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి డీజీపీగా అనురాగ్ […]

DGP Mahender Reddy | తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం మరో నెలన్నర రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ పొందనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి.. తెలంగాణ రెండో డీజీపీగా 2017లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి డీజీపీగా అనురాగ్ శర్మ 2017 నవంబర్ వరకు సేవలందించిన విషయం విదితమే.
ఇది మహేందర్ రెడ్డి నేపథ్యం..
మహేందర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కిష్టాపురం గ్రామం. 1962, డిసెంబర్ 3న నారాయణరెడ్డి, అచ్చమ్మ దంపతులకు మహేందర్ రెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యను నల్లగొండ జిల్లా సర్వేల్ గురుకుల పాఠశాలలో పూర్తి చేశారు. వరంగల్ ఎన్ఐటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ పుచ్చుకున్నారు. ఎన్ఐటీ ఢిల్లీలో ఎంటెక్ చదువుతూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. 1986లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు మహేందర్ రెడ్డి. ఆయన 2020లో జేఎన్టీయూహెచ్ నుంచి ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలీసింగ్‌పై పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఆయనకు భార్య అనిత, కుమారుడు నితేష్ ఉన్నాడు.
కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా మహేందర్ రెడ్డి తొలిసారిగా నియామకం అయ్యారు. తరువాత గుంటూరులో, బెల్లంపల్లిలో పని చేసి నిజామాబాద్, కర్నూల్ జిల్లా ఎస్పీగా సేవలందించారు. 1995లో హైదరాబాద్ తూర్పు జోన్ డీసీపీగా పని చేసి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా, ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 2014, జూన్ 2వ తేదీన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్ శర్మ 2017, నవంబర్ 12న పదవీ విరమణ చేయడంతో.. తదనంతరం మహేందర్ రెడ్డి ఇంచార్జి డీజీపీగా నియామకం అయ్యారు. 2018, ఏప్రిల్ 10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు.