కరువు పాపం కాంగ్రెస్‌దే: మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి
కరువు పాపం కాంగ్రెస్ ప్రభుత్వందేనని, కేసీఆర్ ఉంటే రాష్ట్రంలో కరువు వచ్చేది కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు

ఎమ్మెల్యేల కొనుగోలుకు గేట్లు తెరవడం కాదు..కాల్వల గేట్లు ఎత్తు
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శలు
విధాత, హైదరాబాద్ : కరువు పాపం కాంగ్రెస్ ప్రభుత్వందేనని, కేసీఆర్ ఉంటే రాష్ట్రంలో కరువు వచ్చేది కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సూర్యాపేటలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతనైతే ఎమ్మెల్యేలను కొనేందుకు గేట్లు తెరవడం కాదని, ఎండుతున్న పంటలకు నీళ్లిచ్చేందుకు సాగర్ , శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్టుల, కాల్వల గేట్లు ఎత్తండని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొనాలనే సోయి తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్‌కు పట్టింపు లేదన్నారు. వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి ముడుపుల పంపే సోయి తప్ప సీఎంకి వేరే యావ లేదన్నారు. ఇక ఎన్ని అబద్దాలు చెప్పినా, ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలుగొడుతారన్నారు. మూడు నెలల్లో విఫలమైన ప్రభుత్వంగా తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందన్నారు. డ్రామాలాడి ప్రభుత్వం నడపడం మానివేసి ఇప్పటికైనా దమ్ముంటే సాగు నీరు ఇవ్వండని, కరువు సమీక్షలు చేయండని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో వెలుగులు పోయి మళ్లీ చీకట్లు వచ్చాయని, కరెంట్ పోయిందని, సాగు తాగు నీరు కరువైందని, పంట పెట్టుబడి లేక తిరోగమన మార్పు వచ్చిందన్నారు. కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపు తోనే తెలంగాణకు కరువు వచ్చిందన్నారు. కుంగిన మెడిగడ్డ పిల్లర్లకు నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి సంబంధం లేదన్నారు. ఇవ్వాళ్టికి కూడా కాళేశ్వరంలో 4 వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉందన్నారు. మీ కర్ణాటక మిత్రులతో మాట్లాడి కృష్ణా నుండి 10 టీఎంసీల నీటిని తెప్పించాలని మరోసారి డిమాండ్ చేశారు. సాగు నీరు లేక రైతుల కంట కన్నీళ్లు కారుతున్నాయనీ అన్నారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను ఓదార్చే నాయకులే లేరని, మంత్రులకు రాజకీయాలు తప్ప రైతుల కష్టలు పట్టడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోని వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలపై సమీక్షలు చేసి రైతుల సాగునీటి కష్టాలు, ప్రజల తాగునీటి గోస తీర్చే చర్యలు చేపట్టాలన్నారు.