కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ ఎందుకు వద్దంటే!

కాళేశ్వ‌రం అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా తన కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టింది

కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ ఎందుకు వద్దంటే!
  • ‘కాళేశ్వరం’లో అవినీతిపై ఏది బెటర్‌?
  • సీబీఐ విచారణతో అంతా కేంద్రం చేతిలో
  • కేసు నీరుగారిపోయేందుకు అవకాశాలు
  • అనుమానిస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌
  • ఆలోచించే న్యాయ విచారణకే మొగ్గు!
  • ‘కేంద్ర’ దర్యాప్తుతో బీజేపీ గుప్పిట్లో కేసీఆర్‌!
  • కిషన్‌రెడ్డి ‘సీబీఐ’ డిమాండ్‌ వెనుక కథ ఇదీ?
  • ఇప్ప‌టికే బీఆరెస్‌- బీజేపీ మ‌ధ్య ర‌హ‌స్య అవ‌గాహ‌న ఉంద‌న్న ప్రచారాలు

విధాత‌, హైద‌రాబాద్‌: కాళేశ్వ‌రం అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా తన కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచీ కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పెద్ద కుంభకోణమని అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. కాళేశ్వ‌రం అవినీతిపై పోరాటం చేసింది. ఇదే స‌మ‌యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లోని మేడిగ‌డ్డ బరాజ్‌ పిల్ల‌ర్లు కుంగాయి. అది జరిగిన రెండ్రోజులకే అన్నారం బరాజ్‌లో బుంగ ప‌డింది. దీంతో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అవినీతి జ‌రిగింద‌ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోప‌ణ‌లకు బ‌లం చేకూరింది. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్నిప్ర‌ధానంగా తీసుకున్న‌ది. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే విచార‌ణ చేసి, దోషులు ఎంత‌టి వారైనా శిక్షిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల్లో గెలిచి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన కాంగ్రెస్ పార్టీ ముందుగా కాళేశ్వ‌రంపై విచార‌ణకు సిద్ధమైంది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.


అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి పూర్తి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. సాగునీటి పారుద‌ల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కాళేశ్వ‌రంపై మేడిగడ్డ బరాజ్‌ వద్దే స‌మీక్ష నిర్వ‌హించారు. అనేక ప్ర‌శ్న‌లు వేశారు. స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి ప్రాజెక్ట్‌ను సంద‌ర్శించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆయ‌క‌ట్టు వివ‌రాల‌న్నింటితో ఈఎన్సీతో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇప్పించారు. ల‌క్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వ‌రంలో 90 వేల ఎక‌రాల‌కు మాత్ర‌మేసాగు నీరు ఇవ్వ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌ని మంత్రులు అక్క‌డే అధికారుల‌ను ప్ర‌శ్నించారు. దీని త‌రువాత జుడిషియ‌రీ విచార‌ణ‌కు ఆదేశిస్తున్నామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ప్ర‌క‌టించారు.


సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్‌

కాళేశ్వ‌రం అవినీతిని నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రం సీబీఐ విచార‌ణ కోరుతూ లేఖ రాస్తే వెంట‌నే ఆ మేరకు ఆదేశాలిస్తామని కూడా చెబుతున్నారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వంలోని విచార‌ణ సంస్థ‌ల‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం నమ్మకం పెట్టుకోలేదని, అందుకే న్యాయ విచారణకే వెళుతున్నదని సమాచారం. సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి విచార‌ణ సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పైనే ప్ర‌యోగిస్తుంద‌న్నఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో కాళేశ్వ‌రం అవినీతిపై సీబీఐ విచార‌ణ కోరితే.. బీఆరెస్ అధినేత‌లు బీజేపీతో అవ‌గాహ‌న‌కు వ‌చ్చి కేసును నీరుగార్చే అవ‌కాశం ఉంద‌న్న సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అదే సమయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. ఆ విచారణ నివేదికతో కేసీఆర్‌ను, బీఆరెస్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవచ్చనే బీజేపీ నేతలు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీతో బీఆరెస్‌కు ర‌హ‌స్య అవ‌గాహ‌న ఉంద‌న్న చ‌ర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం న్యాయ విచారణ‌కు ఆదేశించ‌డ‌మే స‌రైంద‌న్నఅభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

న్యాయ విచార‌ణ త‌రువాత వ‌చ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌చ్చు. కాళేశ్వరంలో అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించ‌డానికి సిద్ధమైన కాంగ్రెస్ స‌ర్కారు జుడిషియ‌రీ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తిని కోర‌నున్న‌ది. ఈ మేర‌కు త్వ‌ర‌లో లేఖ రాయ‌నున్న‌ట్లు తెలిసింది.

చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటే…

రాష్ట్ర ప్ర‌భుత్వం కోరిక మేర‌కు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సిట్టింగ్ జ‌డ్జితో కానీ, రిటైర్డ్ జ‌డ్జితోకానీ క‌మిష‌న్‌ను నియ‌మిస్తుంది. ఈ క‌మిష‌న్‌ను జీవో ద్వారా ఏర్పాటు చేస్తారు. సివిల్ కోర్టుకు ఉండే అధికారాల‌న్నీ ఈ కమిషన్‌కు ఉంటాయి. మూడు నుంచి ఆరు నెల‌ల వ్యవధిలో విచార‌ణ చేసి నివేదిక ఇవ్వాల‌ని కాలపరిమితి విధించే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్ జ‌స్టిస్‌ ఇచ్చే విచార‌ణ నివేదిక‌కు లీగ‌ల్‌గా చాలా విలువ ఉంటుంది. ఈ నివేదిక‌పై ఆధార‌ప‌డి.. అవ‌క‌త‌వ‌క‌ల‌కు కార‌కులైన వారిపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. స‌హ‌జంగా ప్ర‌భుత్వాధి నేత‌లు రాజ‌కీయ నాయ‌కులే కాబట్టి ఇలాంటి నివేదిక‌ల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశపెట్టి చ‌ర్చించి, రాజ‌కీయంగా బ‌ద‌నాం చేశామ‌ని వ‌దిలేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌దు కానీ చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటే దోషుల‌ను జైలుకు కూడా పంప‌వ‌చ్చున‌ని న్యాయ‌నిపుణులు చెపుతున్నారు.

విచార‌ణ ఇలా…

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ డిజైన్లు, డీపీఆర్‌లు, ఏయే అనుమతులు ఎప్పుడెప్పుడు వ‌చ్చాయి? కేంద్రం ఇచ్చే అనుమ‌తులు, జాతీయ ప‌ర్యావ‌ర‌ణ ట్రిబ్యున‌ల్ అనుమ‌తులు తదితర వివరాలన్నింటినీ కమిషన్‌ అడిగి తీసుకుంటుంది. సివిల్ కోర్టులాగా ఈ క‌మిష‌న్ సాక్షుల‌ను, ఇంజినీర్లను, కాంట్రాక్ట‌ర్ల‌ను, అధికారుల‌ను విచారిస్తుంది. రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా పిలిచి విచారిస్తుంది. నేరారోప‌ణ ఉన్న‌వారి నుంచి స్టేట్‌మెంట్‌ కూడా రికార్డ్‌ చేస్తుంది. ప్రాజెక్ట్ ప్లానింగ్, డీపీఆర్‌, ఎస్టిమేష‌న్స్‌, రివైజ్డ్ ఎస్టిమేష‌న్స్‌, అనుమ‌తులు, అనుమ‌తుల స‌మ‌యంలో స‌మ‌ర్పించిన డీపీఆర్‌లు, ఆ త‌రువాత మార్చిన డీపీఆర్‌లు, టెండ‌ర్లు, ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థల బిడ్డింగ్‌, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థ‌లు, ఎంపిక చేసిన విధానం తదితర వివరాలన్నింటినీ కమిషన్‌ పరిశీలిస్తుంది.


వీటితోపాటు కాంట్రాక్ట‌ర్ల‌కు చెల్లించిన బిల్లులు, ఏయే బ్యాంకుల ద్వారా జ‌రిగింది.. ఎవరెవరి ఖాతాల్లోకి ఆ నిధులు వెళ్లాయి? అంతా క‌రెక్ట్‌గానే బ‌దిలీలు జ‌రిగాయా? ఇలా అన్ని ర‌కాలుగా క‌మిష‌న్ విచార‌ణ చేస్తుంది. వాటన్నింటి ఆధారంగా సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఇలా క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. అయితే చ‌ర్య‌లు తీసుకోవాలా? వ‌ద్దా అనేది కూడా పూర్తిగా ప్ర‌భుత్వ ఇష్టాయిష్టాల‌పైనే ఆధారప‌డి ఉంటుంద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు.