Vande Bharat Express | కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నంబర్.. టికెట్ల వివరాలు ఇవే..!

Vande Bharat Express | తెలంగాణలో ఇప్పటికే వందే భారత్ రైలు పరుగులు తీస్తున్నది. సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ రూట్లో రైలు నడుస్తుండగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ క్రమంలో భారతీయ రైల్వే మరో మార్గంలో రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఐటీ నగరాలైన హైదరాబాద్, బెంగళూరును కలుపుతూ సెమీ హైస్పీడ్‌ను రైలును పట్టాలెక్కిస్తున్నది.
కాచిగూడ- యశ్వంత్‌పూర్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ విధానంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ టికెట్స్ బుకింగ్స్‌ను సైతం దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. కాచిగూడ – యశ్వంత్‌పూర్ చైర్‌కార్ టికెట్ రూ.1600 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌కు రూ.2915 నిర్ణయించారు.
ఇందులోనే కేటరింగి చార్జీలు ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ చైర్క్లార్లో కేటరింగ్ ఛార్జీలు రూ.419 కాగా, చైర్ కార్లో కేటరింగ్ ఛార్జీలు రూ.364. యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు ఛార్జీలు ఏసీ చైర్‌కార్‌కు రూ.1540, ఎగ్జిక్యూటీవ్ చైర్‌కార్‌కు రూ.2865 ఉన్నది. ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.369 కాగా, చైర్‌కార్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.308 నిర్ణయించారు.
కాచిగూడ- యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలుకు 20704 నెంబర్‌ను కేటాయించారు. ఈ రైలు కాచిగూడ నుంచి తెల్లవారు జామున 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. యశ్వంత్‌పూర్ -కాచిగూడ (20704) నంబర్‌గల రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
రెండు నగరాల మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని 8.30 గంటల్లో చేరుతుంది. రైలు మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం రైల్వే స్టేషన్లలో ఆగనున్నది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రయానికి కనీసం పది నుంచి 12 గంటలకుపైగా సమయం పడుతున్నది. వందే భారత్ రైలు అందుబాటులోకి రావడంతో సమయం ఆదా కానున్నది.
తొలుత వందే భారత్ రైలులో ఎనిమిది కోచ్‌లతో నడువనున్నది. ఇందులో ఏడు చైర్కార్లు, ఓ ఎగ్జిక్యూటివ్ కార్ కోచ్ ఉంటుంది. ఇక ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రైళ్లు పరుగులు తీస్తున్నాయి. కాచిగూడ రైలుతో పాటు కొత్తగా విజయవాడ-చెన్నై-విజయవాడ రూట్లోనూ వంద భారత్ రైలు పరుగులు పెట్టబోతున్నది.