12 కోట్ల.. విలువైన పురాతన బుధ్ధ విగ్రహం చోరీ

వ్యాన్‌లో వచ్చిన దొంగలు.. 25 నిమిషాల్లో మాయం
లాస్ ఏంజలీస్: అమెరికాలోని లాస్ ఏజలీస్‌లో ఉన్న బరకత్ ఆర్ట్ గ్యాలరీలో అరుదైన, అతి విలువైన కాంస్య బుద్ధ విగ్రహం చోరీకి గురైంది. దీని విలువ 12.5 కోట్ల రూపాయలు. ఇది జపాన్‌కు చెందిన పురాతన కాంస్య బుధ్ధ విగ్రహం.
ఇది జపాన్‌లోని ఇడోకాలం (1603-1867) నాటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహానికి తల చుట్టూ కాంతి కోసం ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 55 సంవత్సరాలుగా ఈ విగ్రహం ఈ గ్యాలరీలో ఉంటున్నది. గ్యాలరీలో వున్న అన్ని కళాఖండాలలోనూ ఇదే చాలా ఆకర్షణీయమైనదిగా చెబుతారు.
ఆదివారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో ఒక వ్యాన్‌లో నలుగురు వ్యక్తులు గేట్‌ను తోసేసుకొని గ్యాలరీ లోనికి ప్రవేశించారు. 25 నిమిషాల్లో విగ్రహాన్ని దోచుకెళ్ళారు. ఈ చోరీ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఆర్ట్ గ్యాలరీని అమెరికాలోఅత్యంత సురక్షితమైన ప్రాంతంగా భావిస్తారు.