కర్ణాటకలో బీజేపీకి షాకిచ్చిన గాలి.. కొత్త పార్టీని ప్రకటించిన మైనింగ్‌ కింగ్‌..!

విధాత,బెంగళూరు: మైనింగ్‌ కింగ్‌గా పేరుపొందిన గాలి జనార్దన్‌రెడ్డి కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి షాక్‌ ఇచ్చారు. సొంత పార్టీని పెడుతున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘కల్యాణ రాజ్యప్రగతి పక్ష’ పార్టీతో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీని ప్రకటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తన జీవితంలో రాజకీయంగా మరో ఎపిసోడ్‌ ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే తాను ఇక్కడ […]

  • By: krs    latest    Dec 25, 2022 12:30 PM IST
కర్ణాటకలో బీజేపీకి షాకిచ్చిన గాలి.. కొత్త పార్టీని ప్రకటించిన మైనింగ్‌ కింగ్‌..!

విధాత,బెంగళూరు: మైనింగ్‌ కింగ్‌గా పేరుపొందిన గాలి జనార్దన్‌రెడ్డి కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి షాక్‌ ఇచ్చారు. సొంత పార్టీని పెడుతున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘కల్యాణ రాజ్యప్రగతి పక్ష’ పార్టీతో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు.

పార్టీని ప్రకటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తన జీవితంలో రాజకీయంగా మరో ఎపిసోడ్‌ ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే తాను ఇక్కడ ఉన్నానన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టి లబ్ధి పొందాలనుకుంటే ఇక్కడ కుదరన్న గాలి జనార్దన్‌రెడ్డి.. కర్ణాటక ప్రజలు ఎప్పుడూ ఐక్యంగా ఉన్నారని, ఉంటారని చెప్పారు.

ఈ సందర్భంగా బీజేపీకి చెందిన మంత్రి శ్రీరాములుతో విభేదాలున్నట్లుగా వస్తున్న వార్తలపైనా స్పందిస్తూ.. బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. మంత్రి శ్రీరాములు తన బాల్య స్నేహితుడని, అతనితో సంబంధాలు కొనసాగుతాయని వివరించారు.

ఇదిలా ఉండగా.. అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలు జీవితం అనుభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ నేతలతో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. మైనింగ్‌ ఆరోపణలపై జైలులో ఉన్న ఆయన 2015లో జైలు నుంచి విడుదలయ్యారు.

బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. పాస్‌పోర్టులను అప్పగించాలని, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఇప్పటికే పలు కేసులు, వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మైనింగ్‌ కింగ్‌ కొత్త పార్టీని ప్రకటించడం కర్ణాటక వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది అధికార పార్టీకి బీజేపీకి మింగుడుపడని విషయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.