Congress | ఇంకా అంతఃకలహాలు.. ఈగోలు.. తీరు మార్చుకోని కాంగ్రెస్‌!

ఆర్భాటపు ప్రకటనలే.. క్షేత్రస్థాయిలో తిరగని నేతలు ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం ఎవరికి టికెట్‌ ఇస్తారో తెలియనప్పుడు ముందే ఎలా తిరుగుతాం? ఇప్పుడే కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం దండగంటున్న కొందరు నేతలు Congress । వందేళ్ల కాంగ్రెస్‌ కష్టకాలంలో కూడా తీరు మార్చుకోవడం లేదా? అధికారం కోసం కలలు కంటున్న కాంగ్రెస్‌ నేతలు.. ఆ కలలు నెరవేరాలంటే చేయాల్సిన కృషిలో ఇంకా వెనుకబడే ఉన్నారా? సమిష్టి ప్రయోజనాలకంటే వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అంటే అవుననే […]

Congress | ఇంకా అంతఃకలహాలు.. ఈగోలు.. తీరు మార్చుకోని కాంగ్రెస్‌!
  • ఆర్భాటపు ప్రకటనలే.. క్షేత్రస్థాయిలో తిరగని నేతలు
  • ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం
  • ఎవరికి టికెట్‌ ఇస్తారో తెలియనప్పుడు ముందే ఎలా తిరుగుతాం?
  • ఇప్పుడే కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం దండగంటున్న కొందరు నేతలు

Congress । వందేళ్ల కాంగ్రెస్‌ కష్టకాలంలో కూడా తీరు మార్చుకోవడం లేదా? అధికారం కోసం కలలు కంటున్న కాంగ్రెస్‌ నేతలు.. ఆ కలలు నెరవేరాలంటే చేయాల్సిన కృషిలో ఇంకా వెనుకబడే ఉన్నారా? సమిష్టి ప్రయోజనాలకంటే వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

హైదరాబాద్‌, విధాత: దాదాపు దశాబ్దకాలం నుంచీ అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను ఇప్పటికీ అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో పార్టీ ఉన్నా.. కార్యాచరణ మాత్రం ఆ దిశగా ఉండటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్గత సమస్యలు, అంతః కలహాల నుంచి ఆ పార్టీ బయటపడటం ఒక పట్టాన అయ్యేట్టు కనిపించడం లేదని అంటున్నారు. ఇప్పటికీ సమిష్టి నాయకత్వం అన్న సోయి ఏ కోశానా కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఎవరికి వారే తామే సీనియర్లమంటే.. వారికి మించిన సీనియర్లు మేమేనంటూ పోటాపోటీ స్టేట్‌మెంట్లు ఇచ్చుకోవడం, ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకోవడంలోనే మొత్తం సమయం అంతా గడిచిపోతున్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడిగా సాధించాల్సిన లక్ష్యం పక్కకు పోయే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతల ఇగోలకు పోయి.. పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని వాపోతున్నారు.

జాతీయ నాయకత్వం కేంద్రంలో మోదీ సర్కారుపై ఢీ అంటే ఢీ అనే పద్ధతుల్లో ఎదుర్కొంటున్నది. అక్కడి అవసరాల రీత్యా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు కృషి చేస్తున్నది. కానీ.. రాష్ట్రంలో మాత్రం అంతటి సీరియస్‌నెస్‌ ఉన్నట్టు కనిపించడం లేదని పార్టీలోని కొందరు నాయకులే అంటున్నారు. రాష్ట్ర నాయకత్వమే ఇలా ఉంటే.. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.

ఇంకా తెగని సీనియర్‌-జూనియర్‌ లొల్లి

రాష్ట్ర‌ స్థాయి నేతల్లో సీనియర్లు, జూనియర్లు అనే తగాదా ఇప్పటికీ కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంపై కొంత మంది సందర్భం వచ్చినప్పుడల్లా తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈ నెల 21 వ తేదీన నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మొదటగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

దీనిపై స్థానిక ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఏఐసీసీ రంగంలోకి దిగి, ఇద్దరితో మాట్లాడి సయోధ్య కుదిర్చిన తరువాత ఈ నెల28వ తేదీన నిరుద్యోగ నిరసన దీక్షను నిర్వహిస్తున్నట్లు తిరిగి వెల్లడించారు. ముందుగానే ఈ విషయాన్ని ఉమ్మడిగా చర్చించుకొని ఒక తేదీని నిర్ణయిస్తే ఈ విషయం రచ్చకెక్కేది కాదన్న అభిప్రాయాలు పార్టీలో వెలువడుతున్నాయి.

