మ‌రో 100 వెబ్‌సైట్ల‌పై నిషేధం

దేశంలో మ‌రో వంద వెబ్‌సైట్ల‌ను కేంద్ర ఐటీశాఖ బ్లాక్ చేసింది. వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, టాస్క్ ఆధారిత పార్ట్‌టైమ్ జాబ్ మోసాల‌కు కేంద్రంగా ఉన్న 100 వెబ్‌సైట్ల‌ను నిషేధించాల‌న్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు ఐటీశాఖ ఈ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

మ‌రో 100 వెబ్‌సైట్ల‌పై నిషేధం
  • వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు,
  • ఉద్యోగ మోసాలపై కేంద్ర ఐటీశాఖ కొర‌డా



విధాత‌: దేశంలో మ‌రో వంద వెబ్‌సైట్ల‌ను కేంద్ర ఐటీశాఖ బ్లాక్ చేసింది. వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, టాస్క్ ఆధారిత పార్ట్‌టైమ్ జాబ్ మోసాల‌కు కేంద్రంగా ఉన్న 100 వెబ్‌సైట్ల‌ను నిషేధించాల‌న్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు ఐటీశాఖ ఈ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 కింద ఆ వెబ్‌సైట్ల‌ను బ్లాక్ చేసినట్టు బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపింది.


ఆర్థిక నేరాలకు సంబంధించి వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడిని సులభతరం చేసే ఈ వెబ్‌సైట్లు విదేశీ వ్య‌క్తుల‌ ఆధ్వ‌ర్యంలో నిర్వహిస్తున్న‌ట్టు త‌మ ద‌ర్యాప్తులో తేలిన‌ట్టు వెల్ల‌డించింది. కార్డ్ నెట్‌వర్క్, క్రిప్టోకరెన్సీ, అంతర్జాతీయ ఫిన్‌టెక్ కంపెనీలను ఉపయోగించి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్, అనధికార లోన్‌యాప్‌ల‌తో చైనాసహా విదేశీ సంస్థలచే నిర్వహించబడే 232 యాప్‌లను కూడా ఐటీశాఖ నిషేధించింది.