డ్రగ్ కంట్రోల్ శాఖ ఆకస్మిక దాడులు..నకిలీ మందుల స్వాధీనం
తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించి

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించి, నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని శాలిబండలో నకిలీ లేబుల్స్‌తో ఆయిల్ నిల్వలను తయారు చేస్తున్న ఓ ఇంట్లో అధికారులు ఆకస్మిక సోదాలు జరిపారు. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు మాయమవుతాయంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తించారు. అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, ఆయో ఆర్గానిక్ వాల్‌నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజి ఆయిల్స్ పేరిట నకిలీ లేబుల్స్ సృష్టించి మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు.
పక్కా సమాచారంతో నకిలీ ఆయిల్స్ తయారు చేసే కేంద్రాలపై రైడ్స్ చేశామని చెప్పారు. నిర్వాహకుల దగ్గరి నుంచి పెద్దమొత్తంలో ఆయిల్ నిల్వలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ రూ. 21 వేలు ఉంటుందన్నారు. అలాగే నల్గొండలో ఇర్కిగూడెం గ్రామం, దామెరచర్ల మండలంలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీ దాసరి మల్లయ్య మెడికల్ షాపు నిర్వహిస్తున్నారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. షాపులో 41రకాల నకిలీ టాబెట్లను సీజ్ చేశారు. వీటి విలువ రూ. 45వేలు ఉంటుందని అధికారులు వివరించారు. పట్టుబడ్డ యాంటీ బయోటిక్స్, స్టెరయిడ్స్, అనాల్జెసిక్స్, దగ్గు సిరప్‌లు, యాంటీ అల్సర్, యాంటీ డయాబెటిక్స్, యాంటీహైపెర్టెన్సివ్స్ మందులు ఉన్నాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు.