చిత్తశుద్ధి లేని రాజకీయాలు.. మనుగడ సాగించలేవు!
విధాత: ఒక రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో ప్రభావాన్ని చూపెట్టలేదు. పైగా అక్కడ ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా మారిపోతుంది. దీనికి ఉదాహరణ ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు తర్వాత యూపీలో బలమైన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఉత్తరాఖండ్‌లో నిలదొక్కు కోలేదు. అక్కడ ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకునే సీట్లు సంపాదించ లేదు. అట్లనే బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్‌లోనూ ఆర్జేడీ, జేడీయూ నామమాత్రమే అయ్యాయి. […]

విధాత: ఒక రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో ప్రభావాన్ని చూపెట్టలేదు. పైగా అక్కడ ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా మారిపోతుంది. దీనికి ఉదాహరణ ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు తర్వాత యూపీలో బలమైన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఉత్తరాఖండ్‌లో నిలదొక్కు కోలేదు. అక్కడ ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకునే సీట్లు సంపాదించ లేదు. అట్లనే బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్‌లోనూ ఆర్జేడీ, జేడీయూ నామమాత్రమే అయ్యాయి.
బీహార్‌లో ఆ పార్టీలకు ఉన్న పట్టు జార్ఖండ్‌లో లేదు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉంటున్నది. అంతే గానీ ఆ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి కాంగ్రెస్ నుంచి బైటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నా ప్రజలు ఆదరించలేదు. దీనికి కారణం లేకపోలేదు. ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. వాటికి జాతీయ పార్టీలకు వలె విధానాలు ఉండవు, దృక్పథాలు ఉండవు.
ఒకవేళ ఉన్నా అవి తమ సొంత రాష్ట్రంలోనే ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్సీ, టీఆర్‌ఎస్, తృణమూల్, జేడీయూ, జేడీఎస్, వైసీపీ, టీడీపీ, శివసేన, ఎన్సీపీ లాంటివి ఆయా రాష్ట్రాల్లో మనుగడ సాగిస్తున్నాయంటే వాటి మూలాలు, వాటి ప్రయోజనాలు వాటి సొంత రాష్ట్రాల తోనే ముడిపడి ఉన్నాయన్నది వాస్తవం.
అందుకే తెలంగాణ ఆవిర్భావం అనంతరం రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మొదటి సారి కొన్ని ఓట్లు సీట్లు దక్కించుకున్నా ప్రస్తుతం ఆ పార్టీల ప్రభావం ఈ రాష్ట్రంలో అంతంత మాత్రమే. టీడీపీకి పేరుకే తెలంగాణ శాఖ ఏర్పాటు చేసింది. కానీ దానివల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని వాళ్లకూ తెలుసు. ఇక వైసీపీ అయితే ఏపీ ప్రయోజనాలు, అభివృద్ధి, హక్కుల కోసం పనిచేస్తున్న తాము తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టమని బహిరంగంగానే ప్రకటించి దూరంగానే ఉంటున్నది.
కానీ జగన్ సోదరి వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వెనుక బీజేపీ ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ ప్రయత్నం ఎంత ఉన్నదో ఆయనకు షర్మిల సహకారం కూడా అంతే ఉన్నది. ఆయన జైలుకు వెళ్లిన సందర్భంలో పార్టీ విచ్ఛిన్నం కాకుండా పాదయాత్ర చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.
వాళ్ల కుటుంబంలో వచ్చిన విభేదాలు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడానికి కారణమని అనుకోలేం. ఏపీలో తన సోదరుడికి వ్యతిరేకంగా పార్టీ పెడితే రాజకీయంగా జగన్‌కు ఇబ్బందితో పాటు అది పరోక్షంగా టీడీపీకి ఉపయోగ పడుతుందనే విషయం వారికి తెలియంది కాదు.
అందుకే ఏపీలో జగన్‌కు నష్టం చేయకుండా.. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తూ.. రాజకీయంగా కొంత లబ్ధి పొందాలని చూస్తున్నది. అందుకే షర్మిల అరెస్టుపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన కామెంట్లు చూస్తే.. జగన్, షర్మిల మధ్య ఉండే విభేదాలు ఏవైనా కావొచ్చు. కానీ ఆమెను రాజశేఖర్‌రెడ్డి కూతురు అని, ఆమె పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మాకు ఇబ్బంది కలిగించ కుండా ఏ రాష్ట్రంలో అయినా షర్మిల రాజకీయాలు చేసుకోవచ్చు అని చెప్పకనే చెప్పారు.
అయితే వైసీపీ, టీడీపీలు మనుగడ సాగించలేమని భావించి వదిలేసిన తెలంగాణలో షర్మిల చేస్తున్న రాజకీయ రచ్చ అంతా తన ఉనికిని కాపాడుకోవడానికి, ఖమ్మం లాంటి చోట్ల ఒకటి రెండు సీట్లు సంపాదిం చాలనే ఆరాటం తప్పా ఇక్కడి ప్రయోజనాలు గాని, తెలంగాణ హక్కుల విషయంలో గానీ ఆమెకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.
ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ విభజన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు. పైగా ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. వీటిపై షర్మిల ఏనాడూ స్పందించలేదు. కేంద్రంలోని బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. పైన పేర్కొన్నట్టు ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో ఉప ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా మారిపోయినట్టే..
అసలు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన షర్మిల నాడు ఇక్కడి ఉద్యమకారులను టెర్రరిస్టులు అన్నట్టే నిన్న కూడా అదే పదాన్ని మరోసారి వినియోగించడం.. అంటే ఆమె లక్ష్యం ఏమిటో? ఆమె ఎవరి కోసం పనిచేస్తున్నదో తెలుసుకోలేనంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు.