Mlc Elections: రాష్ట్రంలో MLC ఎన్నికల హడావిడి

ఆరు నుంచి నామినేషన్ల స్వీకరణ అధికార పార్టీ నిర్ణయించిన అభ్యర్థులే ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం విధాత: తెలంగాణలో ఎమ్మెల్సీ (Mlc Elections) ఎన్నికల హడావిడి మొదలైంది. ఒక వైపు మహబూబ్‌ నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా, తాజాగా మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది.  రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌, నవీన్‌కుమార్‌ పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో […]

Mlc Elections: రాష్ట్రంలో MLC ఎన్నికల హడావిడి
  • ఆరు నుంచి నామినేషన్ల స్వీకరణ
  • అధికార పార్టీ నిర్ణయించిన అభ్యర్థులే ఎమ్మెల్సీలు
  • ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం

విధాత: తెలంగాణలో ఎమ్మెల్సీ (Mlc Elections) ఎన్నికల హడావిడి మొదలైంది. ఒక వైపు మహబూబ్‌ నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా, తాజాగా మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌, నవీన్‌కుమార్‌ పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తుంది.

దీంతో ఈ నెల 29 లోగా ఎన్నికల ప్రక్రియ ముగించాల్సి రావడంతో ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఎన్నికల కమిషన్‌ ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నది. 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈలోగా అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు వేయించడానికి అధికార బీఆర్‌ఎస్‌ (BRS) కసరత్తు చేస్తోంది.

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్నది. పైగా ఎంఐఎం సభ్యుల మద్దతు కూడా బీఆర్‌ఎస్‌కే ఉంటుంది. ఎంఐఎం అసెంబ్లీలో ఇస్తున్న మద్దతుకు ప్రతిఫలంగా అధికార బీఆర్‌ఎస్‌ ఇప్పటికే హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎంకు ఇచ్చింది.

దీంతో ఎంఐఎం అభ్యర్థి ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ ప్రతిసారీ బీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతూ వస్తూనే ఉన్నది. బీఆర్‌ఎస్‌ కూడా ఎంఐఎం తమ మిత్రపక్షమని ప్రకటించింది కూడా…

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 104 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇటీవల కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతితో ఒక స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ బలం 103 కాగా మిత్ర పక్షమైన ఎంఐఎంకు ఏడుగురు సభ్యులు ఉన్నారు. మొత్తం కలిపి బీఆర్‌ఎస్‌కు 110 సభ్యుల బలం ఉన్నది.

కాంగ్రెస్‌కు ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. బీజేపీకి ముగ్గురు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్ష పార్టీలు పోటీ చేసే ప్రయత్నం కూడా చేయడంలేదు. దీంతో అధికార పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేఅవకాశం ఉండడంతో బీఆర్‌ఎస్‌లో ఆశావహులు పోటీ పడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరు కాకుండా జిల్లాకు ఒకరిద్దరు నేతలు తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అభ్యర్థిత్వం ఎంపికపై అధినేత కేసీఆర్‌ అన్నికోణాల నుంచి పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.