ఏపీలో ఛీత్కారానికి గురైన బాబు.. తెలంగాణను అభివృద్ధి చేస్తాడా?: హరీశ్‌రావు

విధాత‌, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఛీత్కారానికి గురైన చంద్రబాబు.. తెలంగాణను అభివృద్ధి చేస్తా అంటున్నడని.. ఎనుకట ఏమో చేసిన దాన్ని ఉద్దరిస్తా అంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్‌ఎల్పీలో గురువారం మంత్రులు అజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఖమ్మంలో చంద్రబాబు చేసిన షోను చూస్తుంటే ‘కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయితీస్తాడట’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అభివృద్ధి చేయలేక అక్కడి […]

ఏపీలో ఛీత్కారానికి గురైన బాబు.. తెలంగాణను అభివృద్ధి చేస్తాడా?: హరీశ్‌రావు

విధాత‌, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఛీత్కారానికి గురైన చంద్రబాబు.. తెలంగాణను అభివృద్ధి చేస్తా అంటున్నడని.. ఎనుకట ఏమో చేసిన దాన్ని ఉద్దరిస్తా అంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్‌ఎల్పీలో గురువారం మంత్రులు అజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఖమ్మంలో చంద్రబాబు చేసిన షోను చూస్తుంటే ‘కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయితీస్తాడట’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో ఛీత్కారానికి గురై ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తా అని అంటున్నాడ‌ని విమ‌ర్శించారు.

ఎనుకట ఏమో చేసిన దాన్ని ఉద్దరిస్తా అని బాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాటలు ‘సచ్చిపోయిన బర్రెనట.. పలిగిపోయిన బుర్రెడు పాలిచ్చిందట’ అన్నట్లుగా ఉన్నాయన్నారు. ఏపీ ప్రజలే పాలన బాగాలేదని చిత్తు చిత్తుగా ఓడించి వెళ్లగొడితే.. ఇక్కడికి వచ్చి ఏం చేస్తా అని మట్లాడుతున్నార న్నారు.

నక్సలైట్ల పేరుతో కాల్చి చంపిన చరిత్ర బాబుది

ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలోనేనని హరీశ్‌రావు ఆరోపించారు. యువత, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, అన్నివర్గాలను, ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తారు.

నాటి యువత మాకు ఉద్యోగాలు కావాలి, మా పల్లెలు అభివృద్ధి కావాలని అడిగితే వారిని నక్సలైట్ల పేరుతో కాల్చి చంపిన చరిత్ర బాబుదని, తెలంగాణ సమాజం, యువత దాన్ని మరిచిపోలేదన్నారు. ఉద్యోగులను గుర్రాలతో తొక్కించి.. వాటర్‌ కెనాన్లతో విద్యార్థులు, యువతను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారన్నారు.

ఫ్రీజోన్‌ పేరిట హైదరాబాద్‌ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిన‌ వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన ఇవాళ నేను ఏదో ఉద్ధరించాన‌ని చెబుతున్నారని, ఆయన విషయంలో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉందన్నారు. చంద్రబాబు స్టయిల్‌ ఎలా ఉంటదంటే ఇవాళ తెల్లారుతుందం టే నా వల్లనే.. కోడి కూస్తున్నదంటే నా వల్లనే అని చెబుతారని ధ్వజమెత్తారు.

బాబు పాలనలోనే అత్యధిక ఆత్మహత్యలు

నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను పారద్రోలింది తానేనని చంద్రబాబు అంటున్నాడని, ఇంతకన్నా పెద్ద జోక్‌ ఉందా? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్‌ కష్టాలను తీర్చింది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని, ఫ్లోరోసిస్‌ పేరు మీద మీరంతా ఓట్లు దండుకొని.. ఆ ప్రాంత ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

నల్లగొండ ప్రజలకు ఫ్లోరైడ్‌ నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించింది సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ఈ విషయం జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. రైతుల కోసం ఎన్నో చేశామని చంద్రబాబు చెప్పారని, ఆయన హయాంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు.

బాబు పాలనలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రైతులు ఉచిత కరెంటు ఇవ్వమని హైదరాబాద్‌ వస్తే బషీర్‌భాగ్‌లో పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర చందబాబుదన్నారు. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యంకాదని, తీగలపై బట్టలు ఎండేసుకోవాలని అవహేళన చేశారని.. ఇవాళ ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

రైతులకు కేసీఆర్‌ చేసినంత ఎవరూ చేయలేదని, రూ.52వేల కోట్లు రైతుబంధు సాయం అందజేశామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా ఇచ్చారని, నీటి తీరువా బకాయిలు రద్దు చేసిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు.

