Telangana | ఎలక్షన్ మోడ్! ఎమ్మెల్యేలు.. విపక్షాలు బిజీ!!
విధాత: తెలంగాణ రాష్ట్రంలో అధికార ,విపక్ష పార్టీలలో ఎలక్షన్ మోడ్ వాతావరణం ఊపందుకుంది. నవంబర్ లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తుండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైయస్సార్ టిపి, టీజేఎస్ లు ప్రభుత్వ వైఫల్యాలపై వరుస ఆందోళనలు, పాదయాత్రలతో ప్రజల్లో తమ పట్టును పెంచుకునే ప్రయత్నాల్లో జోరు పెంచారు. పార్టీల సంస్థాగత పటిష్టత, అనుబంధ సంఘాల బలోపేతాలకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విపక్షాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు రైతు, ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉదృతం […]

విధాత: తెలంగాణ రాష్ట్రంలో అధికార ,విపక్ష పార్టీలలో ఎలక్షన్ మోడ్ వాతావరణం ఊపందుకుంది. నవంబర్ లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తుండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైయస్సార్ టిపి, టీజేఎస్ లు ప్రభుత్వ వైఫల్యాలపై వరుస ఆందోళనలు, పాదయాత్రలతో ప్రజల్లో తమ పట్టును పెంచుకునే ప్రయత్నాల్లో జోరు పెంచారు.
పార్టీల సంస్థాగత పటిష్టత, అనుబంధ సంఘాల బలోపేతాలకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విపక్షాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు రైతు, ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మిత్ర పక్షంగా మారిన వామపక్షాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాట యాత్రలతో ఉనికి చాటుతున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యేల హడావుడి
అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ, సంక్షేమ పథకాల అమలులో, అభివృద్ధి పనుల శంకుస్థాపనలలో, ప్రారంభోత్సవాల్లో వేగం పెంచారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనానికి చేరువయ్యే ఏ కార్యక్రమాన్ని కూడా వదలకుండా పాల్గొంటూ హడావుడి చేస్తున్నారు.
తాజాగా బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగిస్తూనే ఇంకోవైపు జగ్జీవన్ రావు, పూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సందడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు హాజరవుతూ రైతుల ఆదరణకు తంటాలు పడుతున్నారు.
గతంలో ఒకటో రెండో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మిగతా వాటి ప్రారంభోత్సవాలను అధికారులకే వదిలేసిన ఎమ్మెల్యేలు ఎన్నికల ఎడాది కావడంతో ఇప్పుడు వీలైనాన్ని ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు.
ఇంకోవైపు రంజాన్ మాసం నడుస్తుండటంతో సమీపిస్తున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇఫ్తార్ విందుల సంఖ్యను ఎమ్మెల్యేలు గణనీయంగా పెంచేశారు. గ్రామాల్లో, మున్సిపాలిటీలో వార్డుల వారిగా ఇఫ్తార్ విందులకు హాజరవుతూ మైనారిటీ ఓటు బ్యాంకుకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలు దిశగా పెండింగ్ లో ఉన్న దళిత బంధు, రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని తిరిగి గ్రౌండింగ్ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియల కోసం అధికారులను ఎమ్మెల్యేలు పరుగులు పెట్టిస్తున్నారు. అంతేగాక పంచాయతీలలో, మున్సిపాలిటీ వార్డుల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించేందుకు, చేయాల్సిన పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ఎమ్మెల్యేలు హడావుడి చేస్తున్నారు.
జిల్లా కేంద్రాలకు చెందిన నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీలు ఉన్న ఎమ్మెల్యేలైతే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో వందల కోట్ల అభివృద్ధి పనులను ముందుకు దూకిస్తున్నారు.
సిసి రోడ్లు, డ్రైనేజీలు,మంచినీటి వసతుల వంటి మౌలిక కల్పనకు సంబంధించిన పెండింగ్ పనులను వెంటనే చేపట్టాలంటు అధికారులను పురమాయిస్తున్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఒకేసారి చేపడుతున్నారు. యువతను, విద్యార్థులను ఆకట్టుకునే దిశగా వారికి స్పోర్ట్స్ కిట్లను అందిస్తూ, వేసవి క్రీడా శిబిరాలకు, టోర్నమెంట్ల నిర్వహణకు సహకరిస్తున్నారు.
గ్రామీణ ప్రజలు జరుపుకునే పండుగలు, జాతరలకు విరాళాలు ప్రకటిస్తూ, వాటికి స్వయంగా హాజరవుతూ వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. పిలిచిందే తడవు అన్నట్లుగా పెళ్లిళ్లకు వెళ్లడంతో పాటు చనిపోయిన వారి ఇండ్లకు వెళ్లి పరామర్శలు, సహాయాల జోరు పెంచారు.
ప్రస్తుతానికి శుభకార్యాలు, జాతరలో లేనప్పటికీ మే నెలలో పెద్ద ఎత్తున ఉండడంతో వాటిలో ఎమ్మెల్యేలు మరింత బిజీ కాక తప్పని పరిస్థితి నెలకొంది. తాము వెళ్లకపోతే టికెట్ ఆశావహులు, ప్రతిపక్ష నాయకులు జనంలోకి వెళ్లే పరిస్థితి ఉండడంతో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా జనంతో మమేకమయ్యే కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
మొత్తంగా అధికా, విపక్ష నేతలంతా పోటాపోటీగా ప్రజా బాహుళ్యంలోని పలు రకాల కార్యక్రమాల లో మునిగితేలుతూ ఎన్నికల మోడ్ లో ముందుకు సాగుతుండగా, క్షేత్రస్థాయిలో రాజకీయ సందడి ఊపందుకుంది.