గంప, షబ్బీర్ దొందూ దొందే.. వ్యాపారం కోసం రైతులను బలి చేస్తున్నారు: BJP

ఇండస్ట్రీలు తీసుకురాడం దమ్ములేని నేతలు రైతుల పంట భూములను పారిశ్రామిక జోన్ కి మార్చారు రైతులకు మద్దతుగా బీజేపీ నిరసన విధాత, నిజామాబాదు: వ్యాపారంలో భాగస్వాములుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఇద్దరు ఒకటేనని, ఇద్దరూ కలిసి రైతులను నిండుగా ముంచుతున్నారని బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ వల్ల పంట భూములు కోల్పోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ రైతులకు మద్దతుగా […]

గంప, షబ్బీర్ దొందూ దొందే.. వ్యాపారం కోసం రైతులను బలి చేస్తున్నారు: BJP
  • ఇండస్ట్రీలు తీసుకురాడం దమ్ములేని నేతలు
  • రైతుల పంట భూములను పారిశ్రామిక జోన్ కి మార్చారు
  • రైతులకు మద్దతుగా బీజేపీ నిరసన

విధాత, నిజామాబాదు: వ్యాపారంలో భాగస్వాములుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఇద్దరు ఒకటేనని, ఇద్దరూ కలిసి రైతులను నిండుగా ముంచుతున్నారని బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ వల్ల పంట భూములు కోల్పోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ రైతులకు మద్దతుగా శనివారం ధర్నా చేపట్టారు.

రైతుల భూములు కోల్పోయేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ,
ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గంపకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇద్దరు తోడు దొంగలేనన్నారు.

రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్ధి కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందించారన్నారు. మాస్టర్ ప్లాన్ లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ లకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. 400 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసుకోవడానికి రైతుల భూముల నుండి 100 ఫీట్లు రోడ్డు వేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

వ్యాపారం కోసం రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ కిందకి మారుస్తున్నారని, దీనిపై వారు సమాధానం చెప్పాలన్నారు. సర్వే నంబర్ 430 నుంచి 435 వరకు నాయకుల భూములు ఉన్నాయన్నారు. 35 ఏళ్లు రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ లకు ఇందులో వ్యాపార భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.

వీరి రాజకీయ నాటకంలో ప్రజలు బలవుతున్నారని ఆరోపించారు. కొత్త మాస్టర్ ప్లాన్ లో డబ్బులు సంపాదించు కునేందుకు దిగజారిపోయారని విమర్శించారు. రైతులకు చెందిన అత్యంత ఖరీదైన భూములను రియల్ వ్యాపారం కోసం ఇండస్ట్రియల్ జోన్ గా మార్చడం దారుణమన్నారు.

గంప గోవర్ధన్ కు దమ్ము ధైర్యం ఉంటే సెజ్ తీసుకురావాలని, భూసేకరణ చేపట్టి రైతులకు పరిహారం అందించిన తర్వాత పారిశ్రామిక వ్యాపార వేత్తలకు భూములు అమ్మాలన్నారు. ఇప్పటికే ఎంఎస్ఎన్ కంపెనీలో గంప అనుచరుడే లేబర్ కాంట్రాక్ట్ గా ఉన్నారని, ప్రతినెలా కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఇంత డబ్బు సంపాదించుకుని ఏం చేసుకుంటావ్ అని నిలదీశారు. ఇప్పటికే కళాశాల కోసం 263 ఎకరాలు 40 సంవత్సరాల క్రితం 10 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ కి ఇస్తే ఇంత వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయని ఎమ్మెల్యే ఇప్పుడు 1200 ఏకరాల్లో ఏం తెస్తారని ప్రశ్నించారు.

ఒక్క ఇండస్ట్రీ తీసుకురాని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ పేరుతో వ్యాపార భాగస్వామ్యం పొందారన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఇందులో సంబంధం లేకపోతే స్పందించాలన్నారు. నిన్నటి కార్యక్రమంలో షబ్బీర్ అలీకి అక్కడ భూమి లేదని, ఉన్న భూమి అమ్ముకున్నారని, మాస్టర్ ప్లాన్ తో షబ్బీర్ అలీకి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసిన విషయంపై రమణారెడ్డి స్పందించారు.

ఆ భూములు ఇప్పటికి షబ్బీర్ అలీ పేరుపైనే ఉన్నాయన్నారు. అక్కడ ఉన్న భూమి షబ్బీర్ అలీ అమ్మినప్పుడు పక్కనే ఉన్న 180 ఎకరాలు బడా నాయకులు తీసుకుంటే ఎందుకు తీసుకున్నారోనన్న అనుమానం రాకపోవడం శోచనీయమన్నారు. మంత్రిగా పని చేసిన వ్యక్తికి కనీస అవగాహన లేకపోవడం దారుణమన్నారు. మాస్టర్ ప్లాన్ విషయం ముందే తెలిసి తనకున్న భూమిని అమ్ముకుని నాయకులు కొనుగోలు చేసిన భూమిలో వాటా తీసుకున్నారని ఆరోపించారు.

మాస్టర్ ప్లాన్ విషయం తెలిసే అమ్మితే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 49 మంది కౌన్సిలర్లు, నలుగురు కో అప్షన్ సభ్యులు తీర్మానం చేసారని మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారని, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు రైతుల పక్షాన నిలబడకపోతే బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.