మొదట మానుకోట.. రెండవ విడత వరంగల్!
రేవంత్ రెడ్డి జోడో పాదయాత్ర వరంగల్ చుట్టూ ప్రారంభ సెంటిమెంటు ఎంపీ నియోజకవర్గాల వారీగా యాత్ర 15 నుంచి 27 వరకు షెడ్యూల్ విడుదల కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీలో నిర్ణయం మధ్యలో శివరాత్రి, ప్లీనరీ విరామం నర్సంపేట, జనగామ మినహా విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ టీపీసీసీ అద్యక్షులు, ఎంపీ రేవంత్ […]

- రేవంత్ రెడ్డి జోడో పాదయాత్ర
- వరంగల్ చుట్టూ ప్రారంభ సెంటిమెంటు
- ఎంపీ నియోజకవర్గాల వారీగా యాత్ర
- 15 నుంచి 27 వరకు షెడ్యూల్ విడుదల
- కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీలో నిర్ణయం
- మధ్యలో శివరాత్రి, ప్లీనరీ విరామం
- నర్సంపేట, జనగామ మినహా
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ టీపీసీసీ అద్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో ప్రారంభ సెంటిమెంట్ వరంగల్ చుట్టూ తిరుగుతోంది.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా మొదటి విడత మానుకోట పార్లమెంటు నియోజకవర్గంలో చేపట్టగా, రెండవ విడత వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
మొదటి విడత ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు నియోజకవర్గ అటవీ ప్రాంతంలో కొలువైన మేడారం జాతర నుంచి ప్రారంభం కాగా, రెండో విడత కూడా వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఉమ్మడి జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు విడతలు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది.
రేవంత్ రెడ్డి వర్గం దే పై చేయి
రెండవ విడత పాదయాత్ర చేపట్టే వరంగల్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు మెజారిటీ నేతలు రేవంత్ అనుకూల వర్గం కావడం విశేషం. దీంతో అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అడ్డంకులు, అభ్యంతరాలు లేకుండా యాత్ర కొనసాగించే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ మేరకు ఆయా సెగ్మెంట్ల ఇన్‌చార్జిలంతా యాత్రకు సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు.
యాత్రలో స్వల్ప మార్పులు
ముందుగా నిర్ణయించిన ప్రకారం కాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టే పాదయాత్ర షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. ముందుగా 14వ తేదీ నుంచి యాత్ర ప్రారంభించాలని భావించినప్పటికీ, ఈ నెల 14 న రేవంత్ పాదయాత్ర భద్రాచలంలో ఏర్పాటు చేశారు. భద్రాచలంలో జరిగే యాత్రలో సీఎల్పీ నాయకుడు ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పాల్గొంటున్నందున వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని ప్రకటించారు.
ముఖ్య నాయకులతో రేవంత్ సమావేశం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జూడో పాదయాత్ర ఈ నెల 15 నుండి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించేందుకు ముఖ్య నాయకుల భేటీలో నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పాదయాత్రలో ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి సంభాని చంద్ర శేఖర్, శోభా రాణి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీమేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శి దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, జనగామ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు జంగా రాఘవ రెడ్డి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆయిత ప్రకాష్ రెడ్డి, పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రాం రెడ్డి.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యులు సింగాపురం ఇందిర, భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యులు గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు నమిండ్ల శ్రీనివాస్, మాజీ కేంద్రమంతి బలరాం నాయక్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ యాత్ర కొనసాగే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలలో ఆశావాహులు, సీనియర్ నేతలు, పార్టీ ఇంచార్జిలు, పరిశీలకులు విజయవంతం కోసం సన్నాహాలు కొనసాగిస్తున్నారు.
రెండో విడత పాదయాత్ర షెడ్యూల్
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పాదయాత్ర షెడ్యుల్ వివరాలిలా ఉన్నాయి. ఈనెల 15న పాలకుర్తి, 16న వర్ధన్నపేట, 17న స్టేషన్ ఘనపూర్, 18, 19న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విరామం. 20న వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పులలో 21, 22న భూపాలపల్లి పాదయాత్ర కొనసాగనునుంది.
ఈ నెల 23, 24, 25, 26న రాయ్‌పూర్ ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో రేవంత్ పాల్గొంటారు. ఈ కారణంగా మూడు రోజులు విరామం ప్రకటించారు. తిరిగి 27న పరకాల నియోజకవర్గంలో చేపట్టనున్నారు. దీంతో వరంగల్ పార్లమెంటు నియోజక వర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్ర పూర్తి కానున్నది.
నర్సంపేట, జనగామ మినహా
ఇదిలా ఉండగా మొదటి విడతలో మిగిలిపోయిన నర్సంపేట, కొనసాగించాల్సిన జనగామ మినహా రెండో విడత పాదయాత్ర పూర్తి అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాత్ర పూర్తయినట్లు చెప్పవచ్చు.