Warangal: కనువిప్పులేని కాంగ్రెస్​.. గ్రూపు తగాదాలతో కేడర్‌లో నిరుత్సాహం!

రాహుల్ వచ్చినా మారని తీరు వరంగల్​ సభ ఊపును నీరుగార్చిన నేతలు విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: రెండు పర్యాయాలు కేంద్రంలో, రాష్ట్రంలో జనం కర్రుకాల్చి వాతపెట్టినట్లు అధికారానికి దూరం చేసినా కాంగ్రెస్​ నాయకులకు కనీస కనువిప్పు కలగడంలేదు. కథ మళ్ళీ మొదటికొచ్చినట్లు షరామాములు గ్రూపులు, ఆధిపత్యాలు, తన్నులాటలతో కాలం వెల్లదీస్తున్నారు తప్ప ప్రజలకు అండగా నిలవాలనే కనీస చిత్తశుద్ధి కన్పించడంలేదు. పేరుకు పెద్దగా ఉన్న లీడర్లే బజార్లోపడ్డట్లు తన్నులాటలతో పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు. […]

Warangal: కనువిప్పులేని కాంగ్రెస్​.. గ్రూపు తగాదాలతో కేడర్‌లో నిరుత్సాహం!
  • రాహుల్ వచ్చినా మారని తీరు
  • వరంగల్​ సభ ఊపును నీరుగార్చిన నేతలు

విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: రెండు పర్యాయాలు కేంద్రంలో, రాష్ట్రంలో జనం కర్రుకాల్చి వాతపెట్టినట్లు అధికారానికి దూరం చేసినా కాంగ్రెస్​ నాయకులకు కనీస కనువిప్పు కలగడంలేదు. కథ మళ్ళీ మొదటికొచ్చినట్లు షరామాములు గ్రూపులు, ఆధిపత్యాలు, తన్నులాటలతో కాలం వెల్లదీస్తున్నారు తప్ప ప్రజలకు అండగా నిలవాలనే కనీస చిత్తశుద్ధి కన్పించడంలేదు.

పేరుకు పెద్దగా ఉన్న లీడర్లే బజార్లోపడ్డట్లు తన్నులాటలతో పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు. వ్యక్తి ఆధిపత్యం ముందు పార్టీ ప్రతిష్ట గల్లంతైనా ఫర్వాలేదనే తీరులో ముఖ్యనాయకులు వ్యవహరిస్తున్నారు. ఎవరికివారు యమునా తీరు అన్నట్లు ముఖ్యనాయకులే తమ తమ ఆధిపత్యాలు, పట్టు కోసం తన్నుకు చస్తున్నారు.

ఈ ప్రభావంలో పార్టీని నమ్ముకున్న రెండవ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారు. అనుచరులుగా మారిన కొందరు నాయకుల చేతుల్లో పావులుగా మారి గ్రూపు తగదాల్లో నిండా మునిగిపోయి పార్టీ పడవను ముంచుతున్నారు.

రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇదే తంతు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నుంచి డి ఎస్ రెడ్యా నాయక్, నర్సంపేట నుంచి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి విజయం సాధించారు. ఇందులో డి ఎస్ రెడ్యా నాయక్ టిఆర్ఎస్ లో చేరగా, మాధవరెడ్డి కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగారు.

2018 ఎన్నికల్లో భూపాల్ పల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు నుంచి సీతక్క ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే గండ్ర టిఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. తిరిగి సీతక్క ఒక్కరే ఉమ్మడి జిల్లా ప్రతినిధిగా మిగిలారు. ఇంత జరిగినా పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో గాని, జిల్లా నాయకుల్లో గాని పెద్దగా స్పందన లేకపోవడం విశేషం.

ఎనిమిది ఏళ్లుగా ఏ ఎన్నికలలో విజయం సాధించనప్పటికీ ప్రజలు ఇంకా కాంగ్రెస్ పట్ల సానుకూలతను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎన్నికల్లో నిండా మునిగినా నాయకుల్లో సఖ్యత కొరవడిందని విమర్శిస్తున్నారు. ప్రజల పట్ల అంకితభావం కంటే పదవులు, ఆధిపత్యమే వీరికి ముఖ్యమయ్యాయని విమర్శిస్తున్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమై ప్రజల్లో నిరసన పెల్లుబుకుతున్న ప్రతీ సందర్భంలో కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు రచ్చకెక్కడం ఇటీవల అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర కాంగ్రెస్‌ల్‌లో నెలకొన్న సంక్షోభం జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తుంది. ఒకవైపు పార్టీ నేత రాహుల్ గాంధీ జోడో పేరుతో యాత్ర నిర్వహిస్తుండగా రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపులు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని కనపరుస్తున్నాయి.

అధిష్టానమైన వీలైనంత తొందరగా పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. అధిష్టానం దూతగా వచ్చిన దిగ్విజయ సింగ్ తన పని త్వరగా పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

వరంగల్​ సభ ఊపును నీరుగార్చిన నేతలు

చాలా కాలం తర్వాత వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు పార్టీ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతాంగ సమస్యలపై పార్టీ తమ విధివిధానాలను ప్రకటించడం సానుకూల పరిణామంగా మారింది. స్థానిక నాయకులు, పిసిసి నాయకత్వం ఊహించిన దాని కంటే కూడా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు.

