ఇంటి నిర్మాణానికి ఏది మంచి భూమో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇల్లు కట్టుకోవడం అనేది కొంత మందికి జీవితకాల స్వప్నంగా ఉంటుంది. ఇంటి నిర్మాణం అనగానే భూమి కొనడం నుంచి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో కలలు, ఆశలు ఇంటి చుట్టూరా ఉంటూ ఉంటాయి. అలాంటి ఇంటి నిర్మాణం చెయ్యాలనుకున్నపుడు ఎలాంటి నేలను ఎంచుకోవాలనే విషయాలను మన వాస్తు శాస్త్రం చాలా చక్కగా వివరించింది. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం. భూమిని ముందుగా పరీక్షించుకోకుండా ఇంటి నిర్మాణం చెపట్టడం అంత మంచిది కాదు. భూమి అన్ని చోట్ల […]

ఇల్లు కట్టుకోవడం అనేది కొంత మందికి జీవితకాల స్వప్నంగా ఉంటుంది. ఇంటి నిర్మాణం అనగానే భూమి కొనడం నుంచి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో కలలు, ఆశలు ఇంటి చుట్టూరా ఉంటూ ఉంటాయి. అలాంటి ఇంటి నిర్మాణం చెయ్యాలనుకున్నపుడు ఎలాంటి నేలను ఎంచుకోవాలనే విషయాలను మన వాస్తు శాస్త్రం చాలా చక్కగా వివరించింది. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం.
భూమిని ముందుగా పరీక్షించుకోకుండా ఇంటి నిర్మాణం చెపట్టడం అంత మంచిది కాదు. భూమి అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని నేలలు చవిటిగానూ, కొన్ని ఊట భూములుగా కొన్ని రాతి నేలలుగా ఉంటాయి. అందుకే ముందు భూలక్షణాలు పరీక్షించుకోవాలి. ఇలా భూపరీక్ష చెయ్యకుండా నిర్మాణం మొదలు పెట్ట కూడదని వాస్తు చెబుతోంది.
ఎలాంటి పరీక్ష అవసరం?
ఇల్లు కట్టటానికి ఎంచుకున్న స్థలంలో ముందుగా రెండు ఫీట్ల వరకు గొయ్యి తవ్వాలి. సూర్యాస్తమయం తర్వాత అందులో నిండుగా నీళ్లు పోసి ఉంచాలి. ఉదయం చూసినపుడు అందులో కాస్త నీళ్లు మిగిలి ఉంటే అది చాలా ఉత్తమమైన నేల అని అర్థం. ఇక్కడ అనుమానం లేకుండా ఇంటినిర్మాణం చేసుకోవచ్చు.
కొన్ని సార్లు నీళ్లు మిగిలి ఉండకపోవచ్చు బురదగా మాత్రమే ఉండొచ్చు. ఈ నేలను మధ్యస్తంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఇంటినిర్మాణానికి మంచిదే. కొన్ని నేలల్లో ఎంత మాత్రమూ తడి లేకుండా నీళ్లన్నీ కూడా ఇంకి పోతాయి. ఇలాంటి నేల ఇంటి నిర్మాణానికి పనికి రాదని గుర్తించాలి. నీళ్ల ఎక్కడ పడతాయనేది తెసుకోవడానికి కూడా ఈ పద్ధతిని పాటించవచ్చు.
ఇంకో పద్ధతిలో కూడా స్థల పరీక్ష చేసుకోవచ్చు
ముందు చెప్పినట్టుగానే రెండు ఫీట్ల లోతుతో గొయ్యి తీసి అలా తీసినపుడు వచ్చిన మట్టితోనే తిరిగి ఆగొయ్యిని పూడ్చెయ్యాలి. అలా పూడ్చినపుడు కాస్త మట్టి మిగిలిపోతే అది ఉత్తమమైన స్థలం. అదే మట్టి పూడ్చేందుకు సరిపోతే మధ్యస్థమైంది. మట్టి తక్కువైతే మాత్రం అది నిర్మాణానికి పనికి రాదని గ్రహించాలి.
ఇలాంటి భూమి వదిలెయ్యాలి
గొయ్యి తీస్తున్నపుడు పురుగులు, కప్పలు, కీటకాలు, ఊక, ఎముకలు, భస్మము వంటివి కనిపించకూడదు. బొగ్గులు, కాలిపోయిన కర్రలు, గవ్వల వంటివి కూడా కనిపించకూడదు. ఇక్కడ నిర్మించే ఇంటిలో ఉండే వారికి అనారోగ్యాలు కలగొచ్చు, దారిద్ర్యం వెంటాడ వచ్చు. అయితే ఎముకలు ఆరడుగుల కంటే లోపల దొరికొతే పెద్దగా కీడు లేదని కూడా శాస్త్రం చెబుతోంది.