చెదల పాలైన రూ.1.5 లక్షలు.. ఆవేదన వ్యక్తం చేసిన దంపతులు
విధాత: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. భర్త మేస్త్రీ పని చేస్తుండగా, భార్య ఇతర కూలీ పనులకు వెళ్తూ జీవనం కొనసాగిస్తున్నారు. తమకు సంతానం లేక పోవడంతో వృధ్యాపంలో బతికేందుకు, తాము సంపాదించిన డబ్బులో కొంత దాచి పెట్టుకున్నారు. బ్యాంకు ఖాతా లేకపోవడంతో.. ఇంట్లోనే సూట్ కేసులో భద్ర పరుచుకున్నారు. కానీ ఆ డబ్బంతా చెదలపాలైంది. దీంతో ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సంజయ్ […]

విధాత: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. భర్త మేస్త్రీ పని చేస్తుండగా, భార్య ఇతర కూలీ పనులకు వెళ్తూ జీవనం కొనసాగిస్తున్నారు. తమకు సంతానం లేక పోవడంతో వృధ్యాపంలో బతికేందుకు, తాము సంపాదించిన డబ్బులో కొంత దాచి పెట్టుకున్నారు.
బ్యాంకు ఖాతా లేకపోవడంతో.. ఇంట్లోనే సూట్ కేసులో భద్ర పరుచుకున్నారు. కానీ ఆ డబ్బంతా చెదలపాలైంది. దీంతో ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సంజయ్ నగర్‌కు చెందిన గడ్డం లక్ష్మయ్య, లక్ష్మి దంపతులు.. కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
భర్త మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, లక్ష్మి కూలీ పనులకు వెళ్తుండేది. అయితే వీరికి పిల్లలు కలగకపోవడంతో.. ముసలి తనంలో బతికేందుకు రూ. 1.5 లక్షల దాకా నగదును ఇంట్లోనే దాచుకున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్ష్మయ్య ఇల్లు పూర్తిగా దెబ్బతిని ఇంట్లో చెద పురుగులు వచ్చాయి.
ఈ క్రమంలో ఇంట్లో నగదు దాచి ఉంచిన పీవీసీ సూట్‌కేసును లక్ష్మయ్య బయటకు తీయగా, దానికి కూడా చెదలు పట్టాయి. సూట్‌కేస్‌ను తెరిచి చూడగా, అందులో ఉంచిన రూ.2000, రూ.500, రూ.200, రూ. 100 నోట్లను పూర్తిగా చెదలు తినేశాయి. ఇది చూసి దంపతులిద్దరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికుల సూచన మేరకు ఆ నోట్లను పట్టుకుని, ఇల్లెందులోని బ్యాంకుల చుట్టూ తిరిగారు. కానీ ఆ నోట్ల మార్పిడి జరగలేదు. హైదరాబాద్ వెళ్లాలని స్థానిక బ్యాంకు అధికారులు వారికి సూచించగా హైదరాబాద్‌కు వెళ్లే స్థోమత తమకు లేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బ్యాంకు ఖాతా లేక పోవడంతోనే, ఇంట్లోనే నగదు దాచామని దంపతులు పేర్కొన్నారు.