Karnataka Polls | కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం పీఠం చిచ్చు.. తెరపైకి ఖర్గే పేరు!

Karnataka Polls |  తెరపైకి ఖర్గే పేరు తెచ్చిన డీకే శివకుమార్‌ సిద్ధరామయ్యకు చాన్స్‌లపై దెబ్బకొట్టేందుకే? ఖర్గే సీఎం అయితే ఎంతో సంతోషిస్తా.. గతంలోనూ ఖర్గేకు అన్యాయం జరిగింది పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Polls) గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు.. తమదైన రాజకీయాలను ముందుకు తెచ్చారు. ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనైనా సీఎం […]

Karnataka Polls | కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం పీఠం చిచ్చు.. తెరపైకి ఖర్గే పేరు!

Karnataka Polls |

  • తెరపైకి ఖర్గే పేరు తెచ్చిన డీకే శివకుమార్‌
  • సిద్ధరామయ్యకు చాన్స్‌లపై దెబ్బకొట్టేందుకే?
  • ఖర్గే సీఎం అయితే ఎంతో సంతోషిస్తా..
  • గతంలోనూ ఖర్గేకు అన్యాయం జరిగింది
  • పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యం
  • కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌

విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Polls) గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు.. తమదైన రాజకీయాలను ముందుకు తెచ్చారు. ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనైనా సీఎం అభ్యర్థిని కాంగ్రెస్‌ ప్రత్యేకంగా ప్రకటించదు. కానీ.. నాయకులు మాత్రం తమ వంతు ప్రయత్నాల్లో ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల సిద్ధరామయ్య తాను సీఎం రేసులో వందశాతం ఉన్నానంటూ వ్యాఖ్యానించారు.

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా సీఎం పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆయనకు ఆ కోరిక ఉండటంలో తప్పులేదని కూడా సిద్ధరామయ్య అన్నారు. అయితే.. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును డీకే శివకుమార్‌ తెరపైకి తేవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. సిద్ధరామయ్య అవకాశాలను దెబ్బతీసేందుకే దళిత ముఖ్యమంత్రి, పార్టీలో ముందు నుంచీ ఉంటున్నవారు, మధ్యలో వచ్చినవారు.. అనే అంశాలను డీకే తెచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఖర్గే సీఎం అయితే సంతోషిస్తా..

ఖర్గే ముఖ్యమంత్రి అయితే ఆయన నాయకత్వంలో పని చేయడానికి ఇష్టపడతానని డీకే వ్యాఖ్యానించారు. దీనితోపాటు ఖర్గేకు గతంలో అన్యాయం జరిగిందనే చర్చ కూడా పార్టీలో అక్కడక్కడ వినిపిస్తున్నదని పేర్కొన్నారు. అయితే.. పార్టీ నిర్ణయమే ఫైనల్‌ అని డీకే అన్నారు. ‘ఖర్గే మా సీనియర్‌ నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు. ఆయన సీఎం సీటు కోరుకోలేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నదే ఆయన ఏకైక కోరిక. ఆయన సీనియర్‌ నేత. గతంలో ఆయనకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం పార్టీలో ఉన్నది’ అని ఆయన శృంగేరిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఖర్గే పార్టీ పీఠంపై ఉన్నారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికే వదిలేస్తున్నాను. సిద్ధరామయ్య, ఇతరులు కూడా పార్టీ నిర్ణయానికే కట్టుబడుతారు. పార్టీయే అన్నింటికన్నా ముఖ్యం’ అని ఆయన చెప్పారు.

సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే

ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే.. సిద్దరామయ్యతోపాటు.. డీకే శివకుమార్‌ కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్షతో ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా తమ కోరికను వెలిబుచ్చుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యను టార్గెట్‌ చేసే విధంగా ఖర్గే పేరును ఆయన తీసుకువచ్చారన్న చర్చ జరుగుతున్నది. పైగా.. ఆయనను, ఆయన నాయకత్వాన్ని సమర్థించక పోతే మనం మనుషులమేనా? అని సైతం డీకే వ్యాఖ్యానించడం విశేషం. ఇటీవలి కాలంలో డీకే చేస్తున్న వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందనను మీడియా కోరగా.. ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని అన్నారు.

ఖర్గేకు గతంలో అన్యాయం..

గతంలో మూడుసార్లు ఖర్గే సీఎం అవలేక పోయారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 1999లో ఖర్గే సీఎం అవుతారనుకున్నా.. ఎస్‌ఎం కృష్ణకు అవకాశం దక్కింది. 2004లో ధరమ్‌సింగ్‌, 2013లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

ఖర్గే.. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారా?

అయితే.. ఖర్గేకు రాజకీయంగా, పార్టీ పరంగా ఉన్న బాధ్యతలు, పదవుల రీత్యా ఆయన తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు చాలా పరిమితమేనని కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

దళిత సీఎం అంశంపై చర్చ

దళిత సీఎం అనే అంశం మాత్రం చర్చలో ఉన్నది. పార్టీలో దళిత నాయకులుగా జీ పరమేశ్వర, కేహెచ్‌ మునియప్ప వంటివారు ఉన్నారు. వీరు అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా నిలిచారు. కర్ణాటకకు ఇప్పటి వరకూ ఒక దళితుడు ముఖ్యమంత్రి కాలేదు. ప్రస్తుతం పార్టీలో సమర్థత కలిగిన అనేక మంది దళిత నాయకులు ఉన్న కారణంగా ఈ అంశాన్ని పరిశీలించాలని పార్టీలో కొంతమంది వాదిస్తున్నారు.

నేను సైతం అంటున్న పరమేశ్వర

పార్టీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి రేసులో తాను సైతం ఉంటానని ఇటీవలే పరమేశ్వర ప్రకటించారు. హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా కర్ణాటక పీసీసీకి సుదీర్ఘకాలం (ఎనిమిదేండ్లు) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మునియప్ప కూడా చాలా సీనియర్‌. కోలార్‌ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు.