రాజకీయాల కోసం.. రాష్ట్రంలో సంక్షోభం!

ఉన్నమాట: రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ ఏపీ, తెలంగాణలకు పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఆ గడువు పూర్తి కావడానికి ఇంకో ఏడాదిన్నర సమయం ఉన్నది. ఉద్యమ నాయకత్వం ఐదేళ్లు ఉమ్మడి రాజధాని ఉంటే చాలు పదేళ్లు చాలా ఎక్కువ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించి ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో ఎలాంటి విద్వేషాలకు, వివక్షకు తావు లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా జీవించేలా శాంతిభద్రతల […]

  • By: krs    latest    Dec 04, 2022 6:05 AM IST
రాజకీయాల కోసం.. రాష్ట్రంలో సంక్షోభం!

ఉన్నమాట: రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ ఏపీ, తెలంగాణలకు పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఆ గడువు పూర్తి కావడానికి ఇంకో ఏడాదిన్నర సమయం ఉన్నది. ఉద్యమ నాయకత్వం ఐదేళ్లు ఉమ్మడి రాజధాని ఉంటే చాలు పదేళ్లు చాలా ఎక్కువ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించి ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో ఎలాంటి విద్వేషాలకు, వివక్షకు తావు లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా జీవించేలా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రస్తుత ప్రభుత్వ పాలన ఉన్నది.

అయితే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సెక్షన్‌ 8 లాంటివి తెరమీదికి తెచ్చి హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన కుట్రలను తెలంగాణ సమాజం, ప్రభుత్వం సాగనివ్వలేదు. అంతేకాదు ఇక్కడ ఉన్న సీమాంధ్ర ప్రజానీకం కూడా బాబు వ్యవహారశైలిని తప్పుపట్టారు.

కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఇప్పటికే గంగా జెమునా తెహజీబ్‌ లాంటి తెలంగాణ ప్రాంతంలో అశాంతిని రెచ్చగొట్టే అనేక ప్రయత్నాలు చేసింది. వాటిని కూడా తెలంగాణ ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. ప్రస్తుత ప్రధాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు.

నాడు ఎన్నికల ప్రచార సమయంలోనే తల్లిని చంపి బిడ్డను బతికించారు అని, పార్లమెంటులో తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్‌ చేశారని ఇట్లా అనేక సందర్భాల్లో తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కారు. అంతెందుకు ఇక్కడ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం కొలువుదీరకముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన చరిత్ర మోడీ ప్రభుత్వానిది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు వంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో చట్ట ప్రకారం ప్రభుత్వాలు వ్యవహరించాల్సిందే. ఈ రెండు కేసుల విచారణలు కోర్టుల్లో జరుగుతున్నందున కోర్టు ఆదేశాల మేరకు విచారణ సంస్థలు వాటి పని అవి చేస్తాయి. కానీ రాజకీయంగా ఎన్ని చేసినా తమకు లబ్ది చేకూరడం లేదని కేంద్రం వెనక ఉండి కొన్ని శక్తులను ముందు పెట్టి తెలంగాణలో అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నది.

గవర్నర్‌ చట్టసభలు ఆమోదించిన బిల్లులను తన వద్దే పెట్టుకుని ఎటూ తేల్చకుండా పెట్టుకోవడం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడుతుండటంపై తెలంగాణ ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతంగా రాజ్‌భవన్‌ నుంచి మరో ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అలాగే పాదయాత్రల పేరుతో ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారు. ఈ సమయంలో ఉమ్మడి రాజధానికి కాలం ఇంకో ఏడాదిన్నర ముగియనున్నది, అదే సమయంలో ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ రాజకీయాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో సంక్షోభం సృష్టించే ప్రయత్నాలను ఇక్కడి సమాజం ఎన్నటికీ క్షమించదు.