ఒక విధంగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ప్రజలు దీన్ని ఒక అవకాశం గా వినియోగించుకున్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన లభించినప్పటికీ తర్వాత కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడా ఈ సభకు సంబంధించిన ఊపు, ఉత్తేజం పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో పాదుకొల్పేందుకు కనీస ప్రయత్నం చేయకుండా మీడియా ముందు పెద్దపులి డైలాగ్​లు వల్లెవేస్తున్నారు. జనంలో స్పందన కలిగినప్పటికీ నాయకులు ఉపన్యాసాలిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు పెంపొందించుకోవాలనే విషయాన్ని విస్మరించారు.

పరస్పర దూషణలతో విమర్శలు

నేతల పరస్పర ఆరోపణలు, దూషణలను చూస్తూ వరంగల్​తోపాటు వివిధ జిల్లాల కాంగ్రెస్​ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్​ నాయకులకు కనీస కనువిప్పులేకపోవడం పట్ల సిగ్గుపడుతున్నారు. పైగా రైతు సంఘర్షణ సభ నిర్వహించినప్పటికీ సభకు పేరు పెట్టడం తప్ప ఇప్పటికీ కనీసం ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలోనూ, ఇతర జిల్లాల్లో సైతం రైతుల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై ప్రచారం చేయలేదు.

అంతేకాదు వారిని సమీకరించే ప్రయత్నం చేయకుండా నేతలు కాలు కదపకుండా కదనరంగంలో యుద్ధం చేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. రైతుల సమస్యలపై వారిని సమీకరించేందుకు రైతులు సమస్యలను అడ్రస్​ చేసేందుకు ప్రయత్నించకుండా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు తాపత్రయపడుతున్నారు.

మున్నాళ్ళ ముచ్చటగా ఐక్యత

కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్​ నేతలంతా ఢిల్లీ వేదికగా ఐక్యతారాగం తీశారు. అబ్బా కాంగ్రెస్​లో ఎంతమార్పు వచ్చిందని అందరూ అనుకునే లోపు అంతర్గతంగా ఉన్న గ్రూపులు భగ్గుమంటున్నాయి. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, సీనియర్​ నేత జానారెడ్డి, మాసీ పీపీసీ చీఫ్​ ఉత్తమ్​, ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, హన్మంతరావు, పొన్నాల ఒక్కరేంది అంతా ఒకే రాగం తీసి ఆరున్నొక్క శృతిలో తామంతా ఒక్కటే అంటూ అధిష్టానం సమక్షంలో అలాయ్​ భలాయ్​లు తీసుకుని ఐక్యతను ప్రదర్శించారు.

కానీ ఈ ఐక్యత అనుకున్నంత కాలం కూడా లేకపోవడం గమనార్హం. అప్పుడే పార్టీలో గ్రూపులు మళ్ళీ పెచ్చరిల్లుతున్నాయి. పరస్పరం బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ వీధి గొడవలకు దిగుతున్నారు.

కొండాతో షురూ

కొత్త కమిటీలపై వరంగల్లో మాజీ మంత్రి కొండ సురేఖ రాజీనామా లేఖతో ప్రారంభమైన పరిణామాలు పీసీసీని రెండుగా చీల్చాయి. రాష్ట్రంలో అనేక పర్యాయాలు, అధికార పదవులను, పార్టీ పదవులను అనుభవించిన నాయకులు పార్టీకి రాష్ట్రంలో ఎదురైన సమస్యను పట్టించుకోకుండా తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.

కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మిన్నకుండి కమిటీలు ప్రకటించిన తర్వాత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈ సీనియర్లంతా నిత్యం అధిష్టానంతో అంటకాగేవారు కావడం గమనార్హం.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం

అధికార పార్టీలైన బీఆర్​ఎస్​, బీజేపీలను ఇరుకున పెట్టాల్సిన కాంగ్రెస్​ పార్టీ గ్రూపు తగదాలతో పలుచనవుతూ తామే ఇరుకున పడుతున్నారు. ఇదే అదునుగా జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులు తమవైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం కాంగ్రెస్ నాయకుల్లో విభేదాలు తీవ్రంగానే ఉన్నాయి. ఆరు జిల్లాలు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాల్ పల్లి ఉండగా మూడు జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకం మాత్రమే జరిగింది. మిగిలిన మూడు జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలతో పీటముడి పడింది.

ఇదిలా ఉండగా అధికార పదవులన్నీ అనుభవించిన కాంగ్రెస్​ నాయకుల్లో మార్పు రావడంలేదని, పార్టీని నమ్ముకున్న కేడర్​ను బలిపశువులను చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్​ పార్టీకి కనువిప్పు కలగకపోతే ఆ పార్టీని బొందపెట్టే ప్రమాదముందని ఆందోళ‌న చెందుతున్నారు.