బాబువన్నీ వట్టి మాటలే..

చంద్రబాబు హయాంలో చెరువులు, తూములు, అలుగులను ఆగం చేస్తే.. మిషన్‌ కాకతీయ కింద అభివృద్ధి చేసి 25లక్షల ఎకరాలకు నీరిచ్చింది సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. కల్వకుర్తికి చంద్రబాబు కొబ్బరికాయలు కొట్ట.. వైఎస్సార్‌ మొక్కలు పెట్ట.. రాజశేఖర్‌రెడ్డి కొబ్బరికాయలు కొట్ట.. బాబు మొక్కలు పెట్టా.. ఇలా ఇద్దరు కలిసి మహబూబ్‌నగర్‌ను ఆగం పట్టిస్తే.. కల్వకుర్తిని పూర్తి చేసి మహబూబ్‌నగర్‌లో ఇవాళ లక్షల ఎకరాలకు నీరిచ్చింది కేసీఆర్‌ అన్నారు.

చంద్రబాబు వన్నీ మాటలే.. తెలంగాణ ప్రభుత్వం చేతల ప్రభుత్వమన్నారు. ప్రజలను మోసం, మభ్య పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. 2004లో ఓడిపోయిన తర్వాత రైతులకు అన్యాయం చేశామని, రైతులను నిర్లక్ష్యం చేసిన తర్వాతనే ఓడిపోయామని చంద్రబాబు చెంపలు వేసుకున్నారని గుర్తు చేశారు.

వ్యవసాయం దండగా.. ఐటీ ముద్దు అనేది బాబు నినాదమని.. అది వట్టి నినాదమే తప్ప చేసిందేమీ లేదన్నారు. వ్య‌వసాయాన్ని ఇవాళ పండుగ చేసింది కేసీఆరేనని.. రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఆయన పాలనలో చేదు జ్ఞాపకాలను తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదని హరీశ్‌రావు అన్నారు.

2018 మహాకూటమితో కుట్రకు ప్రయత్నించారని, కానీ, తెలంగాణ ప్రజలు ఏకమై కుట్రలను చిత్తు చేశారన్నారు. ఇవాళ ఆయన కుట్ర ఏంటో అందరికీ తెలుసునని, బీజేపీతో ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవాలని ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పోత్తు కోసమే ఆంధ్రా బార్డర్‌లో ఉన్న ఖమ్మంలో మీటింగ్‌ పెట్టారని, తమకేం భయం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

చంద్రబాబుతో ఎవరైనా పెట్టుకుంటే అది భస్మాసుర హస్తమేనన్నారు. కేవలం బీజేపీతో పొత్తు కోసమే ఇంత‌ డ్రామాలు ఆడుతున్న విషయం అందరికీ అర్థమైందన్నారు. బాబు ఆంధ్రాలో పని చేసుకుంటే నాలుగు ఓట్లు పడుతయ్‌ తప్పా.. తెలంగాణలో ఎన్ని డ్రామాలు చేసినా ఒరిగేదేమి లేదు, జరిగేది ఏమీ లేదన్నారు. ఏపీలో చెల్లని రూపాయి చంద్రబాబు అని, తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు..

ఎన్టీఆర్‌ గురించి చంద్రబాబు మాట్లాడడం అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పద్ధతని విమర్శించారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్‌ పెట్టిన తెలుగుదేశం పార్టీ కాదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను ఏం చేశారో తెలుగు ప్రజలకు తెలియదా? అన్నారు.

ఎన్టీఆర్‌ ఓ విలక్షణమైన నేత అని, ఆయన సంస్కరణల గురించి సీఎం కేసీఆర్‌ కూడా అసెంబ్లీలో చెప్పారన్నారు. కానీ, ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. తెలంగాణ ప్రజలు బాబును నమ్మే పరిస్థితి లేదని, బాబు రంగులు ఎలా మారుస్తాడో అందరికీ తెలుసునన్నారు. కరోనా వ్యాక్సిన్‌ నా వల్లనే వచ్చిందని చెబుతున్నారని.. ఇంతకన్నా పెద్ద జోక్‌ లేదన్నారు.

మరో పార్టీ నేతలు నరేంద్ర మోదీ వల్లే వచ్చిందుంటున్నారన్నారు. కనిపెట్టిన సైంటిస్టులు.. కంపెనీ ఎటు పోయిందన్నారు. నా వ‌ళ్లనే అంటే నా వ‌ళ్లనే వచ్చిందని చంద్రబాబు, బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారని.. వాళ్లను ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇవాళ తెలంగాణ అన్నిరంగాల్లో దిక్సూచిగా మారిందని, తెలంగాణ పథకాలు మోడల్‌గా నిలిచాయని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.