రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి
విధాత: షెడ్యూల్‌కు 10 నెలల ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎర్పడింది. రాజకీయ పార్టీల మధ్య పచ్ఛగడ్డి వేస్తే మంటమండుతున్నది. రాష్ట్రంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠ పరుచుకొని ముచ్చటగా మూడోసారి అధికారం సాధించుకోవాలని టీఆర్ ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చేసైనా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కాంక్షతో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి తన పూర్వ […]

విధాత: షెడ్యూల్‌కు 10 నెలల ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎర్పడింది. రాజకీయ పార్టీల మధ్య పచ్ఛగడ్డి వేస్తే మంటమండుతున్నది. రాష్ట్రంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠ పరుచుకొని ముచ్చటగా మూడోసారి అధికారం సాధించుకోవాలని టీఆర్ ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చేసైనా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కాంక్షతో ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి తన పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు, పార్టీ అధినేత సోనియా గాంధీ పట్ల తెలంగాణ ప్రజల్లో అభిమానం ఉన్నదని, తమకు అదే శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇలా టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో అధికారం సాధించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య జరుగుతున్న రాజకీయ పోరు కొత్త చర్చకు దారి తీస్తున్నది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని చూసిన తర్వాత రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే కాషాయ నేతల మాటలు, మాకు ఆ పార్టీ ప్రత్యామ్నాయమే కాదని అధికార పార్టీ వాదన రెండూ కరెక్టు కాదని స్పష్టమైంది.
కాంగ్రెస్ పార్టీ అక్కడ డిపాజిట్ తెచ్చుకోకపోయినా ఆ పార్టీ దాదాపు 24 వేల ఓట్ల వరకు సాధించగలిగింది. 2018 లో అదే నియోజకవర్గంలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థికి 12 వేల ఓట్లు వచ్చాయి. అంటే డబుల్ ఓట్లను కాంగ్రెస్‌పార్టీ ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధించగలిగింది. అలాగే బీఎస్పీ కూడా 5 వేల ఓట్లకు చేరువగా వచ్చింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది.
ప్రస్తుతం బీజేపీ అధికార పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నది. 9 నుంచి10 పార్లమెంట్ స్థానాలపై దృష్టి సారించింది. ఆయా పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోకవర్గాల్లో పట్టు సంపాదిస్తే 60పైగా సీట్లలో గట్టిపోటీ ఇవ్వాలని.. అందులో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని భావిస్తున్నది. అందుకే మాజీ ఎమ్మెల్యేలను, బలమైన సామాజికవర్గ నేతలను ఆకర్షించే పనిలో ఉన్నది. ఇందులో భాగంగానే 80పైగా స్థానాల్లో బూత్ లెవల్లో పని మొదలుపెట్టింది.
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ క్రమంగా పెరుగుతున్నది. అంతేకాదు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి క్యాడర్ ఉన్నది. ఆ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ను తట్టుకుని నిలబడే నేతలూ ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ ఇటీవల జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆ పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు.
అంతేకాదు టీఆర్‌ఎస్ కూడా తమకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అంటున్నది. ఇక అధికార టీఆర్‌ఎస్ దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చతిలికపడినా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత చాలా నమ్మకంతో ఉన్నది. ముచ్చటగా మూడోసారి ప్రజల ఆశ్వీర్వాదంతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాలో సీఎం కేసీఆర్ ఉన్నారు.
మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓల్డ్ సిటీలోని 7 స్థానాలు మినహా 112 స్థానాల్లో 30-40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని అధికార పార్టీ అంచనా వేస్తున్నది. అలాగే మరో 20-30 స్థానాల్లో త్రిముఖ పోరు (టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ) ఉండవచ్చు అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికతో తమకే లాభం చేకూరుస్తుందనే లెక్కల్లో ఉన్నారు. బీఎస్పీ కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో ప్రభావం చూపించ వచ్చు, అది కూడా మాకే మేలు చేస్తుందనుకుంటున్నారు.
ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ.. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పుంజుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.