ఈనెల 15నుంచే ఒంటిపూట బడులు
తెలంగాణలో వేసవి ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట(హాఫ్ డే స్కూల్స్) తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది

ఎండల తీవ్రతతో ప్రభుత్వ నిర్ణయం
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో వేసవి ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట(హాఫ్ డే స్కూల్స్) తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి నెల ప్రారంభంతోనే ఎండలు ముదరడంతో పిల్లల సంక్షేమం నేపథ్యంలో ఈ నెల 15 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన సమయ వేళలను కూడా విడుదల చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బోధన.. ఆ తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగా, పదవ తరగతి పరీక్షలు మార్చి 18నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాలలో తాగునీటి వసతుల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పరీక్షల నిర్వాహణ అధికారులకు ప్రభుత్వం సూచించింది.