పార్టీ పటిష్టతకు దూరం.. రేవంత్ పైకి మాత్రం ఏకం

ఈ ఐక్యత అప్పుడు చూపి ఉంటే.. ఈ పరిస్థితి వ‌చ్చేదా? విధాత‌: కాంగ్రెస్‌ పార్టీలో కమిటీలు చిచ్చు రేపింది. సీనియర్‌ నేతలందరూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. వలస వచ్చిన వారికే పెద్ద పీట వేశారు. అసలైన కాంగ్రెస్‌ నేతలను విస్మరించారు అని వారి విమర్శలు. ఇక్కడ ఒక విషయాన్ని వారు మరిచిపోతున్నారు. వీళ్లందరి టార్గెట్‌ రేవంత్‌రెడ్డి అని స్పష్టమైంది. అయితే ఇవాళ వీళ్లంతా వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు అని ఆరోపిస్తూ.. రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు. […]

పార్టీ పటిష్టతకు దూరం.. రేవంత్ పైకి మాత్రం ఏకం

ఈ ఐక్యత అప్పుడు చూపి ఉంటే.. ఈ పరిస్థితి వ‌చ్చేదా?

విధాత‌: కాంగ్రెస్‌ పార్టీలో కమిటీలు చిచ్చు రేపింది. సీనియర్‌ నేతలందరూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. వలస వచ్చిన వారికే పెద్ద పీట వేశారు. అసలైన కాంగ్రెస్‌ నేతలను విస్మరించారు అని వారి విమర్శలు. ఇక్కడ ఒక విషయాన్ని వారు మరిచిపోతున్నారు. వీళ్లందరి టార్గెట్‌ రేవంత్‌రెడ్డి అని స్పష్టమైంది.

అయితే ఇవాళ వీళ్లంతా వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు అని ఆరోపిస్తూ.. రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు. ఎన్నడూ ఏకాభిప్రాయానికి రాని వీళ్లు రేవంత్‌ విషయానికి వచ్చేసరికి ఒక్క తాటిపైకి వచ్చారంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం సరైన నిర్ణయమే తీసుకున్నదని సగటు కాంగ్రెస్‌ కార్యకర్తల అభిప్రాయం.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని కాదని టీఆర్‌ఎస్‌ కు రెండుసార్లు ప్రజలు అవకాశం కల్పించారంటే ఈ నేతల మధ్య అనైక్యతే అందుకు కారణమని వారి వాదన. అంతేకాదు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు వీళ్లంతా ఐక్యంగా అడ్డుకుని ఉంటే అది జరిగేదా? అంటున్నారు.

2018 తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క హుజురాబాద్‌ మినహా దుబ్బాక, నాగార్జునసాగర్‌, మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వాదిస్తున్న వారంతా కలిసికట్టుగా పోరాడి ఉంటే గెలవకున్నా గౌరవప్రదమైన ఓటమి అయినా దక్కేది కదా!

అంతెందుకు నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. అక్కడ జరిగిన మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. నేతలు పార్టీ మారినా కాంగ్రెస్‌ కార్యకర్తలు మారలేదు. ఫలితంగానే దాదాపు 25 వేల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే నేతల మధ్య విభేదాలు ఉండొచ్చు. పార్టీ ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ఆ పని చేసింది. కానీ ఆ బాధ్యతలను ఇప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్న వాళ్లు సరిగ్గా నిర్వహించారా? ఒకవేళ వాళ్లు ఆ పనిచేసి ఉంటే దుబ్బాక, మునుగోడులో పార్టీ మూడో స్థానంలో ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు.

రేవంత్‌పై వ్యతిరేకత ఉంటే పార్టీ అంతర్గత సమావేశంలో తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఆయన నేతలందరినీ కలుపుకుని పోవాలని కోరవచ్చు. ఆయనతో సమస్య ఉంటే పరిష్కరించుకుని సర్దుబాటు కోసం ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇవేవీ వాళ్లు చేయలేదు. కానీ ఇప్పుడు మాకు ప్రాధాన్యం ఇవ్వలేదు. వలస నేతలకు పెద్దపీట వేశారు అనడంలో అర్థం లేదంటున్నారు.