వలసల సీజన్‌లో.. ఆయారాం..గయారాం! కాంగ్రెస్‌లోకి మళ్లీ కుంభం.. బీఆర్‌స్‌లోకి వివేక్‌

వలసల సీజన్‌లో.. ఆయారాం..గయారాం! కాంగ్రెస్‌లోకి మళ్లీ కుంభం.. బీఆర్‌స్‌లోకి వివేక్‌
  • కాంగ్రెస్‌లోకి మళ్లీ కుంభం..
  • రేపోమాపో మైనంపల్లి.. joinings re joings in brs congressరేఖానాయక్‌..భేతి, రాథోడ్‌..వేముల, కసిరెడ్డిలు
  • బీఆర్‌స్‌లోకి మాజీ ఎంపీ వివేక్‌
  • జంప్ జిలానీల జాబితాలో మరింత మంది

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ధి ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. అధికార బీఆరెస్ నుంచి విపక్ష కాంగ్రెస్‌, బీజేపీలలోకి కొందరు చేరుతుండగా, మరికొందరు ఆ పార్టీల నుంచి బీఆరెస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి, తుమ్మలల చేరికలతో సాగుతున్న వలసల జాబితా మరింత పెరుగుతుంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆరెస్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. అనిల్ సోమవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అపరిమిత అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌లో అనుభవించిన అనిల్‌కు బీఆరెస్‌లో అధినేతలను కలవడం..రాజకీయ డిమాండ్లు సాధించుకోవడం ఎంత కష్టమో రోజుల తేడాలోనే అవగతమైంది. సామాజిక సమీకరణ నేపధ్యంలో తనకు టికెట్ దక్కదన్న ఆందోళనతో అనిల్ హడావుడిగా కారెక్కారు. వెంటనే కారు దిగేసి సొంత గూటికి చేరబోతున్నారు. అంతలోగానే భువనగిరి నియోజకవర్గంలో జిట్టా బాలకృష్ణారెడ్డి రూపంలో మరో నేత కాంగ్రెస్ లో చేరిపోవడం గమనార్హం.


మరోవైపు బీఆరెస్ అధిష్టానంతో విభేదించిన మల్కాజ్‌గిరి బీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావులు ఈనెల 27లోపుగా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. ఖానాపూర్ బీఆరెస్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్‌నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకోగా, రేఖానాయక్ రేపో ఎల్లుండో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. నకిరేకల్ బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీలో ఎదురుచూపులు పడుతున్నారు. ఈ దఫా టికెట్ దక్కని బోథ్ సిటింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మూడు రోజులుగా ప్రగతి భవన్ వద్ధ కేసీఆర్‌, కేటీఆర్‌లను కలిసేందుకు పడిగాపులు పడి మరింత నిరాశ చెందారు. రాథోడ్ స్థానంలో బోథ్ టికెట్‌ను అనిల్ జాదవ్‌కు అప్పగించారు. టికెట్ నిరాకరించినా తనను కనీసం పిలిచి బుజ్జగించకపోవడంపై అసహనంతో ఉన్న రాథోడ్ బాపురావు కూడా హస్తం గూటిగా చేరేందుకు సిద్ధమయ్యారు.


ఉప్పల్ సిటింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి తనకు బీఆరెస్ అధిష్టానం ఈ దఫా టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో రగిలి పోతుండగా ఆయన కూడా రేపో ఎల్లుండో కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. మహబూబ్‌ నగర్ కు చెందిన ఎమ్మెల్సీ కూచుమళ్ల సుదర్శన్‌రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా, తాజాగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి టికెట్ ఆశిస్తు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లుగా అనుచర వర్గాల కథనం. ఆయన ఈనెల 29న కాంగ్రెస్‌లో చేరుతారని తెలుస్తోంది. బీజేపీ నుంచి మరికొంత మంది అసంతృప్త సీనియర్ నేతలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


బీఆరెస్‌లోకి మాజీ ఎంపీ వివేక్‌


విపక్ష కాంగ్రెస్‌లోకి జోరుగా సాగుతున్న వలసకు ధీటుగా బీఆరెస్ కూడా కాంగ్రెస్‌, బీజేపీల నుంచి వలసలను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని మళ్లీ బీఆరెస్‌లోకి రప్పించేందుకు మంతనాలు పూర్తయ్యాయి. బీఆరెస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇప్పటికే వివేక్ తో చర్చలు జరపగా, ఆయన నేడో రేపో బీఆరెస్‌లో చేరబోతున్నట్లుగా సామాజిక మాద్యమాల్లో సుమన్‌తో కూడిన ఫోటోలతో జోరుగా ప్రచారం సాగుతుంది.


దీంతో వీవేక్ బీఆర్‌స్‌లో చేరడం లాంఛనమేనని తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ హామీతో ఆయన కారెక్కేందుకు సిద్ధపడ్డారని సమాచారం. గతంలో సీఎం కేసీఆర్‌తో తీవ్రంగా విభేదించిన వీవేక్ మళ్లీ బీఆరెస్‌లో చేరనుండటం ఆసక్తికరం. కేసీఆర్‌తో విబేధించిన ఏపూరి సోమన్న సైతం ఇటీవల బీఆరెస్‌లో చేరడం ఈ సందర్భంగా గమనార్హం.