తాజాగా ఖమ్మం నిరుద్యోగ నిరసన కార్యక్రమం విషయంలో కూడా రచ్చ మొదలైంది. 24న ఖమ్మంలో కార్యక్రమానికి తాను అందుబాటులో ఉండటం లేదన్న పార్టీ నాయకురాలు రేణుకాచౌదరి.. తేదీ మార్చాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

మార్చని పక్షంలో తాను హాజరుకాబోనని, తన క్యాడర్‌ను పంపుతానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలే పార్టీ ముందుకు వెళ్లలేక పోవడానికి ప్రధాన అవరోధంగా నిలిచిందని పార్టీలో ద్వితీయ స్థాయి నేతలు అంటున్నారు.

ప్రజల్లో వ్యతిరేకత.. అనుకూలంగా మలుచుకునే వ్యూహమేది?

ఎనిమిదేళ్లకుపైగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. దీనిని తమకు సానుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీ క్షేత్ర స్థాయిలో విఫలమవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందుకు బీఆర్‌ఎస్‌ నాయకత్వం గ్రామస్థాయిలో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ సమ్మేళనాలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతున్నారు.

దీనిని చూసైనా కాంగ్రెస్‌ నాయకత్వం ప్రజల మధ్య నిరంతరం ఉండేలా కార్యాచరణకు పూనుకోవడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాము కాంగ్రెస్‌ను కోరుకుంటున్నా.. తమ నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్‌ నాయకుడు కనిపించడం లేదన్న చర్చ కూడా కొన్ని ప్రాంతాల్లో వినిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థతి ఉందని వారు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ఖర్చు పెట్టి.. టికెట్‌ రాకపోతే?

ఫలానా నియోజకవర్గం నుంచి ఫలానా నాయకుడే నిలబడతాడు.. అని చెప్పుకొనే పరిస్థితి కాంగ్రెస్‌లో ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా అంశంపై నిరసన కార్యక్రమమో మరొకటో చేయడానికి కూడా ఎవరూ చొరవ చూపించడం లేదు. అదేమంటే ఇప్పుడే ఖర్చు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ‘టికెట్‌ వస్తుందనే గ్యారెంటీ లేదు.

ఇప్పుడు నేను ఖర్చు పెట్టి కార్యక్రమం చేసినా రేపొద్దున నాకు టికెట్‌ రాకపోతే? ఇప్పడు పెట్టిన ఖర్చు దండగే కదా’ అనే అభిప్రాయాన్ని ఒక నేత వ్యక్తం చేశారు. కనీసం హామీ ఉంటే ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఏమీ ఉండదని ఆయన అన్నారు. దాదాపు ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉన్నది.

ధరణి లోక్‌ అదాలత్‌ల ఊసేది?

ధరణి సమస్యలపై గ్రామాల వారీగా అదాలత్‌లు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జై రామ్‌ రమేశ్‌ గాంధీభవన్‌లో ప్రెస్ మీట్‌ పెట్టి మరీ ఈ విషయం చెప్పారు. కానీ అ తరువాత ఎక్కడా ధరణిపై అదాలత్‌ నిర్వహించినట్లు కనిపించడం లేదు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలను పీడిస్తున్న ధరణిని రద్దు చేస్తామని పార్టీ అధినాయకత్వం దర్జాగా ప్రకటించింది.

అదే సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ రికార్డులలో పారదర్శకత కోసం, రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం కోసం ఏమి చేస్తామన్న నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో అసలు కాంగ్రెస్‌లో ధరణిపై స్పష్టత ఉందా? అన్న ప్రశ్నలు కూడా గ్రామాల్లో వినిపిస్తున్నాయి. అసలు రైతాంగం కోరుకుంటున్నది ఏమిటి? తాము వాటిపై ఏం చేయగలుగుతాం అన్నది ఎక్కడా చెప్పకపోవడాన్ని పలువురు నిపుణులు సైతం ప్రస్తావిస్తున్నారు.