కార్మికులకు గుదిబండగా టీఎస్ఆర్టీసీ నిర్ణయాలు
టీఎస్ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు దశాబ్దాలుగా వెక్కిరిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వంలో కార్మికుల విలీన ప్రక్రియ కొలిక్కిరాక పోగా, పదకొండేళ్ల

– యాజమాన్యం బకాయి రూ.5 వేల కోట్లపైనే..
– 3 వేలకు పైగా పోస్టులు ఖాళీ
– నగదు రూపంలోకి మారని వేతన ఒప్పంద బాండ్లు
– అటకెక్కిన రుణ దరఖాస్తులు
– కార్మికులను వెక్కిరిస్తున్నదీర్ఘకాలిక సమస్యలు
– ఆశలన్నీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పైనే..
విధాత, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు దశాబ్దాలుగా వెక్కిరిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వంలో కార్మికుల విలీన ప్రక్రియ కొలిక్కిరాక పోగా, పదకొండేళ్ల కిందటి వేతన ఒప్పంద బాండ్లు నేటికీ నగదు రూపంలోకి మార్చలేదు. ప్రతిగా రూ.5,365 కోట్లకు పైగా డీఏ బకాయిలు పేరుకుపోయాయి. మూలనపడిన రుణ దరఖాస్తులు, 2014 నుంచి అందని లీవ్ ఎన్ క్యాష్ మెంట్ తో కార్మికులు మరింత ఊబిలోకి కూరుకుపోతున్నారు. పలు దఫాలుగా కార్మిక సంఘాలతో కలసి కార్మికులు ఉద్యమిస్తున్నా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో తెలంగాణలో ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్ నూతన ప్రజా ప్రభుత్వం పైనే టీఎస్ఆర్టీసీ కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. కార్మికులకు ఇవాల్సిన బకాయిల్లో కొంతైనా ప్రభుత్వం విడుదల చేసుందని ఆశిస్తున్నారు. మరోవైపు టీఎస్ఆర్టీసీలో ఏళ్లకాలంగా పోస్టుల భర్తీ ఊసే లేకుండా పోయింది. సుమారు 3 వేల పోస్టులకు పైగా సంస్థలో ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సిబ్బంది లేక ఉన్న ఉద్యోగులపైనే భారం పడుతోంది. దీంతో పని ఒత్తిడి పెరిగి విధుల్లో ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు సతమతమవుతున్నారు. ఈ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
గత ప్రభుత్వం వేలాది మంది ఆర్టీసీ కార్మికులను ఊరించింది. కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు చర్యలు చేపట్టినా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఏ దిశగా నిర్ణయం తీసుకుంటుందో అన్న సందిగ్ధం కార్మికులను వేధిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు కలసి ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పొదుపు చేసుకుని, అవసరానికి రుణం తీసుకునే వెసులుబాటు కార్మికులకు ఉంది. అయితే ప్రభుత్వం ఈ సొసైటీలో ఉద్యోగ, కార్మికులు పొదుపు చేసిన సొమ్మును కూడా గత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులో వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల రుణ దరఖాస్తులు వేలల్లో పెండింగ్ లో ఉన్నట్లు కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రుణం కోసం 6784 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఏళ్లకాలంగా దరఖాస్తులకు పరిష్కారం చూపకపోవడంతో కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు మరింత కలవరపెడుతున్నాయి. ప్రభుత్వ తీరుతో గుర్రుగా ఉన్న సుమారు 3656 మంది తమ సభ్యత్వాన్నే రద్దుచేసుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2013-వేతన సవరణను ప్రభుత్వం చేపట్టింది. అయితే సవరణ బకాయిల్ని ఆర్టీసీ బాండ్ల రూపంలో ఇచ్చింది. ఇప్పటికీ ఆబాండ్లను నగదు రూపంలోకి మార్చలేదు.
ఈపరిస్థితుల్లో తక్షణ అవసరాలు కడుపు నింపని బాండ్లు కార్మికులను చిర్రెత్తిస్తున్నాయి. దీంతో పాటు 2014 లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ను కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతి నాలుగేళ్లకోసారి ఆర్టీసీలో చేపట్టాల్సిన వేతన ఒప్పందానికీ యాజమాన్యం తూట్లు పొడిచిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 2017, 2021 పీఆర్సీల అమలు అటకెక్కిందని వాపోతున్నారు. వరుసగా యాజమాన్యం కార్మికులను కష్టాల్లోకి నెట్టే చర్యలకు ఉపక్రమిస్తోందన్న వాదన కార్మిక వర్గాలను వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖపై చేపట్టే ఉన్నతస్థాయి భేటీలో తమ కీలక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్నారు.
– కార్మికులకు అందాల్సిన సొమ్ము ఇదే..
ఆర్టీసీ వాడుకున్న సీసీఎస్ డబ్బులు వడ్డీతో కలిపి రూ.1,127 కోట్లు, పీఎఫ్ బకాయిలు రూ.1,450 కోట్లు, ఎస్ఆర్బీసీ రూ.580 కోట్లు, ఎస్బీటీ రూ.158 కోట్లు, 173 నెలల డీఏ బకాయిలు రూ. 750 కోట్లు, 2013 వేతన సవరణ ఒప్పందం బాండ్లు రూ.300 కోట్లు, 2014-23 లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలు రూ.900 కోట్లు, రిటైరైన వారికి చెల్లించాల్సినవి రూ.100 కోట్లు ప్రభుత్వం నుంచి కార్మికులకు అందాల్సి ఉందని కార్మిక సంఘాల నాయకులు లెక్కలు తేల్చారు.